Thursday, July 23, 2026
E-PAPER
Homeఆటలువిజయం వేటలో..

విజయం వేటలో..

- Advertisement -

సూర్యవంశీ, శ్రేయస్‌ అయ్యర్‌పై ఫోకస్‌
జింబాబ్వేతో భారత్‌ తొలి టీ20 నేడు

సాయంత్రం 4.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

నవతెలంగాణ-హరారే
టీమ్‌ ఇండియా.. జింబాబ్వే పర్యటన అనగానే ఆర్థికంగా ఆ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ అందిస్తున్న మద్దతుగానే ఎక్కువగా చూసేవాళ్లం. కానీ, తాజా పర్యటనలో చర్చ ఆర్థిక సహకారం నుంచి క్రికెట్‌ వైపు మళ్లింది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఓటములు చవిచూసిన టీమ్ ఇండియా.. విజయమే లక్ష్యంగా జింబాబ్వేలో అడుగుపెట్టింది. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం అందుకోని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం తొలి గెలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు వరుస ఓటములతో దెబ్బతిన్న భారత్‌పై ఈసారి సిరీస్‌ విజయం సాధించాలనే తపన ఆతిథ్య జింబాబ్వే శిబిరంలో కనిపిస్తోంది. ఇరు దేశాలు విజయం వేటలో అస్ర్తాలు సిద్ధం చేస్తుండగా భారత్‌, జింబాబ్వే తొలి టీ20 నేడు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌ సాయంత్రం 4.30 గంటలకు ఆరంభం కానుంది.

కూర్పు కుదిరేనా?
ఇటీవల ఎక్కువగా ఆసియాలోనే టీ20లు ఆడిన భారత్‌.. బ్రిటన్‌ పర్యటనలో పరిస్థితులకు త్వరగా అలవాటు పడలేకపోయింది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌లు భారత్‌ బలహీనతను గొప్పగా సొమ్ము చేసుకున్నాయి. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ పిచ్‌ సైతం పేస్‌కు అనుకూలం. కానీ, ఇక్కడ ఆడిన అనుభవం భారత యువ క్రికెటర్లకు ఉంది. అభిషేక్‌ శర్మ కెరీర్‌ తొలి టీ20 సెంచరీ ఇక్కడే బాదగా, వైభవ్‌ సూర్యవంశీ అండర్‌19 ప్రపంచకప్‌ ఫైనల్లో శతకమోత మోగించింది హరారేలోనే. జట్టుగా మంచిగానే కనిపిస్తున్నా… మైదానంలో ప్రదర్శన తీసికట్టుగా తయారైంది. ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ బ్యాటింగ్‌ బాధ్యత తీసుకోవాలి. టాప్‌ ఆర్డర్‌లో అభిషేక్‌, సూర్యవంశీ ఇద్దరూ హిట్టర్లే. ఈ ఇద్దరిలో ఎవరు నిలిచినా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఇదే సమయంలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు బాధ్యతగా రాణిస్తే భారత్‌ నిలకడగా భారీ స్కోర్లు చేయగలదు. యువ బౌలర్లు మయాంక్‌ యాదవ్‌, అశోక్‌ శర్మ, ప్రిన్స్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌లో ముగ్గురు తుది జట్టులో నిలిచే సూచనలు ఉన్నాయి. హర్ష్‌ దూబె స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా, శివమ్‌ దూబె పేస్‌ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో ఆడనున్నారు. బ్యాటింగ్‌ లైనప్‌ పరంగా సంజు శాంసన్‌ మినహా మిగతా అందరూ బ్రిటన్‌ పర్యటనలో ఆడినవాళ్లే. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. నేడు హరారేలో ఏం జరుగుతుందో చూడాలి.

ఉత్సాహంగా జింబాబ్వే
జింబాబ్వే నెమ్మదిగా పసికూన ట్యాగ్‌కు దూరం జరుగుతూ వస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌8కు చేరుకున్న జింబాబ్వే.. ఇటీవల బంగ్లాదేశ్‌పై ఏకైక టెస్టు లో విజయంతో పాటు వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. టీ20ల్లో ఓడినా.. టెస్టు, వన్డే సిరీస్‌ విజయాలు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. సికందర్‌ రజా సారథ్యంలోని జింబాబ్వే పూర్వ వైభవం సాధించే దిశగా దూసుకెళ్తోంది. టీ20ల్లో భారత్‌పై జింబాబ్వే మూడు విజయాలు సాధించగా.. ఆ మూడు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లోనే జరిగాయి. బ్రియాన్ బెనెట్‌, మారుమణి, మేయర్స్‌, బ్రాడ్‌ ఎవాన్స్‌ బ్యాట్‌తో జింబాబ్వేకు కీలకం కానుండగా.. నుమాన్‌, రిచర్డ్స్‌, బ్లెస్సింగ్‌ ముజరబాణిలు జింబాబ్వేకు కీలకం. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలం. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పేస్‌కు మరింత మేలు చేస్తున్నాయి. ఇక్కడ టీ20ల్లో మంచి స్కోర్లు నమోదయ్యాయి. భారత్‌, జింబాబ్వే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లో ఇక్కడే జరుగుతాయి. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సిరీస్‌లో సగటున 180-200 పరుగులు సాధించే అవకాశాలు ఉన్నాయి. తొలి టీ20కు వర్షం సూచనలు లేవు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -