Saturday, July 25, 2026
E-PAPER
Homeకరీంనగర్కన్నప్రేమను కాటేస్తున్నకఠినాత్ములు

కన్నప్రేమను కాటేస్తున్నకఠినాత్ములు

- Advertisement -

ఆస్తులు దక్కేదాకనే అమ్మానాన్న..ఆపై వీధులపాలు
‘ప్రజావాణి’లో పలుచోట్ల వృద్ధ దంపతుల అరణ్యరోదన
తల్లిదండ్రులను వారసులు బయటకు గెంటేస్తున్న కేసులు కోకొల్లలు
చట్టాలు పకడ్బందీగా అమలు : కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా


కన్నపేగు తీపిని మరచి, రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే కాలయములై మారుతున్న నైతిక పతన దృశ్యమిదీ. ఏ వేలు పట్టుకుని నడక నేర్చారో, ఏ ఒడిలో ఒదిగి ప్రపంచాన్ని చూశారో.. అదే వేలిని తెంచి, అదే ఒడిని ఖాళీ చేసి కన్నవారిని నడిరోడ్డుపైకి నెట్టేస్తున్నారు. ఆస్తులన్నీ తమ పేరిట రాయించుకుని, చివరకు కనీసం ఒక పూట తిండి కూడా పెట్టకుండా బయటకు గెంటేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కేసులు నమోదవు తున్నాయి. పిల్లలు పెడుతున్న ఇబ్బందులను ఎంతోమంది వృద్ధ దంపతులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణిలో వినిపిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి కన్నీటి గాథలు సమాజ మానసిక వైకల్యానికి అద్దం పడుతున్నాయి. ‘భారం కాదు.. బాధ్యత’ అని గుర్తిం చాల్సిన కన్నపిల్లలే శత్రువులుగా మారితే, చట్టం వారికి ఎలా బుద్ధి చెబుతుందో, ప్రభుత్వం వృద్ధులకు కల్పిస్తున్న హక్కులేమిటో తెలిపే ‘నవతెలంగాణ’ ప్రత్యేక కథనమిదీ..

నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​ఇటీవల కరీంనగర్‌ ‌జిల్లా ‘ప్రజావాణి’లో కనిపించిన హృదయవిదారక ఉదంతాలను పరిశీలించినప్పుడు .. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెక్కలముక్కలు చేసుకుని అందరికీ పెండ్లిండ్లు చేశారు. ఉన్న ఆస్తిని కొడుకులకు పంచడమే వారు చేసిన పాపమైంది. ఆస్తి చేతికందగానే వారికి రోగమొస్తే వైద్యం లేదు, కనీసం తిండి పెట్టడం లేదు. తామిచ్చిన ఆస్తిలో 5.14 ఎకరాల భూమిని తిరిగి తమ పేరిట మార్చాలంటూ ఇటీవల ఆ వృద్ధ దంపతులు కలెక్టర్‌ను వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
గన్నేరువరం మండలం చాకలివానిపల్లిలోనూ దంపతులకు ఇద్దరు కొడుకులు. కష్టపడి కట్టుకున్న ఇంట్లో నుంచే ఆ వృద్ధులను గెంటేశారు.. ఐదెకరాల భూమిని బలవంతంగా రాయించుకోవడమే కాక, వారి పేరిట బ్యాంకులో పంట రుణాలు తీసుకుని ఎగవేశారు. కొడుకు, కోడలే తమను కొట్టారని ఆ తల్లి రోదించిన తీరు ‘ప్రజావాణి’కి వచ్చిన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. మానకొండూరు మండలం గంగిపెల్లికి చెందిన రేగుల నర్సయ్య, లక్ష్మి దంపతులు ఆస్తులు పంచాక కనీసం ఒక్కపూట తిండి పెట్టడం లేదని కలెక్టరేట్‌ మెట్లు ఎక్కారు. ఇలా ప్రతివారమూ నిరాదరణకు గురవుతున్న దంపతులు ‘ప్రజావాణి’లో దర్శనమిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఫిర్యాదులను అధికారులు సీరియస్‌‌గా తీసుకుని .. చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులకు చట్టాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఆ చట్టాల ద్వారానే బాధితులకు రక్షణ కల్పిస్తున్నారు.

​​వయోవృద్ధుల రక్షణకు ప్రత్యేక చట్టాలివే..
తల్లిదండ్రులను శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో ఎక్కడైనా విడిచిపెట్టినా, వారికి హాని తలపెట్టినా 3 నెలల జైలు శిక్ష విధిస్తారు. తమను తాము పోషించుకోలేని వృద్ధులకు వారి పిల్లల నుంచి (సంతానం లేకపోతే ఆస్తి అనుభవించే వారి నుంచి) ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య చికిత్స కోసం నెలకు రూ.10వేలకు మించకుండా ఇప్పించేలా ఆర్డీవో ట్రిబ్యునల్‌ చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో చూసుకుంటామని చెప్పి ఆస్తులు రాయించుకుని, ఆ తర్వాత పట్టించుకోకపోతే ఆ ఆస్తి బదిలీ పత్రాలను రద్దు చేసే అధికారమూ ఉంది. డివిజన్‌ స్థాయిలో ఆర్‌డీవో ప్రిసైడింగ్‌ అధికారిగా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేస్తే తహసీల్దార్‌ విచారిస్తారు. ముందుగా కౌన్సెలింగ్‌ ఇచ్చి రాజీ కుదురుస్తారు. మాట వినని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఆర్డీవో తీర్పుపై అసంతృప్తి ఉంటే కలెక్టర్‌‌ను ఆశ్రయించవచ్చు. బాధితులెవరైనా (జాతీయ వయోవృద్ధుల హెల్ప్‌లైన్‌ – 14567), చైల్డ్‌ / ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ (1098) నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

కరీంనగర్‌ జిల్లాలో నిరాదరణకు, దాడులకు గురయ్యే వృద్ధులు ఇచ్చిన ఫిర్యాదులు ఏయేటా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. నాలుగేండ్లలో ఫిర్యాదు వివరాలు చూస్తే …
సంవత్సరం ఫిర్యాదుల సంఖ్య
2023 117
2024 129
2025 120
2026(జులై) 55


​చట్టాలు పకడ్బందీగా అమలు : కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశాలు
వృద్ధుల సంక్షేమ చట్టాలు, మెయింటెనెన్స్‌ యాక్ట్‌ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆర్‌డీవోలు ఉత్తర్వులు జారీ చేసిన కేసుల్లో తల్లిదండ్రులకు పిల్లలు ప్రతి నెలా భరణం అందిస్తున్నదీ లేనిదీ 15 రోజులకు ఒకసారి పునఃసమీక్షిస్తున్నాం. మండల స్థాయి అధికారులతో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయనున్నాం. భరణం ఇవ్వని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటూ పోలీసు శాఖ ప్రతి 15 రోజులకోమారు ‘యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌’ సమర్పించాలని చెప్పాం. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల మెయింటినెన్స్‌ విషయంలోనూ ప్రత్యేక దృష్టిసారించాం. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -