Friday, July 24, 2026
E-PAPER
Homeఖమ్మంఉద్యాన పంటలకు భద్రాద్రి చిరునామా

ఉద్యాన పంటలకు భద్రాద్రి చిరునామా

- Advertisement -

– ఉద్యాన కళాశాల తో విద్య, పరిశోధనకు కొత్త దిశ
– రాష్ట్ర ఉద్యాన అభివృద్ధిలో అశ్వారావుపేట కీలకం
– ఎస్కేఎల్టీ జీ హెచ్ యూ , హెచ్ ఆర్ ఎస్ హెడ్ అండ్ సైంటిస్ట్ డాక్టర్. మజ్జిగ శ్రీనివాస్]
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ఈ జిల్లాలో ఏర్పాటు కానున్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ఉద్యాన విద్య, పరిశోధన, రైతు సేవలకు నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన స్థానం హెడ్ అండ్ సైంటిస్ట్ డాక్టర్. మజ్జిగ శ్రీనివాస్ తెలిపారు.

జిల్లాలోని అనుకూల వాతావరణం, సారవంతమైన నేలలు, సమృద్ధిగా లభించే నీటి వనరులు, రైతుల అనుభవం వల్ల ఆయిల్‌పామ్, ఎర్రమిర్చి, జీడిమామిడి, మామిడి, కొబ్బరి, అరటి, కోకో, కూరగాయలు, జామ, బొప్పాయి, నిమ్మ, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, పసుపు తదితర ఉద్యాన పంటలు విస్తృతంగా సాగవుతున్నాయని తెలిపారు. పచ్చని తోటలతో కళకళలాడే ఈ ప్రాంతాన్ని ప్రజలు ప్రేమగా “తెలంగాణ కోనసీమ” గా పిలుస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో సుమారు 13.10 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతుండగా, అందులో 1,44,550 ఎకరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఉన్నాయని వివరించారు. జిల్లాలో అత్యధికంగా 88,437 ఎకరాల్లో ఆయిల్‌పామ్, 17,580 ఎకరాల్లో ఎర్రమిర్చి, 12,069 ఎకరాల్లో జీడిమామిడి, 7,512 ఎకరాల్లో మామిడి సాగవుతున్నాయని తెలిపారు.

జిల్లాలో 250 నుంచి 300 వరకు పండ్ల మొక్కల నర్సరీలు నిర్వహించబడుతున్నాయని, ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా నాణ్యమైన మొక్కలు సరఫరా అవుతున్నాయని చెప్పారు.

ఈ ఉద్యాన సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అశ్వారావుపేటలో 30 మంది విద్యార్థుల ప్రవేశ సామర్థ్యంతో కొత్త ఉద్యాన కళాశాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. దీని ద్వారా స్థానిక విద్యార్థులకు నాణ్యమైన ఉద్యాన విద్య అందుబాటులోకి రావడంతో పాటు, శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన ఉద్యాన నిపుణులు తయారవుతారని పేర్కొన్నారు.

అశ్వారావుపేటలో ఇప్పటికే 1988లో స్థాపించబడిన ఉద్యాన పరిశోధన స్థానం మూడు దశాబ్దాలకు పైగా ఉద్యాన పంటలపై పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, రైతు శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలు, శాస్త్రీయ సలహాలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ పరిశోధన స్థానం వద్ద ఉన్న ప్రయోగశాలలు, పరిశోధనా క్షేత్రాలు, పండ్ల తోటలు, శాస్త్రవేత్తల సేవలను కొత్త కళాశాల విద్యార్థులు ప్రత్యక్షంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

అశ్వారావుపేటలో ఉద్యాన కళాశాల ఏర్పాటుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు పరిసర గిరిజన, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని, స్థానిక ఉద్యాన సమస్యలపై పరిశోధనలు, రైతులకు సాంకేతిక పరిష్కారాలు, ఉద్యాన ఆధారిత పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణకు ఇది దోహదపడుతుందని డా. మజ్జిగ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలోని ఉద్యాన వనరులు, రైతుల అనుభవం, పరిశోధన సౌకర్యాల సమన్వయంతో అశ్వారావుపేట ఉద్యాన కళాశాల రాష్ట్ర ఉద్యానాభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -