ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా దుస్థితి
యుద్ధం మళ్లీ మొద లైంది. ఆయిల్ ధరలు పెరిగిపోతు న్నాయి. ఇరాన్ అమెరికాలు యుద్ధం విరమించి పద్నాలుగు అంశాలతో కూడిన ఒప్పందంపైన సంతకాలు చేయటంతో డెబ్భయి డాలర్లకు దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఇపుడు మళ్లీ ఏకంగా తొంభై మూడు డాలర్లకు పెరిగింది. ఆగిపోయిందను కున్న యుద్ధం తిరిగి ప్రారంభం కావటమే ఇందుకు కారణం. గత పదిరోజులుగా తీవ్రరూపం దాల్చిన ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఆయిల్ బ్యారెల్ ధర నూట యాభై డాలర్ల దాకా పెరిగే అవకాశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఎరువులు, ఇతర వస్తువుల కొరత, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యుద్ధం మళ్లీ ఎందుకు?
అప్పటి అవసరాల కోసం ఒప్పందాలు చేసుకోవటం తప్ప ఏ ఒప్పందాన్నీ సక్రమంగా అమలు చేసిన చరిత్ర అమెరికాకు లేదు. ఈ ఒప్పందంలో అంగీకరించబడిన పద్నాలుగు అంశాలు పరిశీలిస్తే అది స్పష్టంగా ఇరాన్‌కు లొంగిపోవటం, అమెరికా ఓటమిని అంగీకరించటం తప్ప మరోటి కాదనేది స్పష్టం. ఇంటా, బయటా ఇదే విమర్శ రావటంతో ట్రంప్ తట్టుకోలేక పోయాడు. దీంతోపాటు పైకి ఒప్పందానికి అంగీకరించినా ఆచరణలో దాన్ని తుంగలో తొక్కాలనే దురాలోచన కూడా ఆయనకు ఉంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం సాధించటం అమెరికాకు సుతరామూ ఇష్టం లేదు. దాంతో ఆ అంశంపైనే తిరిగి అమెరికా అభ్యంతరాలకు పూనుకోవటంతో సంధి బెడిసికొట్టింది. మరో యుద్ధానికి మళ్లీ తెర లేచింది.
హార్ముజ్ జలసంధి కీలకం
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో కొన్ని రోజులకే ఇరాన్ ‘హార్ముజ్ జలసంధి’ని మూసేసింది. దాంతో మొత్తం ప్రపంచానికి సరఫరా జరుగుతున్న ఆయిల్‌లో ఇరవై శాతం రవాణా ఆగిపోయింది. నలభై రోజుల పాటు వైమానిక దాడులతో ఇరాన్‌ను ఎంతగానో నష్టపరచగలిగినా ‘హార్ముజ్’ను మాత్రం అమెరికా తెరిపించలేకపోయింది. ఆ తర్వాత ఆపరేషన్ ఫ్రీడమ్ పేరుతో నౌకలకు రక్షణగా తానుంటానని ప్రగల్బాలు పలికి మూడు,నాలుగు రోజుల్లోనే విఫలమై ఆ ప్రయత్నమూ విరమించుకుంది. ఇరాన్ ‘హార్ముజ్’ మూసేస్తే, నేను ఇరాన్ నౌకలు బయటకు రాకుండా అడ్డుకుంటానని బెదిరించి తన యుద్ధనౌకలతో భారీగా ‘నావల్ బ్లాకేడ్’ను ప్రకటించి అమెరికా అమలు జేసింది. అయినా ఆ జలసంధిని తెరిపించలేకపోయింది. అన్ని దారులూ మూసుకుపోయి జూన్ పదిహేడున ఒప్పందంతో యుద్ధ విరమణ ప్రకటించింది. యుద్ధం ద్వారా సాధించలేకపోయిన కార్యాన్ని మోసం ద్వారా సాధించాలనే దురాలోచతో అమెరికా ఉంది. అందుకే ఒప్పందంలోని ఐదవ అంశమైన హార్ముజ్ జలసంధి గురించి అవగాహనకు విరుద్ధంగా ఇరాన్ చెప్పిన మార్గంలో కాకుండా, మరో మార్గంలో దాని అనుమతి లేకుండానే నౌకలను పంపటానికి అమెరికా ప్రయత్నించింది. ఆ విధంగా ‘హార్ముజ్’పైన ఇరాన్ ఆధిపత్యం లేకుండా తన ఆధిపత్యం సాధించాలనేది అమెరికా పన్నాగం. సహజంగానే ఇరాన్ దాన్ని అడ్డుకున్నది. దాంతో ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ యద్ధం ప్రారంభించి ఇరాన్‌పై దాడులకు తెగబడ్డాడు. ఇరాన్ కూడా అంతేస్థాయిలో ప్రతీకార దాడులకు పూనుకుంది.
