‘ప్రేమంటే ఏమిటి?’ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెబుతారు. ఎవరు ఎలా చెప్పినా ఎదుటి వారికి మీరు చూపించే ప్రేమ కనిపిస్తుంది. అది వారి మధ్య ఉన్న బంధంపై ఆధారపడి ఉంటుంది. కొంత మంది భార్యాభర్తలు ఏండ్ల తరబడి కలిసి జీవిస్తున్నా నువ్వుంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పుకోరు. చెప్పలేదు కాబట్టి వారి మధ్య ప్రేమ లేదని కాదు! కొంత మంది జంటలు రోజులో ఒక్కసారైనా ‘ఐ లవ్ యు’ అని చెప్పుకుంటారు. అది చూసి వీరి మధ్య చాలా ప్రేమ వుంది అనుకోలేము! మొత్తంగా ప్రేమ, ప్రేమను కోరుకుంటుంది. జంటలో ఒకరు ఎక్కువ ప్రేమను చూపిస్తే ఇంకొరు పెద్దగా చూపించకపోవచ్చు. కొంత మంది మాటల్లో తమ ప్రేమను చూపిస్తే మరికొందరు చేతల్లో చూపిస్తారు. ఏదో ఒక విధంగా మీకు మీ భాగస్వామిపై ఉన్న ప్రేమను చూపించాలి. లేదంటే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీకోసం…
పద్మకు 42 ఏండ్లు ఉంటాయి. అజయ్‌కి 45 ఏండ్లు. వీరి పెండ్లి జరిగి 20 ఏండ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరూ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అత్తామామ, మరిది, తోటికోడలు వీరితోనే కలిసి ఉంటారు. ఆడపడుచు పిల్లలు కూడా ఎక్కువగా వీళ్ల ఇంట్లోనే ఉంటుంటారు. పద్మ బావ, తోడికోడలు మాత్రం ఇల్లు కొనుక్కొని వేరే ఉంటున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. వాళ్లకీ ఇద్దరు పిల్లలున్నారు. అయితే అజయ్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. సరదాగా ఉండడు. పద్మ ఏమైనా మాట్లాడితే దానికి మాత్రమే సమాధానం ఇచ్చి ఊరుకుంటాడు. అంతకు మించి ఇంకో మాట ఉండదు. పోని పద్మ చెప్పిందైనా వింటాడా అంటే అదీ లేదు. ఆమె మాట్లాడుతుంటే ఫోన్ చూస్తూ ఉంటాడు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడదామని చేస్తే కట్ చేస్తాడు. ఒక వేళ ఫోన్ ఎత్తినా అర నిమిషం కూడా మాట్లాడడు. మెసేజ్ పెట్టినా చూడడు. షాపింగ్‌కి వెళ్లినా ‘నీకు నచ్చింది తీసుకో’ అంటాడు తప్ప, ‘నీకు ఇదైతే బాగుంటుంది తీసుకో’ అనడు. పద్మకు ఆ షాపు నచ్చక వేరే షాప్‌కు వెళదామంటే ‘ఎక్కడైనా ఇవే ఉంటాయి, ఏదో ఒకటి తీసుకో’ అంటాడు. పెండ్లయి 20 ఏండ్లు అవుతున్నా ఒక్కసారి కూడా బయటకు తీసుకెళ్లలేదు. షాపింగ్‌కి కూడా ఎప్పుడో పెండ్లయిన కొత్తలో తీసుకెళ్లాడు.
