Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతలాపునే వాగు.. తడారని గొంతులు

తలాపునే వాగు.. తడారని గొంతులు

- Advertisement -

వర్షాకాలంలోనూ తప్పని తాగునీటి తిప్పలు
అస్తవ్యస్తంగా మురుగు కాలువలు
గంగాధర మండలం వెంకటాయపల్లిలో తిష్ట వేసిన సమస్యలు
‘నవతెలంగాణ’ గ్రామ పర్యటనలో వెలుగులోకి
నవతెలంగాణ – గంగాధర

వర్షాకాలంలో వరదనీటి ఉధృతితో ప్రవహించే వాగు తలాపునే ఉన్నా తాగునీటి కష్టాలు గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. గ్రామంలో బావులు, బోర్లు ఎన్ని ఉన్నా భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి సమస్యతో తల్లడిల్లుతుండగా, అనేక సమస్యలు తిష్ట వేశాయి. కరీంనగర్‌ ‌జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామాన్ని ఆదివారం ‘నవతెలంగాణ’ ప్రతినిధి పర్యటించగా.. ఆసక్తికర అంశాలు, పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అనేక గ్రామాల మీదుగా వరద నీటి ప్రవాహాన్ని మోసుకెళ్లే వాగు.. గ్రామాన్ని ఆనుకునే వెళ్తున్నా గ్రామంలోని బావులు, బోర్లలో భూగర్భ జలాల పెంపు లేకుండా పోతోంది. వాగును ఆనుకుని ఉన్న పలు వ్యవసాయ బావులు, బోర్లలో ఊట పెరుగుతుందే తప్పా గ్రామంలో దాహార్తిని తీర్చే తాగునీటి బావి, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వెంకటాయపల్లి గ్రామంలోని తాగునీటి బావికి, పలు బోర్లకు మోటార్లు పెట్టి నల్లాల ద్వారా గ్రామంలోని ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు వస్తే వచ్చినట్టు లేదంటే అంతే. గ్రామంలో తాగునీటి సమస్యే ప్రధాన సమస్యగా మారింది. అంతేకాదు, పలు వీధుల్లో సీసీ రోడ్లు వేసి మురుగు కాల్వల నిర్మాణాన్ని విస్మరించారు. గ్రామంలోని ఆయా వీధుల్లో ఎన్నో ఏండ్ల కిందట నిర్మించిన డ్రయినేజీలు తప్పా, ప్రస్తుతం పెరిగిన జనాభాకు, గృహాలకు సరిపడే విధంగా లేకపోవడంతో మురుగునీటి ప్రవాహం సక్రమంగా జరగక డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దాంతో ఇండ్లలో వినియోగించిన మురుగునీరు ఇండ్ల పరిసరాలు, రోడ్లపైకి చేరుతున్నాయి. ఈ కారణంగా గ్రామంలోని పలు వీధుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షపునీరు, మురుగునీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని గ్రామస్తులు వాపోయారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రయినేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. కాలనీలో ఉన్న ఇండ్ల వరకే మురుగు కాల్వలు నిర్మించి చేతులు దులుపుకోవడంతో ఆ నీరు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేక దుర్గంధం వెదజల్లుతోందని కాలనీ వాసులు వాపోయారు. జీపీకి ప్రభుత్వపరంగా వస్తున్న 15 ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలకే పోగా, చాలీచాలని నిధులతో గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ జనాభా 1400 ఉండగా, 1200 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా ఎక్కువే ఉన్నా ఈ గ్రామానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగాని, ఎంపీ బండి సంజయ్ కుమార్ గాని ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే తప్ప గ్రామంలో తిష్ట వేసిన సమస్యలకు పరిష్కారం లభించే పరిస్థితులు కనిపించడం లేదు.

అసంపూర్తిగా పంట కాల్వ.. ఆందోళనలో రైతులు
గ్రామాన్ని ఆనుకుని వాగు ఉన్నా వర్షాకాలం వరదనీటి ప్రవాహానికి తప్పా గ్రామస్తులకు ఎంతమాత్రం ఉపయోగం లేకుండాపోతోంది. బావులు, బోర్ల నీటిపై ఆధారపడి గ్రామంలోని భూములను రైతులు సాగు చేసుకోవాలి తప్ప ప్రత్యామ్నాయ నీటి వనరు లేదు. అయితే కాళేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గ్రామం మీదుగా తవ్వకం చేపట్టిన పంట కాల్వ ఏండ్లుగా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఈ కాల్వ తవ్వకం పూర్తయితే తమ పంటలకు సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నారాయణపూర్ జలాశయానికి చేరగా, తవ్వకం పూర్తయిన పంట కాల్వల ద్వారా చర్లపల్లి (ఎన్), కొండాయపల్లి, మల్యాల వరకు గల పలు రకాల పంటలకు సాగునీరు అందుతోంది. తమ గ్రామం మీదుగా చేపట్టిన పంట కాల్వను త్వరితగతిన పూర్తి చేసి సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

​తాగునీటికి కటకటే
వాగును ఆనుకునే గ్రామం ఉన్నా తాగునీటి సమస్య ఎక్కువే ఉంది. మిషన్ భగీరథ నీరో, బావి, బోరు నీరోగాని రోజుకోసారి నల్లా ద్వారా నీరు వస్తుంది. మా ఊరికి ప్రభుత్వపరంగా నిధులు కేటాయించి ఏ కాలంలోనూ తాగునీటి సమస్య లేకుండా చూడాలి.
– రాగుల రాములు, గ్రామస్తుడు

నిధులు లేకే ఇబ్బందులు
గ్రామంలో నెలకొన్న ఏ సమస్య తీర్చాలన్నా నిధులే ముఖ్యం. గ్రామంలో తాగునీరు, డ్రయినేజీ సమస్యే ప్రధానంగా ఉన్నాయి. గ్రామానికి వచ్చే ప్రభుత్వ నిధులే తక్కువ. వచ్చిన నిధులు కరెంట్ బిల్లులు, జీపీ సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే చొరవతోపాటు వచ్చే కొద్దో, గొప్పో నిధులతో గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తా.

గంకిడి సంధ్య రాంచంద్రారెడ్డి, సర్పంచ్

​మురుగు కాల్వలు సక్రమంగా లేవు
ఎన్నో ఏండ్ల కింద నిర్మించిన మురుగు కాల్వలు సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నం. మా ఎస్సీ కాలనీలో ఇండ్ల వరకే డ్రయినేజీలు నిర్మించి వదిలారు. కాల్వలోకి వెళ్లే మురుగునీరు కాల్వల్లోనే నిల్వగా మారి వాసన, దోమలతో సతమతం అవుతున్నం.
– గుండు మల్లేశం, గ్రామస్తుడు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -