దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో నిన్న మరోసారి ప్రజల ప్రశ్నలు ఓడిపోయాయి. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం నుంచి సమాధానం రాలేదు. న్యాయం కోరుతూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులపై లాఠీలు ఎందుకు పడ్డాయో వివరణ లేదు. ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలపై ప్రధాని నుంచి స్పందన అంతకన్నా లేదు. కానీ, సభను వాయిదాల మధ్య నెట్టేయడం మాత్రం యథేచ్ఛగా కొనసాగింది. ఇదంతా చూసినప్పుడు ఎవరికైనా ఒక సందేహం రాకమానదు. ఈ తప్పు నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలదా? లేదంటే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్న పాలకులదా? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మెజా రిటీతో కాదు, జవాబుదారీ తనంతో నిలబడాలి. ఆ జవాబుదారీ తనానికే పార్లమెంట్ సాక్షిగా తాళం పడితే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చించబడ తాయి? మరెక్కడ పరిష్కారమ వుతాయి? పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించడంలో అధికార పక్షానిదే కీలక పాత్ర. కానీ, మోడీ సర్కార్ హయాంలో ప్రతిసారి సభ వాయిదాలతోనే ప్రారంభమ వడం దేశానికి ఏం సంకేతమిస్తోంది? సమాధానాలు కోరే ప్రతిపక్షాన్ని చర్చలతో ఎదుర్కొనే ధైర్యం లేకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలపై చర్చలు జరగకుండా సభలను ప్రతిష్టంభన, వాయి దా, రాజకీయ ఆరోపణలతో నెట్టుకురావడం ఏం సందేశమిస్తోంది? ఈ సమా వేశాల్లో దేశవ్యాప్తంగా యువతను తీవ్ర ఆందోళనకు గురిచేసిన నీట్ పేపర్ లీకేజీపై సభలో సమగ్రచర్చ కోసం ప్రతిపక్షం పట్టుబట్టింది. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి స్వయంగా సభలో ప్రకటన చేయాలని కోరింది. అయితే ఈ డిమాండ్లకు స్పష్టమైన సమా ధానం లేకపోగా సభ పదేపదే వాయిదా పడింది. దీనికి ప్రతి పక్షం నిరసనలే కారణంగా చెబుతున్న ప్రభుత్వం దారితీసిన కారణాలు, వాటిని పరిష్కరిం చడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రం అంగీకరిం చడం లేదు! ఇది కేవలం ప్రతిపక్షం-ప్రభుత్వం మధ్య రాజకీయ ఘర్షణ కాదు. కోట్లాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల జీవి తాలకు సంబంధించిన అంశం. ఒక పరీక్ష పేపర్ లీక్ అయితే అది కేవలం ప్రశ్నాపత్రం లీక్ అయినట్టే కాదు, కష్టపడి చదివిన విద్యార్థుల ఆశలు, శ్రమ, భవిష్యత్తుపై నమ్మకం కూడా దెబ్బతిం టుంది. ఈ పరిస్థితిలో న్యాయం కోరుతూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులను వినాల్సింది పోయి, వారిపై బలప్రయోగం విచారకరం. దీనిపై పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై పోలీసు చర్యను ఖండించారు.
ప్రజల సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. ప్రశ్నలు అడిగారనే కారణంతో ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్థిగా మాత్రమే చిత్రీకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఈ ఘటనలో ప్రధానమంత్రి బాధ్యతా రాహిత్యాన్ని విస్మరించలేం. దేశ యువతలో విశ్వాసం సన్నగిల్లి సంక్షోభం ఏర్పడినప్పుడు, పార్లమెంట్ వేదికగా దేశానికి భరోసా ఇవ్వాల్సింది ప్రధాన మంత్రే. పరీక్షల విశ్వసనీయత దెబ్బతిన్నప్పుడు, విద్యార్థులు వీధుల్లోకి వచ్చినప్పుడు, పార్లమెంట్ స్తంభించిన ప్పుడు దేశ అత్యున్నత నాయకత్వం మౌనం పాటించడం సరైన సందేశం కాదు. రాజ్యాంగపరంగా ప్రభుత్వం మొత్తం పార్లమెంట్‌కు జవాబుదారీ. ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించే ప్రధానమంత్రి కూడా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఇటీవలి కాలంలో పార్లమెంట్లో ఒక ప్రమాదకర ధోరణి పెరుగుతోంది. ప్రజల జీవితాలకు సంబంధించిన కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కానీ చర్చలను పరిమితం చేయడం, రాజకీయ ఘర్షణల మధ్య సమావేశాలను ముగించడం సాధారణమవు తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శుభసూచకం కాదు. పార్ల మెంట్లో ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్న వెనుక కోట్లాది మంది ప్రజల ఆందోళన ఉంటుంది. ఆ ప్రశ్నలను వినడం, చర్చించడం, సమాధానాలు ఇవ్వడం ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో సర్కార్ వైఫల్యం చెందితే ఆ ప్రతిష్టంభనకు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజమే.
ప్రశ్నల నుంచి పారిపోతారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



