Sunday, August 2, 2026
E-PAPER
Homeచౌరస్తాసారీ...స్‌!

సారీ…స్‌!

- Advertisement -

‘హలో సిస్టర్‌ హౌ ఆర్‌ యూ’ అన్నాడు కృష్ణారావు గుస్సీ బ్లాక్‌ కళ్లజోడు కళ్లమీది నుంచి తీసి టేబిల్‌ పై పెడుతూ.
‘ఫైన్‌ థాంక్స్‌. కొత్తవా?’ అంది కళ్లజోడు వైపు చూస్తూ, టీ కప్పు పొగల్తో బ్రదర్‌ చేతికి అందిస్తూ సిస్టర్‌ ద్రుపద.
‘ఈ మధ్యే కొన్నా. లక్షా ఎనభై వేలే. బావగార్లు ఏమంటున్నారు అంతా హేపీనే కదా!’ అన్నాడు అన్నయ్య.
‘ఏమి హేపీ బ్రో, ఇలా వున్నాం’ అంది చెల్లెమ్మ దిగాలుగా.
‘టీ బాగుంది టీవీలో సుమ చెప్పే వాగ్‌బక్రీనే కదా!’ అన్నాడన్నయ్య టాపిక్‌ ఛేంజ్‌ చేద్దామని.
‘వదిన్లేమంటున్నారు. వోకేనే గద’ అంది చెల్లెమ్మ ఆ పనే చెయ్యడానికి. కానీ ఆమె వల్ల కాలేదు.
‘తల్చుకుంటే వళ్లు మండుతోందన్నయ్య!’ అంది చెల్లెమ్మ కళ్లు మూసుకుని.
‘అవును నాక్కూడా’ అన్నాడన్నయ్య కళ్లు వెడల్పుగా తెరిచి.
‘ఆ బ్లడీ బావ్‌డీ విలన్‌ని, ఆ సిగ్గుమాలిన ప్రతినాయకుడ్ని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలన్నయ్యా!’
‘ఒక్కమాట చాలు, ఇంగ్లీషూ తెలుగూ రెండూ ఎందుకులేమ్మా! ఎవడ్ని ఎన్‌కౌంటర్‌ చెయ్యాలంటావు. లాక్కురమ్మన్నవాణ్ణా? లాక్కువచ్చినవాణ్ణా?’ అడిగాడు బ్రో.
ఇద్దర్నే కాదు నలుగుర్నీ. దుష్టచతుష్టయాన్ని’ అంది సిస్‌ మండిపడుతూ.
‘ఒక్కమాట చాలమ్మా. సంస్కృతమూ, తెలుగూ రెండూ ఎందుకు? అయినా నీ హబ్బీలు అయిదుగురినీ ఎవడు ఆడమన్నాడు గ్రేట్‌ గాంబ్లర్స్‌ లాగ’
‘అందరూ కాదులే అన్నా ఆ పెద్ద పతికే యమపిచ్చి. ఆటలో కూచున్నాడంటే అమ్మనీ, ఆలినీ, ఒంటినీ మరచిపోతాడు’.
‘అవన్నీ ఇప్పుడెందుకు లేమ్మా!’
‘ఎలా మరచిపోతానన్నా. జనంతో కిటకిటలాడుతున్న దర్బార్‌ హాల్లో గాంబ్లింగ్‌లో నన్ను ఓడి, నా మొగుళ్లందరూ తలలు వంచుకుని నేల చూపులు చూస్తుంటే, నిండు సభలోకి నన్ను లాక్కువచ్చి’ కోపంతో నాలుక మడతపడింది సిస్టర్‌కి.
‘అప్పుడు నువ్వు పాడిన పాట నాకింకా గుర్తుందమ్మా’.
‘సమయానికి పాట తట్టింది కాబట్టి సరిపోయింది’
‘పాటకంటే వాల్యూమ్‌ ముఖ్యమమ్మా. అది నా చెవుల్ని చిల్లులు పొడిచి లాక్కువచ్చింది’.
‘ఊరికే చేతులూపుకుంటూ రాలేదు కదా నవ్వు. సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌నే తీసుకువచ్చావు కదూ’
‘ఒకటా రెండా, మాంగళ్య, రూపాంజలి, లక్ష్మీసిల్క్స్‌… అన్ని షాపుల చీరలూ మోసుకొచ్చాను.
‘అవునన్నయ్య! కళ్లు మూసినా తెరిచినా, నించున్నా, కూచున్నా ఇన్‌స్టా గ్రాం చూస్తున్నా, వంటింట్లో తిరగమోత పెడుతున్నా క్షణం క్షణం, ప్రతిక్షణం గుర్తుకు వస్తున్నది’
‘ఏమిటమ్మా చెప్పు ఏమిటది?
‘ఇంకా అర్థం కాలేదా బ్రో. నువ్వు నన్ను సేవ్‌ చెయ్యడానికి తెచ్చిన చీరలే ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నవి. ఎన్ని రంగులు.. ఎన్ని డిజైన్లు.. అన్నీ ఇట్టే కనిపించి అట్టే మాయం అయిపోయినవి. అబ్బ ఏం చీరలవి. రాణీ పింక్‌, గ్రీన్‌, మస్టర్డ్‌ ఎల్లో… వాటి గురించే నా బాధ అన్నయ్యా’
‘అయితే నన్నిప్పుడేం చెయ్యమంటావు చెల్లీ’
‘అట్టి, ఆనాటి చీరలన్నీ నాకోసం తెచ్చినవే కనుక నాకిచ్చేస్తే, మళ్లీ యుద్ధం వచ్చి వీళ్లు గెలిచి రాజ్యానికి వచ్చేదాక చీరలడగను. ఇదే నా శపథం!’
ఆలోచనలో పడ్డాడు కృష్ణారావు. తర్వాత ఇలా అన్నాడు… ‘ఆ వేళ దర్బార్‌ హాల్లోకి నీ కోసం తెచ్చిన చీరలన్నీ మోసుకుపోయి ద్వారకాపురిలో పడేశానా? వాటి మీద ఎగబడ్డారు నీ ఎనిమిది మంది వదినలు. పోటీలు పడ్డారు. గొడవ పడ్డారు. నానా గందరగోళం జరిగిపోయిందనుకో’.
‘హయ్యో! ఎంత పని జరిగిందన్నయ్యా! నువ్వు నాకోసం తెచ్చిన చీరల కోసం వదినలు పోట్లాడుకోడం ఏమన్నా బాగుందీ… అన్నీ వాళ్లే ఉంచేసుకున్నారన్నమాట. ఒక్కటంటే ఒక్కటీ మిగల్లేదూ! పటోలా, పైథానీ, మైసూర్‌సిల్కు… ఒక్కటి కూడా…’
‘మంగళగిరి, నారాయణపేట్‌, వెంకటగిరి, పెన్‌కలంకారీ, బాందినీ, జిందాని, టస్సర్‌, ఆఖరుకు జార్జెట్‌, కంచి, కాటన్‌ చీరల్లో ఒక్కటీ మిగలకుండా ఎత్తుకుపోయి అలమరాల్లో నింపుకున్నారు. సారీ చెల్లీ… నీకా సారీల్లో ఒక్కటీ ఇవ్వలేకపోయినందుకు వెరీ.. వెరీ.. సారీ’ అన్నాడన్నయ్య.
‘పోనీలే అన్నయ్యా! హజ్బెండ్‌ అన్నాక, వైఫ్‌కి చీరలు కొనివ్వడానిక్కాకపోతే దేనికన్నట్టు. అందుకేగా పెళ్లిమంత్రాల్లో ‘నాతిచీరామి’ అంటారు. నువ్వు మాత్రం ఏం చేస్తావు’.
‘హమ్మయ్య క్షమించావు కదమ్మా!’ అన్నాడన్నయ్య ఆనందో బ్రహ్మయ్యలాగ.
‘పర్వాలేదులే అన్నయ్యా! టీ తాగడం అయింది కదా! ఆషాఢంలో వచ్చావు కనక క్షమించే ఛాన్సుంది. షాపుల్నిండా చీరలున్నాయి. ఆషాఢం సేల్స్‌.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు. వెళ్లి కొనుక్కుందాం. నీ ఫోన్లో పేటియం ఉంది కదా.. పుట్టింటి పట్టుచీర కట్టుకోవాలని ఏ ఆడకూతురికి ఉండదు? ఓ నాలుగో అయిదో నాకు నచ్చినవి, ఓ రెండో మూడో నీకు నచ్చకుండా వుండవు కదా.. అన్నీ కలిపి ప్యాక్‌ చేయించుకు వద్దాం. నువ్వు లక్కీ అన్నయ్యా! ఆషాఢం సేల్స్‌ ధమాకా కదా!
ఆషాఢం వచ్చిందంటే మగ పర్సుకి ఖర్చన్నమాట. బుద్ధిగా ఐదో పదో పచ్చగాంధీలిచ్చి వదిలించుకోడం భర్తల ఆరోగ్యానికి మంచిది. ఊరికే ఉత్సాహపడి వెంట వెళ్లారో.. షాపువాడు అద్దాల్లోంచి ఇవతలకి లాగి గుట్టలుగా పడేసిన చీరల మధ్య బిక్కుబిక్కుమంటూ కూచోవాల్సి వస్తుంది సుమా! కృష్ణారావు చెల్లెలయితేనేం, గవర్నర్‌ సతీమణి అయితేనేం చీరకు కావాల్సింది… చీరే!!

చింతపట్ల సుదర్శన్‌
9299809212

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -