Friday, July 24, 2026
E-PAPER
Homeఖమ్మంఅమరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి

అమరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి

- Advertisement -

– నాటి విదేశీ నినాదం జాతిని ఐక్యం చేస్తే.. 
– నేటి స్వదేశీ విధానం ప్రజలను విభజిస్తోంది..
– కామ్రేడ్ ఊకే వీరాస్వామి ప్రథమ వర్ధంతి సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట

సామాజిక సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన అమరుల ఆశయాలను ఆచరణలో కొనసాగించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, నందిపాడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ ఊకే వీరాస్వామి ప్రథమ వర్ధంతి సభను శుక్రవారం మండలంలోని నందిపాడు లో నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ మాడి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాట కాలంలో విదేశీ వస్తు బహిష్కరణ వంటి నినాదాలు దేశ ప్రజలను ఐక్యపరిచాయని, అయితే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న స్వదేశీ విధానాలు ప్రజల మధ్య కుల, మత విభేదాలను పెంచేలా మారాయని విమర్శించారు.

యుద్ధ పరిస్థితుల కారణంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు యుద్ధం ముగిసిన తర్వాత కూడా తగ్గకపోవడం ప్రజలపై తీవ్ర భారం మోపుతోందన్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమవుతున్నప్పటికీ ప్రజల సమస్యలపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రతిపక్షం లా వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే పార్టీకి ప్రజాదరణ, నాయకత్వానికి గుర్తింపు లభిస్తుందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మండల కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు, కారం సూరిబాబు, మడిపల్లి వెంకటేశ్వరరావు, కామ్రేడ్ ఊకే వీరాస్వామి సతీమణి బుల్లెమ్మ, స్థానిక సర్పంచ్ కూరం దుర్గమ్మ, కారం వీరాస్వామి, మండల కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -