నిరసనకారులతో చర్చలు జరపాల్సింది
దేశవ్యాప్తంగా పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం
న్యూఢిల్లీ : నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దీంతో దేశ ప్రజల నుంచి ఈ నిరసనకు మద్దతు లభిస్తోంది. కాగా ఢిల్లీలో నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ శ్రేణుల్లో సైతం అసంతృప్తి వ్యక్తమవుతోంది. యువత ఆగ్రహం నిజమైనదేనని, పోలీసుల లాఠీచార్జి, బలప్రయోగం ప్రజల్లో నిరసనకారుల పట్ల సానుభూతిని పెంచిందని వివిధ రాష్ట్రాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఈ ఉద్యమం రాజకీయంగా పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందన్న ఆందోళన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో సోమవారం వేలాది మంది సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్‌లో విద్యార్థులు సంఘీభావ నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాలు యువత అసంతృప్తి దేశవ్యాప్తంగా వ్యాపిస్తోందనే సంకేతమని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ నాయకుడు చెప్పారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆయన.. తమ జిల్లాలో నిరసనల్లో ప్రధానంగా వామపక్ష విద్యార్థి సంఘాలు పాల్గొన్నప్పటికీ ఈ అసంతృప్తి మరింత విస్తరించే ప్రమాదం ఉందని చెప్పారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో యువత పెద్ద సంఖ్యలో గుమికూడినా వారు ఎలాంటి నేరాలకూ పాల్పడలేదనీ, అలాంటప్పుడు పోలీసులు వారిపై లాఠీచార్జి చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి కంటే పోలీసుల చర్యలే ప్రజల్లో ప్రతికూల స్పందనకు కారణమయ్యాయని సదరు బీజేపీ నేత అభిప్రాయపడ్డారు.
‘కేంద్రం చర్చలు జరపాల్సింది’
ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేసిన మరుసటి రోజే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. హర్యానాకు చెందిన ఓ బీజేపీ కార్యకర్త కేంద్ర నాయకత్వం ఈ ఉద్యమాన్ని ప్రారంభంలో చాలా తేలికగా తీసుకుందని విమర్శించారు. ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ దాదాపు మూడు వారాల పాటు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే పార్టీ స్థానిక నాయకుల బృందాన్ని జంతర్‌మంతర్‌కు పంపించి చర్చలు ప్రారంభించి ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదని అన్నారు. ప్రస్తుతం తమ పార్టీ కార్యకర్తల్లో కూడా కొందరు నిరసనకారుల పక్షాన నిలుస్తున్నారనీ, సాధారణ ప్రజల సానుభూతి కూడా విద్యార్థులవైపే ఉందని ఆయన చెప్పారు.
యువత ఆవేదనను అర్థం చేసుకోవాల్సింది : బీజేపీ ఎమ్మెల్యే
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో కూడా విస్తృతంగా నిరసనలు జరగడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందనీ, ఇది విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి, నిరాశ పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. యువత ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీకి రాజకీయంగా దెబ్బ
విద్యార్థులు, యువత ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులు ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఇది బీజేపీకి నష్టాన్ని తీసుకొచ్చే ప్రమాదమున్నదని పరిశీలకులు చెప్తున్నారు. రాబోయే యూపీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని నిరసనకారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులు ఇప్పుడు బీజేపీని ఆత్మరక్షణలో పడేశాయి. సీజేపీ నిరసనలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో తాము తప్పు చేశామన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే చెప్తుండటం గమనార్హం. అయితే కాషాయ పార్టీలో అంతర్గతంగా వ్యక్తమవుతున్న ఇలాంటి అభిప్రాయాలు యువత ఆగ్రహాన్ని తక్కువ అంచనా వేయకూడదనీ, బలప్రయోగం కంటే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బీజేపీ శ్రేణుల్లోనే గట్టిగా వినిపిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
‘విద్యార్థులపై లాఠీచార్జి సరికాదు’
నిరసనలను అణచివేయడం కంటే విద్యార్థులతో చర్చలు జరపడమే సరైన మార్గమని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. డెహ్రాడూన్‌కు చెందిన బీజేపీ మున్సిపల్ కార్పొరేటర్ నందిని శర్మ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు తమ డిమాండ్లు వినిపించే హక్కు ఉందన్నారు. యువతపై లాఠీచార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిందని ఆమె తెలిపారు. డెహ్రాడూన్‌కు చెందిన మరో కార్పొరేటర్ అమితా సింగ్ కూడా విద్యార్థులపై లాఠీచార్జిని సమర్థించలేదు. నిరసన చేస్తున్న విద్యార్థులు, యువతపై బలప్రయోగం అవసరం లేదన్నారు. ముంబయికి చెందిన బీజేపీ మద్దతుదారు శ్రీధర్ మణిక్కన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొదటి నుంచే నిరసనకారులతో కూర్చుని వారి డిమాండ్లపై చర్చించి ఉండాల్సిందని అన్నారు.
యువత వైపే ప్రజల సానుభూతి
- Advertisement -
- Advertisement -



