Sunday, July 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయందాడులకు అమెరికా-ఇరాన్‌ బ్రేక్‌

దాడులకు అమెరికా-ఇరాన్‌ బ్రేక్‌

- Advertisement -

అయినా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తత చమురు క్షేత్రాలపై హౌతీల క్షిపణులు, డ్రోన్లు
నవతెలంగాణ – జనరల్‌ డెస్క్‌
గత రెండు వారాల పోరులో తొలిసారిగా అమెరికా దళాలు శుక్రవారం రాత్రి ఇరాన్‌పై ఎలాంటి దాడులకు తెగబడలేదు. ఇరాన్‌ సైతం గల్ఫ్‌లోని అమెరికా ప్రాంతీయ భాగస్వామ్య దేశాలపై ఎలాంటి దాడులు జరపలేదు. అయితే హౌతీలు, సౌదీ అరేబియా సేనల మధ్య దాడులు కొనసాగుతుండడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలోని జజాన్‌పై క్షిపణి దాడి చేశామని హౌతీలు ప్రకటించారు. సౌదీ దళాలు యెమన్‌లోని ఓడరేవు నగరమైన హొదైదా, దాని సమీపంలోని ఓ దీవిపై చేసిన దాడులకు ప్రతీకారంగానే తాము క్షిపణులను ప్రయోగించామని తెలిపారు. సౌదీ ప్రభుత్వం ప్రమాదకరమైన దూకుడు ప్రదర్శిస్తోందని, దాని దాడులకు ధీటుగా బదులిస్తామని చెప్పారు. యన్బూలోని చమురు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకొని యెమన్‌ నుంచి శనివారం ప్రయోగించిన రెండు బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకున్నామని సౌదీలో పనిచేస్తున్న గ్రీక్‌ సైనిక సిబ్బంది తెలిపారు. గ్రీక్‌ సైనిక సిబ్బంది సౌదీలో గగనతల రక్షణ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. హౌతీలతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎర్ర సముద్రం సరిహద్దులోని రెండు రాష్ట్రాలు…యన్బూ, జజాన్‌లకు సౌదీ అరేబియా హెచ్చరికలు జారీ చేసింది. యన్బూ ఓడరేవు నుంచి ప్రతి రోజూ లక్షలాది బ్యారల్స్‌ చమురు రవాణా అవుతుంటుంది.

జజాన్‌లో అతి పెద్ద చమురు రిఫైనరీ ఉంది. ఇది యెమన్‌ సరిహద్దున ఉన్న నగరం. రిఫైనరీకి తూర్పు దిశగా మంటలు వ్యాపించాయని నాసా విడుదల చేసిన ఛాయాచిత్రాలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు కారణమేమిటో తెలియలేదు. తమ సాయుధ దళాలు త్వరలోనే భారీ సైనిక చర్యను ప్రకటిస్తాయని హౌతీలు తెలిపారు. యెమన్‌ వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్ల కారణంగా సౌదీలోని పలు ప్రాంతాలలో పేలుడు శబ్దాలు వినిపించాయి. జజాన్‌, యన్బూ, దామద్‌ నగరాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని అరబ్‌ మీడియా తెలియజేసింది. జజాన్‌లో సౌదీ ఇంధన సంస్థ ఆరామ్కోకు చెందిన చమురు కేంద్రంపై క్షిపణి దాడి జరిగిందని చెప్పింది. క్షిపణి దాడుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. కాగా ఎర్ర సముద్రంలో హౌతీలు శుక్రవారం జరిపిన దాడిలో ఓ సౌదీ నౌక స్వల్పంగా దెబ్బతిన్నది.

హార్ముజ్‌ ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం : అరాగ్చీ
హార్ముజ్‌ జలసంధిలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు అమెరికాయే కారణమని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ఆరోపించారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరాగ్చీ మాట్లాడుతూ అమెరికా అనేక హామీలను ఉల్లంఘించి నేరాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ సైనిక చర్యలను రష్యా ఖండించడాన్ని స్వాగతించారు. సమస్యల పరిష్కారానికి దౌత్యానికే తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడతామని, ఇరాన్‌ జాతీయ భద్రతకు ముప్పు కలిగించడానికి హార్ముజ్‌ను అమెరికా ఉపయోగించుకోవడాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలోని దేశాల నేతృత్వంలో ప్రాంతీయ భద్రతా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో సాయపడేందుకు రష్యా సిద్ధంగా ఉన్నదని లవ్‌రోవ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -