కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలి
విద్యార్థులపై పాశవిక దాడిని ఖండిస్తున్నాం
ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలు.. మోడీపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధం
ఆయనను గద్దె దించి.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందాం : కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పి.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై పోరాటం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే పాశవికంగా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడిని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొడంగల్‌లో భారీ నిరసనా ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి చిత్రాలతో కూడిన బ్యానర్‌తో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో కలిసి సీఎం కాలినడకన అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. నీట్ పేపర్ లీక్‌తో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చిందని ఆరోపించారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలను అమ్ముకుని బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు చేపట్టిన నిరసనకు రాజకీయాలకు అతీతంగా ఆయా పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, నీట్ పేపర్ లీక్ చేసిన బాధ్యులను జైల్లో పెట్టాల్సింది పోయి.. విద్యార్థులపై పాశవికంగా దాడి జరుపుతారా అని ప్రశ్నించారు. విద్యార్థినులపై దుర్మారంగా దాడి చేయడమే కాకుండా.. విద్యార్థుల తలలు పగులగొట్టారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని ఇంటి ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై పాశవికంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఈ దాడిలో రాహుల్ గాంధీ రక్తం నేలకు చిందిందని, దేశం కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబానికి కొత్త కాదని గుర్తు చేశారు. ఆంగ్లేయులతో పోరాడి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.
దేశాన్ని దోచుకుంటున్న నరేంద్ర, ధర్మేంద్ర
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 2019లో ఇంటర్ ఫలితాల్లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా అవకతవకలకు పాల్పడిందని గుర్తు చేశారు. ఆ సంస్థ 27 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొందని తెలిపారు. అనుభవం, అర్హత లేకపోయినా రాజకీయ ఒత్తిళ్లతో ఆనాడు కేటీఆర్ తన బినామీ సంస్థ గ్లోబరీనాకు ప్రాజెక్టును అప్పగించారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో పప్పులు ఉడకవని గ్లోబరీనా సంస్థ కోఎంప్ట్ ఎడ్యుటెక్‌గా పేరు మార్చుకుని గ్లోబరీనా సంస్థ కేంద్రం వద్దకు వెళ్లిందన్నారు. ఢిల్లీ బీజేపీ నేతలతో మాట్లాడుకుని వాళ్లకు కేటీఆర్ కాంట్రాక్టు ఇప్పించారని తెలిపారు. దీంతో నీట్ పరీక్ష నిర్వహించడంతో అవకతవకలకు పాల్పడొచ్చన ధైర్యం వాళ్లకు వచ్చిందన్నారు. బీజేపీ దేశాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యార్థులు, యువత పక్షాన నిలిచి.. మోడీపై పోరాటానికి సిద్ధంగా ఉందన్నారు. అందరం కలిసి పోరాడి మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