తీవ్రస్థాయికి చేరిన యుద్ధం
‘హార్ముజ్’కు సమీప పట్టణం బందర్ అబ్బాస్‌పైనా, ఇరాన్ చమురు రవాణాకు కీలకమైన ‘ఖర్గ్ ఐలాండ్’పైనా అమెరికా భీకర దాడులు చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ కువైట్, ఖతార్, బహ్రెయిన్ వగైరా దేశాలలోని అమెరికా మిలటరీ స్థావరాలపై దాడులు చేసి తీవ్రంగా నష్టపరిచింది. మరోవైపు హార్ముజ్ ద్వారా ఇరాన్ అనుమతి లేకుండా నౌకల రవాణాకు అమెరికా ప్రయత్నించిన ప్రతిసారీ ఆ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసి వాటిని వెనక్కు కొట్టింది. ఈ స్థితిలో వారం రోజుల్లో ఇరాన్ బేషరతుగా లొంగి రాకపోతే ఆ దేశ పౌర సదుపాయాలను (రోడ్ బ్రిడ్జిలు, పవర్‌ప్లాంట్లు, మంచినీటి సదుపాయాలు వగైరా) ధ్వంసం చేస్తానని ట్రంప్ అల్టిమేటమ్ ఇచ్చాడు. అదే జరిగితే గల్ఫ్ దేశాలన్నింటికి అదేగతి పడుతుందని ఇరాన్ బదులిచ్చింది. గడువుకు రెండురోజుల ముందే ఇరాన్- చైనా లింక్ రైల్వే బ్రిడ్జి, ఒక పవర్‌ప్లాంట్, ఒక డిశాలినేషన్ ప్లాంట్(సముద్ర నీటిని మంచినీరుగా మార్చే ఫాక్టరీ)లను అమెరికా ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా కువైట్‌లోని పవర్‌ప్లాంట్‌ను, డీశాలినేషన్ ప్లాంట్‌ను ఇరాన్ నష్టపరిచింది. దాడులు ఇలాగే కొనసాగితే ఎర్ర సముద్రంలోని ‘బాబఎల్ మండేబ్’ జలసంధిని మూసేస్తామని ఇరాన్ ప్రకటించింది.
బాబ్ ఎల్ మండేబ్ మూసివేత
ఎర్రసముద్రంలోని మరో జలసంధి ‘బాబ్ ఎల్ మండేబ్’ ద్వారా మరో పన్నెండు శాతం ఆయిల్ ప్రపంచానికి సరఫరా అవుతున్నది. హార్ముజ్ నుంచే కాక తన ఆయిల్ ఉత్పత్తిలో రోజూ డెబ్భయి లక్షల బారెళ్ల చమురును సౌదీ అరేబియా ఈ జలసంధి ద్వారా రవాణా చేస్తుంది. ఇటీవల ఎమెన్‌లోని సనా విమానా శ్రయంపైన సౌదీ బాంబులు వేయటానికి నిరసనగా అక్కడి హౌతీలు(అన్సరల్లాలు) సౌదీ నౌకలను ఈ జలసంధి నుండి ప్రయాణించటాన్ని నిషేదించారు. దాంతో అంతర్జాతీయ ఆయిల్ సరఫరాలపైన మరింత ఒత్తిడి పెరిగింది. ఇంకా బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని పూర్తిగా మూసేస్తే హార్ముజ్‌తో కలిపి మొత్తం 35శాతం ఆయిల్ రవాణా అనేక దేశాలకు ఆగిపోతుంది.
