ప్రతి ల్యాబ్ లో మౌలిక వసతులు
ప్రభుత్వ కళాశాలల మెరుగుదలకు ప్రత్యేక కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేవలం థియరీ పాఠాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ పరిజ్ఞానం పెరగాల్సిన అవసరముందని ప్రభుత్వం గుర్తించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ విషయంలో వెనుకబడకుండా చూడాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సైన్స్ విద్యార్థులకు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టులు చదివే వారికి) మొదటి సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ తప్పనిసరి చేశారు. ప్రాక్టికల్స్ కు 15 మార్కులు కేటాయించారు. 60 మార్కులకు థియరీ పరీక్షను నిర్వహించనున్నారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరంలోనూ మార్కుల విభజన ఉండనుంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ ను తప్పనిసరి చేయడంతో ఒక్కసారిగా ఈ ఏడాది ల్యాబ్స్ లో ప్రాక్టికల్స్ చేసే విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ల్యాబ్ లను అప్ గ్రేడ్ చేయడంతో, అవసరమైన అన్ని వసతులను కల్పించే దిశగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చర్యలను ప్రారంభించింది.
రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దాదాపు 25 వేల మంది సైన్స్ చదివే విద్యార్థులున్నారు. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రయివేటు, కార్పొరేట్ కళాశాలలను కచ్చితంగా ల్యాబ్ సౌకర్యాలు కలిగి ఉండాలని ఆదేశించింది. నిబంధనల మేరకు తనిఖీలు ఉంటాయని హెచ్చరించింది. అదే సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ల్యాబ్ లను మెరుగుపరచాలని భావిస్తున్నది. అవసరమైన పరికరాలన్నింటిని సమకూర్చడం, సక్రమంగా వాటిని వినియోగించేందుకు అవసరమైన వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయనున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో సాధ్యమైనంత తొందరగా ఈ పనిని పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించేందుకు నిపుణులు, ఒక కళాశాల ప్రిన్సిపల్, ఇంటర్మీడియట్ బోర్డుకు చెందిన అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ల్యాబ్ ఉన్న కొరత, ప్రస్తుతం కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలపైన నివేదికను సిద్ధం చేస్తున్నది. ఈ నివేదిక ఆధారంగానే జూనియర్ ప్రభుత్వ కళాశాలల ల్యాబ్ ఆధునీకరించనున్నారు. ప్రస్తుతం ప్రయోగశాలలకు కావాల్సిన పరికారాలు, రసాయనాలు తదితరాల కొరత లేకుండా అందుబాటులోకి రానున్నట్టు అధికారులు తెలిపారు. విద్యార్థులు ప్రాక్టికల్స్ పై పట్టు సాధించినప్పుడే పోటీ పరీక్షల్లోనూ నైపుణ్యాన్ని మెరుగ్గా ప్రదర్శించగలుగుతారని చెబుతున్నారు.
ప్రాక్టికల్స్ కు ప్రాధాన్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