తర్వాత నుండి పద్మ తన స్నేహితులతోనే వెళుతుంది. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే చూద్దాం అంటాడు కానీ రాడు. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తాడు. ఇలా చాలా సార్లు జరిగింది. కొన్ని సార్లు అజయ్‌ని వదిలిపెట్టి ఇతర కుటుంబ సభ్యుతో కలిసి వెళ్లేది పద్మ. ఒక్కడ అందరూ జంటలుగా వస్తే ఆమె మాత్రం ఒంటరిగా వెళ్లేది. అప్పుడు ఆమెకు చాలా బాధగా ఉండేది. కనీసం ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేవైనా వెళదామంటే వినిపించుకోడు. ‘ఇలాంటి ట్రిప్‌లు సరదాగా ఉంటాయి. అవి మన జీవితంలో మంచి జ్ఞాపకాలుగా వుంటాయి. మన ఏజ్ అయిపోయిన తర్వాత చెప్పుకోవడానికి, చూసుకోవడానికి బాగుంటాయి’ అని పద్మ ఎంత చెప్పినా అర్థం చేసుకోడు. పెళ్లి రోజు, పుట్టినరోజులకు సర్ప్రైజ్ చేద్దాం అనుకొని ప్లాన్ చేస్తే దానికి కూడా కోపగించుకుంటాడు. కనీసం ఫొటో తీసుకోవడానికి కూడా ఇష్టపడడు. దాంతో పద్మ చిన్న చిన్న సంతోషాలకు కూడా నోచుకోలేక ఎంతో బాధపడుతుంది. ఒక పక్క తోటి కోడలు, మరిది సంతోషంగా గడుపుతుంటే ఆమెకు ఆవేదన మరీ ఎక్కువైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఎలాగైనా తన భర్తతో మాట్లాడి అతనికి తన మనసులోని బాధను అర్థమయ్యేలా చెప్పమంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
పద్మ చెప్పింది మొత్తం విన్న తర్వాత మేము అజయ్‌ను పిలిపించి అడిగితే ‘సరదాగా ఉండాలని, మాట్లాడాలని నాకూ ఉంటుంది మేడం. కానీ ఇంట్లో అమ్మానాన్న, పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు ఆమెతో ఎలా మాట్లాడగలను. పైగా ఇంట్లో నేనే పెద్దవాడిని. మా తమ్ముడు అంటే చిన్నవాడు కాబట్టి తన భార్యతో సరదాగా ఉంటాడు. బయటకు వెళ్లి ఇద్దరూ తిరిగి వస్తారు. నేను కూడా అలా ఉంటే ఏం బాగుంటుంది? పైగా మా అమ్మకు ఇలా బయట తిరగడం పెద్దగా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి అస్సలు ఒప్పుకునేది కాదు. అందుకే నాకు అదే అలవాటైపోయింది. మాట్లాడటానికి సమస్య ఏమీ లేదు కానీ, ఏం మాట్లాడితే ఏం గొడవలు అవుతాయో అని భయంతో తక్కువగా మాట్లాడతాను. ఇక ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత చాలా బిజీగా ఉంటాను. అందుకే ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాను. అలా అని నాకు ప్రేమ లేదంటే ఎలా? నాకు పద్మంటే చాలా ఇష్టం. ప్రతి నెలా తను పీరియడ్స్ టైంలో నొప్పితో బాధపడుతుంటే పనులన్నీ నేనే చేస్తాను. తన మీద ప్రేమ లేకపోతే ఎందుకు చేస్తాను. ఇవేమీ గుర్తించకుండా మీ దగ్గరకు వచ్చింది. తను నమ్మినా నమ్మకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం. ఆమె లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను. తను ఏదైనా చెబితే నేను ఎప్పుడూ నో అని చెప్పలేదు. ఆమె ఇచ్చే చిన్న చిన్న బహుమతులంటే నాకు చాలా ఇష్టం.
అలాగే అప్పుడప్పుడు సర్ప్రైజ్ పార్టీలు పెడుతుంది. అవి కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. కానీ బయటకు చెప్పను అంతే. నా పుట్టిన రోజు, పెండ్లిరోజు కోసం నేను చాలా ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే తను ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో అని ఆశతో. కానీ ఇవేవీ నేను బయటకు చూపెట్టలేకపోతున్నాను. ఎవరేమనుకుంటారో అనే తప్ప లోపల చాలా సంతోషిస్తాను. అలా తనలోపలి భావాలను అజయ్ చెప్తుంటే పద్మ ఆశ్చర్యపోయింది. ‘ఏమిటి మీరు ఇన్ని విధాలుగా ఆలోచిస్తారా? నాకు ఎప్పుడూ చెప్పలేదు మరి. ఎప్పుడూ చిరాకుగా ఉంటుంటే ఇవేవీ మీకు ఇష్టం లేదేమో అనుకున్నాను. అందుకే ఈ సారి మన పెండ్లి రోజుకు ఏమీ చేయలేదు. నేనే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా’ అంటూ బాధపడింది. దానికి మేము సమస్యా మీ దగ్గరే ఉంది, పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంది. తమ ప్రేమను అందరూ ఒకేలా చూపించలేరు. కొందరు మాటల్లో, కొందరు చేతల్లో చూపిస్తారు. అది అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది అని చెప్పి అజయ్‌తో ‘మీరు ఇంట్లో పద్మతో మాట్లాడటానికి ఇబ్బంది పడితే అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వెళ్లండి. లేదంటే మీరిద్దరే వెళ్లిరండి. ఎవరో ఏదో అనుకుంటారని మీరు మీ సంతోషాలను దూరం చేసుకోవద్దు. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. కాకపోతే అది చూపించడంలోనే తేడా ఉంది. అది అర్థం చేసుకొని ఇద్దరూ సంతోషంగా ఉండండి’ అని చెప్పి పంపించాము.



