Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంవిషపూరిత కాలుష్యంలో రాజధాని బడులు

విషపూరిత కాలుష్యంలో రాజధాని బడులు

- Advertisement -

బీజేపీ పాలనలో పిల్లల ఆరోగ్యానికీ రక్షణ కరువు
ప్రపంచ రాజధానుల్లో అత్యంత ప్రమాదకర నగరంగా న్యూఢిల్లీ
90 శాతానికి పైగా ప్రయివేటు పాఠశాలలదీ అదే పరిస్థితి
పర్యావరణ నియంత్రణలో మోడీ సర్కారు విఫలం
అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : మోడీ పాలనలో భారత్‌‌లో కాలుష్య వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘స్వచ్ఛ భారత్’, ‘అభివృద్ధి చెందిన భారత్’ అంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పాలనలో దేశ రాజధాని న్యూఢిల్లీ విషపూరిత కాలుష్యానికి కేంద్రంగా మారింది. ఈ ఆందోళనకర వాస్తవాన్ని తాజా అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెలుగులోకి తెచ్చింది. అటు కేంద్రంలో, ఇటు ఢిల్లీలో బీజేపీ ‘డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కారు’ పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దేశ రాజధానిలోని 90 శాతానికి పైగా ప్రయివేటు పాఠశాలలు లెడ్ (సీసం), పాదరసం (మెర్క్యురీ), కాడ్మియం, ఆర్సెనిక్, పురుగు మందులు (పెస్టిసైడ్స్‌) వంటి ప్రమాదకర విషపదార్థాలతో కలుషితమైన ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల రాజధానులతో పోలిస్తే న్యూఢిల్లీ అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో ఇక్కడి పిల్లల ఆరోగ్యం, మేధో వికాసంపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశముందని నివేదిక హెచ్చరించింది. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు పర్యావరణ నియంత్రణలో విఫలమయ్యాయ ని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ​లండన్‌‌లోని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ (సీజీడీ)కి చెందిన పరిశోధకుడు లీ క్రాఫర్డ్ రూపొందించిన ‘‘స్కూల్స్‌ ఇన్‌ ‌ద షాడో ఆఫ్‌ ‌టాక్సిక్‌ ‌సైట్స్‌ : పొల్యూషన్‌ ‌ప్రాక్సి మిటీ ఇన్‌ ‌లో-అండ్‌ ‌మిడిల్‌-ఇన్‌‌కమ్‌ ‌కంట్రీస్‌’’ అనే నివేదికలో భారత్‌తో పాటు 17 తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోని 2,840 పాఠశాలల పరిస్థితిని విశ్లేషించారు. మొత్తం 26 లక్షల పాఠశాలలను 11,301 నమోదైన విషపూరిత కాలుష్య కేంద్రాలతో పోల్చి పరిశీలించారు.

​న్యూఢిల్లీలో 90 శాతానికి 
పైగా స్కూళ్లు డేంజర్‌ ‌జోన్‌‌లోనే!
ఈ అధ్యయనం ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ కాలుష్య ప్రమాదంలో ఉన్నాయి. ఈ దేశాల్లోని పాఠశాలల్లో దాదాపు 10 శాతం విషపూరిత కాలుష్య కేంద్రాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ముప్పు మరింత తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని రాజధానులన్నింటిలోనూ న్యూఢిల్లీ అత్యంత ప్రమాదకర నగరంగా ఉంది. ఇక్కడి 91.2 శాతం ప్రయివేటు పాఠశాలలు విషపూరిత కాలుష్య ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. న్యూఢిల్లీ తర్వాతి స్థానంలో మనీలా (86 శాతం), నైరోబీ (71 శాతం), అక్రా (67 శాతం), జకార్తా (51 శాతం) వంటి నగరాలు ఉన్నాయి. కాగా భారీ జనాభా కలిగి ఉన్నటువంటి మెక్సికో సిటీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపించాయి. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాలను నగరానికి దూరంగా ఏర్పాటు చేయడంతో ఇలాంటి కాలుష్య ముప్పు దాదాపు కనిపించలేదని నివేదిక పేర్కొంది.

​పిల్లలపై లెడ్ ప్రభావం తీవ్రం
సీసం (లెడ్) మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమైన లోహాల్లో ఒకటి. అది ఎంత తక్కువ పరిమాణంలో శరీరంలోకి ప్రవేశించినా సురక్షితం కాదని నిపుణులు చెప్తున్నారు. శరీరంలోకి వెళ్లిన తర్వాత అది ఎముకల్లో కాల్షియంలా నిల్వ ఉండి, రక్తంలో కలిసినప్పుడు గుండె, మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలూ కనిపించకుండానే రక్తపోటు పెరగడం, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో పిల్లల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుంది. లెడ్ మెదడులోని మైలిన్ పొరను దెబ్బతీసి నాడీకణాల మధ్య అనుసంధానాన్ని బలహీనపరుస్తుంది. ఫలితంగా ఏకాగ్రత తగ్గడం, వారి ప్రవర్తనల్లో సమస్యలు, దూకుడు స్వభావం, అభ్యాస సామర్థ్యం తగ్గిపోవడం, ఐక్యూ శాశ్వతంగా పడిపోవడం వంటి ప్రభావాలు కనిపిస్తాయని గత పరిశోధనలు ఇప్పటికే నిర్ధారించాయి.

