– మనోవేదనకు గురిఐ పురుగుల మందు సేవించిన గిరిజన మహిళ
– కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు
– ఫారెస్ట్ అధికారుల తీరుపై గిరిజనుల ఆగ్రహం
నవతెలంగాణ – కామారెడ్డి
రాజంపేట మండలం షేర్ శంకర్ తండా పరిధిలో పోడు భూముల్లో అటవీ శాఖ చేపట్టిన చెట్ల పెంపకం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో సరోజా అనే గిరిజన ఒంటరి మహిళ పురుగుల మందు సేవించడంతో వెంటనే స్థానికులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది తండా వాసుల కథనం ప్రకారం, గత 15 రోజులుగా అటవీ శాఖ అధికారులు తాము సాగు చేస్తున్న పోడు భూముల్లో చెట్లు నాటేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ సందర్భంగా పంటలు దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆరోపించారు. స్థానికులు తెలిపిన విరాల ప్రకారం సరోజా సాగు చేస్తున్న భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదై ఉన్నప్పటికీ హక్కు పత్రం ఇంకా అందలేదని, ఈ విషయమై పలుమార్లు జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)ని కలిసి వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
మంగళవారం అధికారులు చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించగా, తన భూమిలో చెట్లు నాటవద్దని సరోజా వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు సేవించినట్లు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గిరిజనులు బాధ్యులైన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, సరోజాకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సరోజాకు ఏదైనా అపాయం జరిగితే అందుకు అటవీ శాఖ అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు విట్టల్ నాయక్, గులిబాయి, సరియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.



