అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు
మూడు రాష్ట్రాల్లో 12 స్థానాలకు పోలింగ్ ..అదే రోజు ఓట్ల లెక్కింపు
ఈనెల 29న నోటిఫికేషన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ , పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజ్యసభలో ఖాళీ కానున్న 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్‌లో ఒకటి, పశ్చిమ బెంగాల్‌లో ఒక స్థానానికి అక్టోబర్ 16న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
సెప్టెంబర్ 29న నోటిఫికేషన్
ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 29న విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 6 చివరి తేదీగా ఈసీ నిర్ణయించింది. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అక్టోబర్ 9 వరకు గడువు ఇచ్చారు. అక్టోబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను అక్టోబర్ 19లోపు పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. రాజ్యసభ ఎన్నికల్లో బ్యాలెట్‌పై ప్రాధాన్యం గుర్తులను నమోదు చేసేందుకు రిటర్నింగ్ అధికారి అందించే నిర్దిష్ట వైలెట్ రంగు స్కెచ్ పెన్‌ను మాత్రమే ఉపయోగించాలని ఈసీ స్పష్టం చేసింది. ఇతర పెన్నులతో గుర్తులు వేయకూడదని పేర్కొంది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పరిశీలకులను నియమించి, మొత్తం ప్రక్రియను పర్యవేక్షించనున్నట్టు తెలిపింది. నవంబర్ 25తో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సహా పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. వీరిలో ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ నాయకులు అరుణ్ సింగ్, గీతా షాక్య, నీరజ్ శేఖర్, బ్రిజ్‌లాల్, బిఎల్ వర్మ, సీమా ద్వివేది, ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన రామ్జీ గౌతమ్ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని రాజ్యసభ స్థానం రుక్మిణి మల్లిక్ రాజీనామాతో 2026 జులై 16న ఖాళీ అయింది. ఈ స్థానానికీ ఇదే షెడ్యూల్ ప్రకారం ఉపఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం.. అసెంబ్లీలో ఉన్న స్థానాలను బట్టి యూపీలోని 10 స్థానాల్లో 8 బీజేపీ, రెండు స్థానాలు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ రాజ్యసభ ఎంపీని కలిగి ఉన్న బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి యూపీ అసెంబ్లీలో సభ్యులు లేనందున రాజ్యసభ సీటు దక్కే అవకాశం లేదు. బీఎస్పీకి ఇది క్లిష్టకాలమనే చెప్పుకోవాలి. దీనికి యూపీ అసెంబ్లీలోని ఉభయ సభల్లో, పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక్క సభ్యుడూ లేరు. 1989 తరువాత బీఎస్పీకి ఈ పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక, ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒక్క స్థానాన్ని బీజేపీ దక్కించుకోనుంది. ఆ పార్టీకి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నందున ఆ సీటు బీజేపీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ సీటును బీజేపీయే గెలుచుకోనుంది. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మోగిన ఎన్నికల నగారా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