​పట్టణాలకే ఎక్కువ ప్రమాదం
అధిక ఆదాయ దేశాల్లో కాలుష్య కారక పరిశ్రమలు సాధారణంగా పేదలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉండటం వల్ల అక్కడి ప్రజలే ఎక్కువగా ప్రభావితమవుతారు. కానీ భారత్ వంటి దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉందని అధ్యయనం వెల్లడించింది. పట్టణాల్లో జనసాం ద్రత ఎక్కువగా ఉండటం, కాలుష్య పరిశ్రమలు కూడా నగరాల మధ్యే ఏర్పడటం వల్ల ఒకే ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కాలుష్య ప్రభావానికి గురవుతున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో పట్టణ పాఠశాలలు గ్రామీణ పాఠశాలలతో పోలిస్తే నాలుగు నుంచి 28 రెట్లు ఎక్కువగా విషపూరిత ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి.

​ప్రధాన కారణం ‘లెడ్‌’
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే లెడ్‌లో 86 శాతం లెడ్-యాసిడ్ బ్యాటరీల తయారీకే వినియోగిస్తున్నారు. వాడిన బ్యాటరీలను రీసైకిల్ చేయడం ద్వారా లెడ్‌ను తిరిగి వినియోగించవచ్చు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ప్రక్రియ కఠిన భద్రతా ప్రమాణాల ప్రకారం జరుగుతోంది. అయితే భారత్ వంటి దేశాల్లో మాత్రం దీనిని పెద్దఎత్తున అనధికారి కంగా నిర్వహిస్తున్నారు. పాత బ్యాటరీలను పగులగొట్టి, లెడ్ భాగాలను సాధారణ కొలిమిల్లో కరిగించి మళ్లీ విక్రయించడం వల్ల లెడ్ మట్టి, నీరు, గాలిలో కలుస్తోంది. ఈ కాలుష్యం ఆహారం, తాగునీరు, గాలి ద్వారా మానవ శరీరంలోకి చేరుతోంది. భారత్‌లో 350కి పైగా ఆధునిక రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నప్పటికీ.. మొత్తం బ్యాటరీ వ్యర్థాల్లో సుమారు 90 శాతం అనధికారిక రంగంలోనే రీసైక్లింగ్ అవుతున్నట్టు నివేదిక వెల్లడించింది. ఈ రంగంలో నియంత్రణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, లాభాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది.

​ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది పిల్లలు ఏదో ఒక స్థాయిలో లెడ్ ప్రభావానికి గురవుతున్నారని అధ్యయనం అంచనా వేసింది. అందులో గణనీయమైన భాగం కాలుష్య ప్రాంతాల నుంచే వస్తోందని స్పష్టం చేసింది. ముఖ్యంగా అనధికారిక లెడ్-బ్యాటరీ రీసైక్లింగ్ కేంద్రాలే ప్రపంచ లెడ్ విష ప్రభావంలో సుమారు 33 శాతానికి కారణమవు తున్నాయని పేర్కొంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 80 లక్షల డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాల నష్టం – డీఏఎల్‌‌వై) నష్టపోతుం డగా.. దాదాపు ఎనిమిది లక్షల మరణాలు సంభవిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.

​నియంత్రణ సాధ్యమే
లెడ్‌ ‌కాలుష్య నియంత్రణను కఠిన చర్యలతో సమర్థవంతంగా చేయొచ్చని పరిశోధకులు లీ క్రాఫర్డ్‌ ‌తెలిపారు. ‘‘లెడ్ కాలుష్యం కంటికి కనిపించదు. అందుకే దాన్ని చాలా మంది పట్టించుకోరు. కానీ తీవ్రమైన కాలుష్య ప్రాంతాలను కఠినంగా నియంత్రించడం, మూసివేయడం, జనావాసాలకు దూరంగా తరలించడం పూర్తిగా సాధ్యమే. భారత్ గతంలో కొన్ని సందర్భాల్లో అలాంటి చర్యలు తీసుకుంది. ప్రజల ఒత్తిడి పెరిగితే మరింత సమర్థంగా అమలు చేయవచ్చు’’ అని ఆయన సూచించారు.

బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే ఈ సమస్య
దేశ రాజధాని ఇలాంటి ప్రమాదకర స్థితిలో ఉండడం బీజేపీ ప్రభుత్వ పర్యావరణ విధానాలు, కాలుష్య నియంత్రణ వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో స్పష్టం చేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం పిల్లల ఆరోగ్యం, వారి భవిష్యత్తు కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. కాలుష్య పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలిం చడం, అనధికారిక లెడ్ రీసైక్లింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవడం, పాఠశాలల చుట్టూ సురక్షిత పర్యావరణాన్ని కల్పించడం వంటి చర్యల్లో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -