మిమిక్రీ నేరమా?

– సభాధ్యక్షుడిని అనుకరిస్తే కుల దూషణ అవుతుందా?
– హాస్యానికి వక్రభాష్యం చెబుతున్న కేంద్ర ప్రభుత్వం
–  అదే పని మోడీ చేస్తే తప్పు కాదా?
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం హాస్య చతురతను కూడా అర్థం చేసుకోలేకపోతోంది. రాజ్యసభలో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను అనుకరిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు కల్యాణ్‌ బెనర్జీ చేసిన మిమిక్రీ బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. బీజేపీ నేతలందరూ ఆయనపై ముప్పేట దాడి చేశారు. పరిశీలకులు మాత్రం బెనర్జీ చర్యను నిరసనగానే చూశారు. మోడీ ప్రభుత్వం మాత్రం దీనిని జాట్లకు జరిగిన అవమానంగా చిత్రీకరించించింది.
వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీ గతంలో అనేక సందర్భాలలో ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి ‘దీదీ ఓ దీదీ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరు మరిచిపోతారు? కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ను ఉద్దేశించి ‘యాభై కోట్ల రూపాయల గర్ల్‌ఫ్రండ్‌’ అంటూ చేసిన వ్యాఖ్యను ఎవరు మరువగలరు?
మోడీ తన ఎన్నికల ప్రచార సభలలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీని ‘పప్పు’ అని అనేక సందర్భాలలో ఎత్తిపొడిచారు. ప్రతిపక్ష నాయకులను వెక్కిరిస్తూ, అనుకరిస్తూ పార్లమెంటులో వ్యాఖ్యలు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీని కూడా ఆయన వదిలిపెట్టలేదు. అన్సారీ పాలనాపరమైన అనుభవమంతా మైనారిటీ వ్యవహారాలు, ముస్లిం ప్రపంచానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఓ దౌత్యవేత్తగా అన్సారీ రికార్డును ఆయన విస్మరించారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాఠశాలల్లో కన్పిస్తాయి. అక్కడ బలవంతులైన విద్యార్థులు బలహీనుల్ని ర్యాగింగ్‌ చేయడం పరిపాటి. ధన్‌కర్‌ను బెనర్జీ అనుకరించడాన్ని సభ్యులందరూ ఆస్వాదిస్తుంటే రాహుల్‌ గాంధీ తన ఫోన్‌లో ఆ దృశ్యాన్ని బంధించారు. అయితే పలు వార్తా ఛానల్స్‌ దీనిని తప్పుగా అర్థం చేసుకున్నాయి. రాహుల్‌ తాను తీసిన వీడియోను సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేసి, తద్వారా అధ్యక్ష స్థానాన్ని మరింత అవమానించేందుకు ప్రయత్నించారంటూ అవి వాస్తవాన్ని వక్రీకరించాయి. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ఎందుకు ప్రకటన చేయలేదు? భద్రతా వైఫల్యాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని, విచారణకు ఆదేశించిందని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా ఇద్దరూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే విచారణ కమిటీకి సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అనీష్‌ దయాళ్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తారు. ఈ ఏజెన్సీయే పార్లమెంటు భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. తన నేతృత్వంలోని సంస్థ వైఫల్యం పైనే సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విచారణ జరపడాన్ని ప్రతిపక్ష ఎంపీలు తప్పుపడుతున్నారు. అయినా ఈ అనుమానాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. బెనర్జీ మిమిక్రీ ఉదంతానికి కులం రంగు పూనేందుకు సైతం బీజేపీ నేతలు విశ్వప్రయత్నం చేశారు. ఇది జాట్లకు అవమానకరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సెలవిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఘాటుగానే స్పందించారు. ‘సభలో నన్ను అధికార పార్టీ ఎంపీలు మాట్లాడనివ్వలేదు. నేను దళితుడిని అయినందుకే వారు అలా ప్రవర్తించారని నిందించవచ్చు కదా’ అని అడిగారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందని రాహుల్‌ గాంధీ విమర్శించారు. భద్రతా వైఫల్యం, అసాధారణ రీతిలో ప్రతిపక్ష ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్‌ కంటే బెనర్జీ మిమిక్రీ ముఖ్యమైన విషయమా అని ప్రశ్నించారు. ఏదేమైనా ప్రాధాన్యత కలిగిన అంశాలపై సభలో చర్చ జరగకుండా చేయడంలో బీజేపీ విజయం సాధించింది. మోడీ హయాంలో హాస్యాన్ని, చతురతను పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యంగ్య చిత్రాలు గీసిన అనేక మంది కార్టూనిస్టులను అరెస్ట్‌ చేశారు. మోడీని అనుకరించి మిమిక్రీ చేసిన శ్యామ్‌ రంగీలాపై అక్రమ కేసులు పెట్టారు.
‘ఎంపీలు కూర్చున్నప్పుడు నేను వీడియో తీశాను. అది నా ఫోన్‌లోనే ఉంది. మీడియా దానిని చూపించింది. మా ప్రతిపక్ష సభ్యులు 150 మందిని సభ నుండి గెంటేశారు. దానిపై మీడియాలో ఎలాంటి చర్చ జరగలేదు. మా ఎంపీలు కలత చెంది బయట కూర్చున్నారు. కానీ మీరేమో మిమిక్రీ గురించి చర్చిస్తున్నారు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ల మధ్యే వివాదాస్పద నూతన చట్టాలపై ఎలాంటి చర్చ జరపకుండా సభ ఆమోదించింది. తనకు ఉన్న మందబలాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నీరుకార్చింది. భారత పార్లమెంట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో మెజారిటీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. లోక్‌సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంలో జవాబుదారీతనం లేకుండా చేసింది. దీనిపైనా మీడియాలో ఏ చర్చా లేదు.
– రాహుల్‌ గాంధీ

Spread the love