సబ్జెక్టులకు టీచర్ల కొరత..
ఇబ్బందుల్లో విద్యార్థులు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని 15 గ్రామంపంచాయితీలపరిధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత, కస్తూరిబ్బా, మోడల్ స్కూల్, ప్రాథమిక పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులకు టీచర్ల కొరతతో విద్యార్థులు చదువులకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలో మొత్తం 34 పాఠశాలున్నాయి. ఇందులో 5 జిల్లా పరిషత్, 25 ప్రాథమిక, రెండు ప్రాథమికోన్నత, ఒక మోడల్ స్కూల్, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో 1,468 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. వీరికి బోధించడానికి 152 మంది ఉపాధ్యాయులు ఉండాలి కానీ126 మంది మాత్రమే ఉండి 26 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి.
ఖాళీల పరిస్థితి ఇలా..
రుద్రారం హైస్కూల్లో ఎస్ఏ హిందీ, మల్లారం హైస్కూల్లో ఎస్ఏ తెలుగు, మోడల్ స్కూల్లో ప్రిన్స్ పాల్, టిజిటి సోషల్, టిజిటి ఇంగ్లీష్, టిజిటి తెలుగు, టిజిటి హిందీ, పిజిటి బొటీని, పిజిటి కామర్స్, పిజిటి పొలిటికల్ సైన్స్, పిజిటి ఇంగ్లీష్ ఇద్దరు, పిజిటి తెలుగు ఇద్దరు, కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో సిఆర్టీ హిందీ, సిఆర్టీ ఇంగ్లీష్, సిఆర్టీ సోషల్, క్రాఫ్ట్ ఇన్స్త్యుక్టర్, పీజీ సిఆర్టీ ఏకనామిక్స్, పీజీ సిఆర్టీ సీవీక్స్, పీజీ సిఆర్టీ తెలుగు, నర్సింగ్ రెండు పోస్టులు, ప్రాథమిక పాఠశాల తాడిచెర్ల ఎస్జిటి, ప్రాథమికొన్నత ఆన్సాన్పల్లి పాఠశాలలో ఎస్ఏ మ్యాస్, ఎస్జిటి తదితర సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఒకే ఉపాధ్యాయులు వేర్వేరు సబ్జెక్టులు లేదా తరగతులు చెప్పాల్సి రావడం పరీక్షలపై ప్రభావం. సిలబస్ పూర్తికాక పోవడంతో వార్షిక పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోవడం. పాఠశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులు అయోమయం చెందుతున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం పలు పాఠశాలల్లో సబ్జెక్టుటీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా ఖాళీలను జిల్లా అధికారులకు నివేదించామని, టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యూటే షన్పై సర్దుబాటు చేస్తున్నట్లుగా ఎంఈఓ లక్ష్మన్ బాబు తెలిపారు.



