Sunday, July 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజియువరక్తమూ- అల్పత్వము

యువరక్తమూ- అల్పత్వము

- Advertisement -

వెలుగుతున్న ఆశ ఒకవైపు, కొనసాగుతున్న అల్పత్వము మరోవైపు. నేడు దేశ కదలికను గమనిస్తుంటే భవిష్యత్తు పట్ల ఆశలు చిగురిస్తున్నాయి. ఏం చేయలేమనే నిరాశ నుంచి ఏదైనా చేయగలమనే ధైర్యం నిండుతోంది. మాకిక తిరుగులేదనుకున్నవారికి తలలు తిరిగేట్టు జరగటం చూస్తుంటే సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలు, సిద్ధాంతాలు ఎంత వాస్తవికమైనవో అర్థమవుతున్నది. నిరసనల నిప్పురవ్వ అంటుకుంటే ఎంత దావానలమై ముంచెత్తుతుందో స్పష్టపరిచింది నేటి యువత తిరుగుబాటు. గత 38 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరవధికంగా జరుగుతున్న నిరసన అత్యంత పదునైన దీక్షతో కొనసాగటం అనేకమంది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను, సాధారణ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నది. నిర్మాణ రూపమే లేని ఒక సోషల్ మీడియా ‘కాక్రోచ్’ యువత, ఇంత నిబద్ధంగా, పట్టుదలతో,క్రమశిక్షణతో ఉద్యమాన్ని నిర్మించడం చూస్తే, ఎక్కడ అణచివేత, దోపిడీ వేదన ఉంటుందో అక్కడ తిరుగుబాటు తప్పదన్న సత్యం రుజువుతున్నది. నిర్మాణాత్మక వామపక్ష విద్యార్థి ఉద్యమమూ తోడుగా చేరటము మరింత పదునుతేరుతున్నది. ఇదో శుభపరిణామం.‘‘పదిమంది ఉక్కు గుండెలుగల యువకులను నాకివ్వండి, నేను ఈ దేశాన్ని మార్చివేస్తాను’’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఈ సన్నివేశాన్ని చూస్తే ఎంతో నిజమని అర్థమవుతున్నది.

నిరసన చాలా సామాన్యంగానే ప్రారంభమ యింది. ప్రభుత్వమూ పెద్దగా పట్టించుకోకుండా తేలికగానే చూసింది. జూలై ఇరవై తర్వాత నిరసన ఉద్యమ రూపం అందుకుంది. దేశవ్యాప్తంగా యువత కదం తొక్కింది.బీజేపీ తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న రాష్ట్రాల నుంచి అన్ని ప్రాంతాలలోనూ ప్రశ్నతో, నినాదంతో మార్మోగింది. ఇక్కడేకాదు, దేశం వెలుపల, అనేక దేశాలలో యువత మద్దతును ఈ ఉద్యమం పొందింది. అప్పటిగానీ అయ్యవార్లకు అర్థంకాలేదు. ఎన్ని ఆటంకాలు ఎగదోసింది ప్రభుత్వం! ఎంత దుష్ప్రచారం మొదలైంది. ఎంత దారుణంగా క్రూరంగా అణచివేయటానికి పూనుకొంది. రక్తం పారించింది. తలలు పగలగొట్టింది. చేతులు, కాళ్లు విరగగొట్టింది. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ లు, ముండ్ల కంచెలు, దేశద్రోహ కేసులు, నిర్దాక్షిణ్య నిర్బంధాలు అన్నీ ఉపయోగించింది. ఇంకోవైపు నైతికతను దెబ్బతీస్తూ, విదేశీయుల సహకారంతో, మద్దతుతో నడుస్తోందని, సంఘవిద్రోహ శక్తులని, దేశ సమగ్రతను, శాంతిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, దొంగ దీక్షలు చేస్తున్నారని ఒక నీచ ప్రచారము చేసింది. నీళ్లను బంద్ చేసింది. కరెంటునూ, ఇంటర్నెట్ నూ, రహదారులను, మెట్రో స్టేషన్లను బంద్ పెట్టి నిలిపివేసింది.

ఇన్ని చేసినా, ఇంత విధ్వంసం ఒక రాజ్యం చేస్తున్నా… నిలకడగా నిబ్బరంగా వీటన్నింటినీ ఎదుర్కొని ఇన్ని రోజులుగా పోరాటం కొనసాగటం చరిత్రలో నిలిచిపోయే మహా సంఘటన. ఇది ఒక పరీక్ష పేపర్ లీకేజీ సమస్యే కాదు, విద్యావ్యవస్థ మొత్తం ప్రయివేటు, కార్పొరేట్ల చేతుల్లోకి పోవడం, పర్యవసానంగా వ్యాపారం, లాభాలు మాత్రమే లక్ష్యంగా మారింది. నిరుద్యోగం, పరిశ్రమల మూత, గ్రామీణ ప్రజల ఆదాయాల కోత, ధరల పెరుగుదల, హక్కుల అణచివేత అన్నిటి ప్రభావాల ప్రతిఫలనం ఈ ప్రతిఘటన. ప్రశ్నించినవాళ్లను , న్యాయం అడిగినవాళ్లను దేశద్రోహులుగా చూస్తూన్న ప్రభుత్వ నియంతృత్వ పోకడపై వెల్లువెత్తిన ఆగ్రహం ఇది. ముప్పయి రోజుల తర్వాత, యువత దేశానికి అతి ముఖ్యమైన శక్తి అని, వారి సమస్య దేశపు సమస్య అని ప్రధాని మాట్లాడటం సిగ్గులేనితనం. ఇన్ని ఆటంకాలు పెట్టింది ఎవరు? అప్పుడు ఏమైంది ఈ ఆలోచన. వాళ్లు దేశద్రోహులని కూడా నిందలు వేశారు? మాట మారిందా! గుండె జారిందా! ఇక మన మోడీగారి అల్పత్వం గురించి ఒక సారి పరిశీలించండి.

మొన్న అర్ధరాత్రి ఒక వీడియో చేసి పెట్టారాయన. ఏమని, యువత భవిత కన్నా ముఖ్యమైన అంశం లేదని పెట్టిన వీడియోకు అపార స్పందన వచ్చిందని థాంక్యూ ఫ్రెండ్స్ అని కృతజ్ఞతలు చెప్పారు. ఎంత అల్పత్వం! ఇప్పటికీ తెలంగాణలోని వారి పార్టీ నాయకులు, ఆ ఉద్యమాన్ని, యువతను కించచపరుస్తూ, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తుల సహకారంతో చేస్తున్న ఉద్యమమని ఆరోపణలు ఒకవైపు చేస్తూనే ఉన్నారు. ఇది కదా ద్వంద్వ విధానం, కుట్రపూరిత ప్రవర్తన. ఇంకా మోడీగారు మంత్రిమండలి సమావేశంలో బోధన చేస్తూ, మంత్రులు ఇన్‌స్టాగ్రామ్ లో యువతతో సంబంధంలో ఉండాలనీ, రీల్స్ చేయాలనీ, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండమని కోరుతున్నాడు. అక్కడ పిల్లలు ఆందోళనలో ఉంటే పరిష్కారం కోసం ఆలోచన లేదు. ప్రచారం కావాలి ఆయనకు. గ్రాఫ్ పడిపోతున్నదని బెంబెలెత్తిపోతున్నారు గానీ అసలు విషయం మీద ఆసక్తి లేదు. అదీ మన పాలకుల అల్పత్వం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -