హెచ్‌యుఎల్ వెల్లడి
ఉత్పత్తి వ్యయం పెరుగుదల ఎఫెక్ట్
న్యూఢిల్లీ : భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదల నేపథ్యంలో దిగ్గజ ఎఫ్‌ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యునిలివర్ (హెచ్‌యుఎల్) ధరలకు సిద్ధమవుతోంది. ముడిసరుకులపై వ్యయం పెరగడంతో రానున్న రోజుల్లో ధరలను మరింత పెంచనున్నట్లు ఆ కంపెనీ స్పష్టం చేసింది. దీంతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వంటి ఇతర దిగ్గజ కంపెనీల బాటలోనే హెచ్‌యూఎల్ కూడా నడుస్తూ పెరిగిన ఉత్పత్తి వ్యయ భారాన్ని వినియోగదారులపైకి మోపేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. డవ్, సర్ఫ్ ఎక్సెల్, పియర్స్, పెప్సోడెంట్ వంటి ప్రముఖ బ్రాండ్లను విక్రయించే హెచ్‌యుఎల్.. జూన్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణ ప్రభావంలో కేవలం సగం భారాన్ని మాత్రమే వినియోగదారులపైకి మళ్లించామని తెలిపింది. రానున్న రోజుల్లో ధరల విషయంలో మరికొన్ని తగిన చర్యలు తీసుకుంటామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా వెల్లడించారు. ఈ త్రైమాసికంలో కంపెనీ సుమారు 5 శాతం మేర ధరలను పెంచగా, అమ్మకాల పరిమాణం కూడా 5 శాతం పెరిగింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి హెచ్‌యుఎల్ తన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ కాలంలో కంపెనీ నికర లాభం 4 శాతం క్షీణించి 2,631 కోట్ల రూపాయలకు (రూ. 26.31 బిలియన్లు) పడిపోయింది.



