ఢిల్లీ తరహాలో ఉద్యమిస్తాం
అణచి వేసేందుకు అక్రమ కేసులు పెడుతున్న కేంద్రం
వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి మహమ్మద్ అతిక్
కరీంనగర్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
నవతెలంగాణ - కరీంనగర్
విద్యారంగ సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేయడంతో పాటు ఢిల్లీ తరహాలో ఉద్యమిస్తామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి మహమ్మద్ అతిక్ అన్నారు. రెండ్రోజులపాటు నిర్వహించే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ముందుగా నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి కళాభారతి వరకు విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళాభారతి వేదికగా నిర్వహించిన సభలో అతిక్ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం విద్యార్థుల ఉద్యమాలను అణచివేస్తూ.. ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా విద్యార్థులు ఏకమవుతున్నారని, బీజేపీని గద్దెదించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో నేటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందలేదని అన్నారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించి, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జిల్లా కేంద్రాల నుంచి మొదలు ఆందోళనలు చేపట్టి, ఢిల్లీ తరహాలో భారీ విద్యార్థి ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు, రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, మమత, రంజిత్ రెడ్డి, భరత్, రాజు, రమ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రశాంత్, అభి, స్మరాన్, శ్రీకాంత్, రాజు, లెనిన్, నాగకృష్ణ, మానస, మమత, జ్ఞాపిక, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కాంపెల్లి అరవింద్, గజ్జెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