పెట్రోడాలర్ ప్రాధాన్యత
ఈ యుద్ధం మళ్లీ మొదలవ్వడం వెనక మరో మతలబు కూడా ఉంది. ఒప్పదం అమలు జరిగి హార్ముజ్ జలసంధి శాశ్వతంగా ఇరాన్ ఆధిపత్యంలోకి వెళితే ఇప్పటి వరకూ అమెరికా మిత్రులుగా ఉన్న మొత్తం పశ్చిమాసియా దేశాలన్నీ దానికి దూరమై ఇరాన్ ప్రభావంలోకి వెళ్లే అవకాశం ఉంది. అమెరికా కార్పొరేట్ ప్రభువర్గాలు దీనిని తట్టుకోలేక పోతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధంలో అమెరికా గెలవటం, ఓడటం ఒక ఎత్తయితే పశ్చిమాసియాపైన అమెరికా పట్టు కోల్పోయినట్లయితే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాళ్లకు తెలుసు. ఇప్పటికే డాలర్ మారకాలు తగ్గిపోతూ బ్రిక్స్ దేశాల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ‘పెట్రో డాలర’ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ ఆయిల్ అమ్మకాలు డాలర్లలో మాత్రమే జరగటం, తద్వారా వచ్చిన డాలర్లను తిరిగి అమెరికా ఆస్తులలోనే పెట్టుబడులు పెట్టటం వల్ల అమెరికా తన బడ్జెట్‌లోటును అప్పుల రూపంలో పూడ్చుకోగలుగుతోంది. ఇప్పటికే కొన్నిదేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీలతో అంతర్జాతీయ లావాదేవీలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియా చేజారితే ఈ క్రమం మరింత వేగం పుంజుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ పాత్ర తరిగిపోయి, అమెరికా ఆర్థిక ఆధిపత్యానికే ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
దిక్కుతోచని అమెరికా
ఈ పరిణామాలతోబాటు మిలటరీ రంగంలో కూడా అమెరికా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఉక్రెయిన్‌కు సరఫరాలు, ఇరాన్‌పై యుద్ధంలో ఇప్పటికే అమెరికా ప్రధాన ఆయుధ నిల్వలన్నీ కరిగిపోయాయి. దాన్ని వెంటనే పూడ్చుకోగలిగిన ఉత్పత్తి సామర్ధ్యం కూడా అమెరికాకు లేదు. మరోవైపు ఆయుధ ఉత్పత్తికి అవసరమైన ‘రేర్ ఎర్త్ మాగ్నెట్’ల సరఫరాపైన చైనాకు పూర్తి ఆధిపత్యం ఉండటం, అది ఆంక్షలు అమలు చేయటం అమెరికాకు తలనొప్పిగా తయారైంది. ఇరాన్ దాడులకు తట్టుకోలేక ఇప్పటికే కొన్ని గల్ఫ్ దేశాలలోని తన మిలటరీ స్థావరాలను అమెరికా మూసేయటమో లేక వేరే చోటకు తరలించటమో చేస్తోంది. ఇరాన్ దాడులు తీవ్రంగా సాగుతున్న బహ్రెయిన్, ఖతర్ తదితర కేంద్రాల నుంచి తన మిలటరీ వనరులను జోర్డాన్‌కు తరలించింది. దాంతో ఇపుడు ఇరాన్ తనదాడులను జోర్డాన్ పైన కూడా ఎక్కుపెట్టింది. దాంతో అక్కడి పరిస్థితి కూడా తల్లకిందులౌతోంది. చివరకు తన యుద్ధ కేంద్రాన్ని ఇజ్రాయిల్‌కు తరలించాలని అమెరికా ఆలోచిస్తున్న ట్లు, ఇజ్రాయిల్ దానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏదో విధంగా తిరిగి ఒప్పందానికి అంగీకరించేట్లుగా ఇరాన్‌తో మాట్లాడాలని పాకిస్తాన్ పైన ముఖ్యంగా ఫీల్డ్‌మార్షల్ అసిఫ్ మునీర్‌పైన అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.
ధృడచిత్తంతో ఇరాన్
ఏడు రోజుల పాటు జరిగిన ఖొమైనీ అంత్యక్రియల సంధర్బంగా వివిధ ప్రదేశాల్లో సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలు హాజరయ్యారని అంచనా. అంతటా తమ నాయకుని మరణం పట్ల భాధ, అమెరికా పట్ల ద్వేషం పెల్లుబికింది. ఏ మాత్రం రాజీలేకుండా అమెరికాను మట్టుబెట్టాలనే పట్టుదల వ్యక్తమైంది. దాంతోపాటు అనుకూలమైన భౌగోళిక స్వరూపం, కొండల అడుగున నిర్మించిన ఆయుధ కర్మాగారాలు, క్షిపణి నిల్వలు ఇరాన్‌ను అభేద్య శక్తిగా మార్చాయి. అమెరికా అనేక విధాల శక్తివంతమైన దేశమైనా ఈ ప్రత్యేక పరిస్థితిలో ఇరాన్‌ను ఓడించటం, లొంగదీసుకోవటం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అంతర్జాతీయంగా ప్రధాన మీడియాగానీ, మిలటరీ పండితులు, రాజకీయ విశ్లేషకులంతా అంగీకరిస్తున్న సత్యమిది. అయితే ఎంతటి యుద్ధమైనా ఒక దేశం లొంగిపోవటమో, చర్చల ద్వారా పరిష్కారం కావటమో జరగాల్సిందే. ఇరాన్ అమెరికా యుద్ధం ఏ రూపం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఇరాన్ చర్చలకు అంగీకరించాల్సి వచ్చినా గత ఒప్పందం కంటే తనకు అనుకూలమైన మరిన్ని కఠిన షరతులు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ చర్చలు జరిగి తిరిగి ఒప్పందం కుదిరేంత వరకూ ప్రపంచంలో అన్ని దేశాలూ అధిక ధరలు, ఆర్థిక సంక్షోభాలవైపు అడుగులేయక తప్పదు. ఈ మేరకు అంతర్జాతీయ ఒత్తిడి అమెరికాపైన ఉంటుంది.
తమ్మినేని వీరభద్రం



