ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సర్కార్ సన్నద్ధం
రాష్ట్ర నిపుణుల కమిటీ
తొలి సమావేశం
అభిప్రాయాలు వెల్లడించిన వివిధ విభాగాలు
శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా ప్రణాళిక రూపకల్పన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్‌నినో సవాళ్లను తట్టుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, వ్యవసాయం దాని అనుబంధ రంగాల కోసం కార్యాచరణ రూపొందించడానికి చర్యలు చేపట్టింది. ఎన్‌నినోపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 27 మంది సభ్యులతో కూడిన బహుళ విభాగాల నిపుణుల కమిటీ తొలి సమావేశం బుధవారం ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి అధ్యక్షతన జరిగింది. భారత వాతావరణ శాఖ, ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ, భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ, మార్క్ ఫెడ్, ఆయిల్‌ఫెడ్, జాతీయ విత్తన సంస్థ, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు సభ్యులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎల్‌నినో, లానినా, సముద్ర ఉపరితల, ఉప ఉపరితల ఉష్ణోగ్రత మార్పులు, ఓషనిక్ నినో ఇండెక్స్, ఇండియన్ ఓషన్ డైపోల్, ప్రపంచ వాతావరణ ప్రసరణ వ్యవస్థలు, వాటి ప్రభావం, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, కాలానుగుణ వాతావరణ పరిస్థితులపై ఎలా ఉంటుందనే అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎల్‌నినో, నైరుతి రుతుపవనాల మధ్య చారిత్రక సంబంధం, వర్షపాతం పంపిణీ, వాతావరణ వైవిధ్యం, తెలంగాణలో ఆలస్యమైన రుతుపవనాల ప్రవేశం, మధ్యలో ఏర్పడిన విరామాలు, జిల్లాల వారీగా వర్షపాతం ధోరణులు, భారత వాతావరణ శాఖ అంచనాలను సమీక్షించారు. గత ఆరు నెలలుగా ఎల్ నినో ప్రభావంతో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున 30 శాతం వర్షపాత లోటు నమోదైందనీ, 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 23 జిల్లాల్లో వర్షపాత లోటు ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షపాత లోటు నమోదైన జిల్లాలు, మండలాల వారీ వాతావరణ సమాచారం, వర్షపాతం, పంటల విస్తీర్ణ వివరాలపై శాస్త్రీయ విశ్లేషణ ఆధారంగా కమిటీ పలు నిర్ణయాలను ప్రతిపాదించింది. ‘‘పర్యావరణ అసమతుల్యత చివరికి మానవాళిపైనే ప్రభావం చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ప్రకృతితో సమన్వ యంగా జీవించాల్సిన అవసరం ఉంది. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ప్రజల్లో అవగాహన, సామాజిక భాగస్వామ్యం కల్పించడం. సమిష్టి కృషి, శాస్త్రీయ మార్గదర్శకత్వం, సమన్వయ చర్యలతో వాతావరణ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కో గలం’’ అని కమిటీ విశ్వాసం వ్యక్తం చేసింది. వ్యవసాయాన్ని వాతావరణ మార్పులకనుగుణంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రీయ పంట ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ, అంతర పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పంటలు, చిరుధాన్యాల ప్రోత్సాహం, సమర్థవంతమైన నీటి వినియోగం, శాస్త్రీయ సలహాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కమిటీ నొక్కిచెప్పింది. సమీకృత జల వనరుల నిర్వహణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు చేపట్టాలని పేర్కొంది. నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ప్రవాహాలు, సాగునీటి లభ్యత గురించి, జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గడం, విద్యుత్ డిమాండ్ పెరగడం, గరిష్ఠ వినియోగ సమయాల్లో విద్యుత్ కొరత వంటి సవాళ్లను ఇందన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ వివరించారు. రాష్ర్ట ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త స్టెల్లా తమతమ శాఖలకు సంబంధించి ఎల్‌నినో వల్ల ఎదుర్కుంటున్న సవాళ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా, భూగర్భ జల విభాగం డైరెక్టర్ కె లక్ష్మ , ఐసీఏఆర్-క్రిడా డైరెక్టర్ వినోద్ కుమార్ సింగ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి, పీవీ నర్సింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జ్ఞాన ప్రకాష్, టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జితేష్ వీ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సర్కార్ సన్నద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



