Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థులపై పైశాచికత్వమా?

విద్యార్థులపై పైశాచికత్వమా?

- Advertisement -


బీజేపీ అంటే బ్రిటిష్‌ జాహిల్ పార్టీ
దేశానికి క్షమాపణ చెప్పాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటీష్ జాహిల్ పార్టీ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం పైశాచికంగా వ్యవహరించిన తీరు ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకునేలా ఉందని విమర్శించారు. బుధవారం ఈమేరకు ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. నాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా దాష్టీకాలకు పాల్పడిందో ఇప్పుడు బీజేపీ కూడా సొంత ప్రజలపై అదే విధంగా దాష్టీకాలు చేస్తుందని మండపడ్డారు. విద్యార్థులపై పాశవికంగా చేసిన దాడికి బీజేపీ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రైతులపై ఇప్పుడు విద్యార్థులపై చేసిన దాడులు చేసిందన్నారు. సీసీటీవీ కెమెరాలు ఆపేసి, ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థులపై అమానుషంగా లాఠీ ఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించటం పౌరులకు ఉన్న హక్కు అని గుర్తు చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేని ఈ బీజేపీకి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదన్నారు. లాఠీ దెబ్బలకు, రక్తం చుక్కలకు సమాధానం తప్పదని ఆమె హెచ్చరించారు. విద్యార్థులు చిందించిన ప్రతి రక్తం బొట్టుకు, వారిపై విరిగిన లాఠీలకు దేశం మొత్తం కచ్చితంగా ఓటు రూపంలో జవాబు చెబుతుందని హెచ్చరించారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ కారణంగా 25 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని, 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ధైర్యం కోల్పోకుండా సామరస్యంగా ఉండాలని సూచించారు. వ్యవస్థను మార్చేందుకు విద్యార్థుల తరఫున రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయన్నారు.

​గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు అండగా ఉండాలి
గిగ్ వర్కర్లకు అగ్రిగేటర్ సంస్థలు వారికి సరిపడ ఆదాయం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రిగేటర్స్ సంస్థలతో మాట్లాడి గిగ్ వర్కర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ఛార్జీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -