Saturday, August 1, 2026
E-PAPER
Homeఖమ్మంఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ అమలు

ఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ అమలు

- Advertisement -

– యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కొనుగోలుకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
– ఎరువుల విక్రయ కేంద్రాల్లో క్యూ ఆర్ కోడ్ తోనే సరఫరా
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ రంగంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 6 నుంచి సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ (ఎస్‌ఎఫ్‌ఎస్ – ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అమల్లోకి తీసుకురానుంది. ఈ విధానం ప్రకారం యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర రసాయన ఎరువులను కొనుగోలు చేయాలంటే రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అయి ఉండటం తప్పనిసరి. ఎరువుల విక్రయ కేంద్రాల్లో రైతులు ఫార్మర్ ఐడీనతో యాప్ లో జనరేట్ అయిన క్యూ ఆర్ కోడ్ చూపించిన తర్వాతే ఎరువులు అందజేస్తారు.

ఇప్పటివరకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయని రైతులు ఆగస్టు 6లోపు నమోదు పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. నమోదు కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ), మీసేవ కేంద్రం లేదా సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్)లను సంప్రదించవచ్చు.

ఎఫ్‌ఎఫ్ఎస్  డిజిటల్ వ్యవస్థ ద్వారా ఎరువుల అమ్మకాలు, నిల్వలు, సరఫరా, డిమాండ్‌ను సమగ్రంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రైతుల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల విక్రయాలు నమోదు చేయడంతో పాటు ఆధార్, ఈ-కేవైసీ, భూ వివరాల ధృవీకరణ, పీఓఎస్ యంత్రాల ద్వారా విక్రయాల నమోదు, డీలర్ల స్టాక్ వివరాల పర్యవేక్షణ, రోజువారీ విక్రయాలు–నిల్వల నివేదికలు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌బోర్డ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ వ్యవస్థ ద్వారా రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులోకి రావడం, అనవసర క్యూలు తగ్గడం, పారదర్శక పంపిణీ, నల్లబజారు మరియు అక్రమ నిల్వలకు అడ్డుకట్ట పడటం, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల వినియోగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగనున్నాయి.

వ్యవసాయ శాఖకు కూడా రియల్‌టైమ్‌లో విక్రయాలు, నిల్వల సమాచారం అందుబాటులో ఉండటంతో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా ప్రణాళిక రూపొందించడం, కొరత ఉన్న ప్రాంతాలకు వెంటనే ఎరువులను మళ్లించడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం సులభం కానుంది. వ్యవసాయ రంగంలో డిజిటల్ పారదర్శకతను పెంపొందించేందుకు తీసుకొచ్చిన ఈ నూతన విధానాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఫార్మర్ రిజిస్ట్రీని వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -