Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్‌‌భరో

క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్‌‌భరో

- Advertisement -

అమెరికా సామ్రాజ్యవాదానికి మోకరిల్లిన మోడీ ప్రభుత్వం
దేశసంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్రం
శ్రామికులను సంఘటితం చేసి పోరాడాలి
సీఐటీయూ, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నేతల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ‌వచ్చేనెల పదో తేదీన జరిగే “జైల్ భరో” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, సీఐటీయూ, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్‌, తీగల సాగర్‌ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో వచ్చేనెల పదిన జైల్‌‌భరోను విజయవంతం చేయాలని కోరుతూ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య మాట్లాడుతూ క్విట్‌‌ మోడీ సేవ్‌ ఇండియా అని పిలుపునిచ్చారు. దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్‌ ‌చేశారు. వచ్చేనెల పదిన జైల్‌‌భరోను విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని కోరారు. కలెక్టరేట్లు, మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో సమరశీల ఉద్యమాలకు సన్నద్ధం కావాలని అన్నారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ ‌మరో జంతర్‌ ‌మంతర్‌ ‌కావాలని పిలుపునిచ్చారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ ‌సంస్థలకు దేశాన్ని తాకట్టు పెట్టే విధానాలను కేంద్రం అవలంభిస్తోందని విమర్శించారు. సంపద కేంద్రీకృతం అవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా సామ్రాజ్యవాదానికి మోడీ ప్రభుత్వం మోకరిల్లిందని అన్నారు. పోరాడి సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమత్వాన్ని తిరిగి సామ్రాజ్య వాదులకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని వీబీ గ్రామ్‌‌జీగా మార్చడంతో పేదలు ఉపాధి కోల్పోయే ప్రమాద ముందన్నారు. విద్యుత్‌‌రంగం ప్రయివేటుపరం అయితే అంధకారం అవుతుందని వివరించారు. నిరంకుశ చట్టాలను కేంద్రం తెస్తున్నదని చెప్పారు. లాఠీలు, తూటాలకు లెక్కచేయకుండా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలతో భారత్‌ ‌ప్రమాదంలో ఉందన్నారు. ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత శ్రామికులపై ఉందని చెప్పారు. సంపద సృష్టించేది శ్రామికులైతే ప్రధాని మోడీ మాత్రం పారిశ్రామికవేత్తల వల్లేనని అంటు న్నారని విమర్శించారు. దేశం వెలిగిపోతుంటే ఆత్మ హత్యలు, ఆకలి చావులు ఎందుకు జరుగు తున్నాయనీ, పౌష్టికా హారలేమితో ప్రజలు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. లేబర్‌‌కోడ్‌‌ల అమలు పేరుతో కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తు న్నారని విమర్శించారు. రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ ‌మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మాట తప్పి పార్లమెంటులో విద్యుత్‌ ‌సవరణ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. ఆ బిల్లులో భాగమే తెలం గాణలో రైతు డిస్కం అని చెప్పారు. రైతులు, ప్రజలకు ఉచిత విద్యుత్‌ అందబోదని అన్నారు. భవిష్యత్‌‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చును పూర్తిగా ప్రజలపైనే భారం పడుతుందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌‌ తరహాలోనే ప్రభుత్వ విద్యుత్‌ ‌రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ ‌శక్తులకు దేశ సంపదను మోడీ ప్రభుత్వం కట్టబెడుతున్నదని చెప్పారు. వచ్చేనెల పదిన జరిగే జైల్‌‌భరో కార్యక్రమం దేశభక్తియుతమైందనీ, ఇందులో దేశభక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు జె వెంకటేశ్‌, విఎస్ రావు, ఎస్వీ రమ, వంగూరు రాములు, పద్మశ్రీ, జె చంద్రశేఖర్, పి శ్రీకాంత్, పి సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్లు పి జంగారెడ్డి, ఎం శోభన్ నాయక్, ఎన్‌‌పీఆర్‌‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -