అంబేద్కర్ అభయ హస్తం ద్వారా
యువతకు ఉపాధి కల్పించాలి
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
దళిత కాలనీలో సర్వే : తెలంగాణ
వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
సమాజంలో అత్యంత వెనుకబడ్డ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, అంబేద్కర్ అభయ హస్తం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల దళిత కాలనీలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య పాల్గొని మాట్లాడారు. గ్రామంలో 250 దళిత కుటుంబాలు ఉన్నాయనీ, వారంతా రెక్కల కష్టం మీద ఆధారపడి వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారని తెలిపారు. ఇల్లు లేని వారికి ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనేకమంది యువత పెయింటర్స్, బిల్డింగ్ వర్కర్స్ కూలీలుగా పనిచేస్తున్నారని, వారికి అంబేద్కర్ ఆభయ హస్తం కింద రూ.12లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. దళితులకు కేటాయించిన కమ్యూనిటీ హాల్ శిథిలావస్థలో ఉందని, నూతన భవన నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పెన్షన్స్ మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మహిళలకు రూ.2500, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12000 చెల్లించాలన్నారు. సామాజిక భద్రతా పింఛన్లను రూ.2016 నుంచి రూ.4000 వరకు, వికలాంగులకు రూ. 6000 ఇచ్చి హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, ఉపసర్పంచ్ పిట్టల వెంకన్న, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మలేటి కోటయ్య, గిరిజన సంఘం కురవి మండల కార్యదర్శి గుగులోతు కిషన్‌నాయక్, మత్స్య కార్మిక సంఘం జిల్లా నాయకులు పిట్టల దరగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శనిగరం వెంకన్న, సీఐటీయూ నాయకులు గోపి, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.
దళితుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



