భారతదేశంలో కొనసాగుతున్న ఎల్‌నినో ప్రభావం నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తూ, తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాధార నూనెగింజల పంటల దిగుబడిలో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తోంది. దేశీయ ఉత్పత్తి తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే వంటనూనెలపై ఆధారపడాల్సిన పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది లక్షలాది మంది రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సోయాబీన్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు తదితర ఖరీఫ్ నూనెగింజల పంటలు ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి. మొలకెత్తడం, పుష్పించడం, కాయలు ఏర్పడే దశల్లో ఈ పంటలకు సకాలంలో వర్షాలు అత్యంత అవసరం. అయితే ఆలస్యంగా లేదా తక్కువగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక వర్షాధార ప్రాంతాల్లో విత్తనాలు ఆలస్యమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం సాధారణంతో పోలిస్తే దాదాపు నలభై శాతం వరకు తగ్గినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి.దీర్ఘకాలంగా కొనసాగుతున్న వర్షాభావం నేలలో తేమను తగ్గించి పంటల ఎదుగుదలను దెబ్బతీస్తోంది. పంటల కీలక దశల్లో ఏర్పడుతున్న అధిక ఉష్ణోగ్రతలు కాయల ఏర్పాటును, గింజల అభివృద్ధిని ప్రభావితం చేసి మొత్తం దిగుబడిని తగ్గిస్తున్నాయి. ఎల్‌నినో సంవత్సరాల్లో పురుగుల ఉధృతి కూడా వేగంగా పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వేడి, పొడి వాతావరణం వల్ల అఫిడ్స్, వైట్‌ఫ్లై వంటి రసం పీల్చే పురుగులు అధికంగా వ్యాపించి రైతులు పురుగు మందులపై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో సాగు వ్యయం పెరిగి రైతుల ఆదాయం తగ్గుతోంది.
దేశీయ నూనెగింజల ఉత్పత్తి తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే భారతదేశం తన వంటనూనెల అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. దేశీయ ఉత్పత్తి మరింత తగ్గితే దిగుమతి బిల్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. గతంలో బలహీన రుతుపవనాల కారణంగా వంటనూనెల దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకోవడంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగి, అంతర్జాతీయ ధరల మార్పులు నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపాయి. పైగా వంటనూనెల లభ్యతపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆరోగ్యకరమైన వంటనూనెలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఎందుకంటే, ఈ భారాన్ని సామాన్యులే ఎక్కువగా భరించాల్సి వస్తుంది. వంటనూనెల ధరలు పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యంగా తక్కువ, మధ్యతరగతి కుటుంబాలపై ద్రవ్యోల్బణం మరింత భారంగా మారి, ఇతర అవసరాలపై చేసే ఖర్చులను కూడా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల ఆదాయం తగ్గడం, వినియోగదారులకు ధరల భారం పెరగడం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. తక్కువ ధర, విస్తృత లభ్యత కారణంగా భారతదేశం దిగుమతి చేసుకునే వంటనూనెల్లో పామ్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ ప్రధాన స్థానంలో ఉన్నది.
అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే గుణం ఉండటంతో ఇది దీప్ ఫ్రై, రోజువారీ వంటలకు అనుకూలంగా ఉం టుంది. ఇందులో విటమిన్-ఈ తో పాటు సహజ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.అయితే పామోలిన్ వినియోగంలో పరిమితి పాటించాలని పోషకాహార నిపుణులు సూచన. ఇందులో సుమారు యాభై శాతం సంతృప్త కొవ్వు (సాచ్యురేటెడ్ ఫ్యాట్) ఉండటం, అధికంగా తీసుకుంటే ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆవనూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను వినియోగించాలని కోరుతున్నారు. పామాయిల్ సాగు వేగంగా విస్తరించడం వల్ల అనేక ఉష్ణమండల దేశాల్లో అడవుల నరికివేత, జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతున్నది. పర్యావరణ హిత పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన పామ్ ఆయిల్‌ను ప్రోత్సహిం చడంతో పాటు దేశీయ నూనెగింజల ఉత్పత్తిని పెంచి దిగుమతులపై ఆధార పడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నది.
వాతావరణ మార్పులు భారత వ్యవసాయాన్ని నిరంతరం ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో, వాతా వరణానికి అనుగుణంగా వ్యవసాయ విధానాలను బలోపేతం చేయడం ముఖ్యం. రైతులకు సాంకేతిక సహాయం అందించడం, ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచడం ద్వారా మాత్రమే దేశ ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడగలమని నిపుణుల అభిప్రాయం. ఎల్‌నినో వంటి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. వర్షాధార ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాల విస్తరణ, కరువును తట్టుకునే నూనెగింజల విత్తనాల పంపిణీ, రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు అందించడం వంటి చర్యలను వేగవంతం చేయాలి. పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీలు, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు దేశీయ నూనెగింజల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. అదే సమ యంలో వంటనూనెల ధరలను నియంత్రిం చడం, అవసరమైనప్పుడు దిగుమతి విధానాలను సమర్థంగా అమలు చేయడం, ఆరోగ్యకరమైన వంటనూనెల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా రైతుల ప్రయో జనాలు, వినియోగదారుల అవసరాలు రెండింటినీ సమతుల్యం చేసే విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.
-డా. ఎం.సురేష్ బాబు
ఎల్‌నినో ప్రభావం…వంటనూనెల సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



