Wednesday, September 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం

- Advertisement -

ఏసీ పేలి ముగ్గురు నవజాత శిశువులు మృతి
24 మందికి అస్వస్థత ..ప్రయివేటు ఆస్పత్రులకు తరలింపు
విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
ఆస్పత్రిని సందర్శించినవైద్యారోగ్య శాఖ మంత్రి

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ ‌రిమ్స్‌ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి కండ్లు కూడా సరిగా తెరవని నవజాత శిశువులు చికిత్స పొందుతున్న ప్రత్యేక నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌తో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. వైద్య సిబ్బంది కేకలు వేస్తూ బయటకి వచ్చి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో మంటలు వస్తున్నాయని తెలపడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ విభాగానికి చేరుకుని 27 మంది నవజాత శిశువులను కాపాడారు. అందులో ఒకరు అప్పటికే మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణం కోల్పోయారు.

అర్ధరాత్రి ఉరుకులు పరుగులు
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)లోని ప్రత్యేక నవజాత శిశుసంరక్షణ కేంద్రంలో సోమవారం 11.45 గంటల సమయంలో కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ విభాగంలోని రిసెప్షన్‌ వద్ద ఉన్న ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌తో పేలుడు సంభవించింది. అందులోని గ్యాస్‌ లీకై దట్టమైన పొగ అలుముకుంది. అక్కడున్న వైద్యులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయం నెలకొంది. తల్లిదండ్రులు, కుటుంబీకులు కొంతమంది సిబ్బంది లోపలకు వెళ్లి చిన్నారులను ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. అప్పటికే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రుల రోదనలు, చిన్నారుల ఏడుపులతో ఆ వార్డు దద్దరిల్లింది. మిగతా వార్డుల్ల చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కొంతమంది సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి నవజాత శిశువులను కాపాడారు. అయినప్పటికీ ఓ శిశువు పొగతో ఊపిరాడక ప్రాణం కోల్పోయింది. ప్రమాద తీవ్రత పెరగకుండా ఆ వార్డులో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఇంక్యుబేటర్లు పనిచేయడం ఆగిపోయాయి. వెంటిలేటర్లపై ఉన్న నలుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే అర్ధరాత్రి కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్సీ అఖిల్‌ మహాజన్‌ రిమ్స్‌కు చేరుకుని సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులను జిల్లా కేంద్రంలోని ప్రయివేటు చిల్డ్రన్‌ ఆస్పత్రులకు తరలించారు.

కండ్లు తెరవక ముందే ఆగిన ఊపిరి
ఇచ్చోడ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన సలీంఖాన్‌(ఫీర్‌ఖాన్‌)-సబానాఖాన్‌కు శుక్రవారం పాప జన్మించింది. ఏడు నెలలకే పాప జన్మించడంతో ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెరకు చెందిన షేకుబాయి-కుమ్ర దినేష్‌ దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ఎనిమిది నెలలకే బిడ్డ పుట్టడంతో ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. పొగ వల్ల అస్వస్థతకు గురైన చిన్నారిని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఉట్నూర్‌ మండల కేంద్రానికి చెందిన సబా సమ్రిన్‌-తౌఫిక్‌ దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. బరువు 1100 గ్రాములే ఉండటంతో ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. పొగతో ఊపిరాడక చిన్నారి అస్వస్థతకు గురైంది. మొదట జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌, అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలించారు. అక్కడికి చేరుకునే సమయంలోనే చిన్నారి మృతిచెందింది.

​సమగ్ర విచారణ చేపడతాం : 
మంత్రి దామోదర రాజనర్సింహ
వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, స్థానిక ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో మంగళవారం రిమ్స్‌కు చేరుకున్నారు. ఎస్‌ఎన్‌సీయూతో పాటు పలు వార్డులను పరిశీలించారు. రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. దాదాపు గంటకుపైగా పలువురు రోగులతో మాట్లాడి సంఘటన తీరు అడిగి తెలుసుకున్నారు. ఎలక్ట్రికల్‌, ఫైర్‌, సివిల్‌ స్ట్రక్చర్‌ ఆడిట్‌లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. వారం రోజుల్లో అందే నివేదిక ఆధారంగా తగు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా 150 పడకలతో కూడిన మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. వంద రోజుల్లో రిమ్స్‌ ప్రక్షాళన చేపట్టి రూపురేఖలు మార్చుతా మన్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా పునరా వృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -