వృత్తి నైపుణ్యం, విద్యార్థుల అభ్యసన ఫలితాల పెంపుదలే లక్ష్యం..
నవతెలంగాణ – మల్హర్ రావు
బోధనలో నాణ్యత, వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపర్చి, విద్యార్థుల అభ్యసన ఫలితాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఈ కార్యక్రమం జిల్లాలో రెండు విడతలుగా కొనసాగనున్నది. మొదటి దశలో పలువురు టీచర్లను ఎంపిక చేసి రాష్ట్ర రీసోర్స్ పర్సన్లుగా, వారి ద్వారా జిల్లా రీసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో మండల స్థాయి రీసోర్స్ పర్సన్లకు శిక్షణ అందించనున్నారు. ఈ నెల 31వరకు మండల స్థాయిలో శిక్షణ నిర్వహిస్తున్నారు. రెండో విడత డిజిటల్ లెర్నింగ్లో భాగంగా ఆగస్టు మొదటివారంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ పొందిన టీచర్లు 34 స్కూళ్లలో 1తరగతి నుంచి 9 తరగతి వరకు ఏఐ ద్వారా విద్యార్థులకు తరగతులు చెప్పనున్నారు.
ఇబ్బందులు..
ఏఐపై శిక్షణలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందు లను చెప్తున్నారు. టీచర్లలో చాలా మందికి ఏఐ టూల్స్, డిజిటల్ ఫ్లాట్ఫారాల ఉపయోగంపై అవ గాహన లేక ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో కంప్యూటర్లు, 5జీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఏఐ శిక్షణ తీసుకున్నా లాభం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొం దరు టీచర్లకు బోధనేతర పనులు అప్పగిస్తుండడం తో ఏఐ శిక్షణపై సమయం కేటాయించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. పాఠ్య ప్రణాళిక, ప్రశ్నప త్రాల తయారీ, తరగతి గదిలో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష సాధన ఉండాలని కోరుతున్నారు.



