సీఎంకు విద్యా కేటాయింపులపై
స్పష్టత లేదు
పోరాటానికి టీఎస్ యూటీఎఫ్ సిద్ధం : సంఘం రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు
చావ రవి, ఎ. వెంకట్
కామారెడ్డిలో టీఎస్ యూటీఎఫ్
రాష్ట్ర కమిటీ సమావేశాలు
పలు అంశాలపై తీర్మానాలు
నవతెలంగాణ-కామారెడ్డి
ఉపాధ్యాయుల సమస్యలన్నీ విద్యారంగానికి సంబంధించినవేనని, ఉపాధ్యాయులు సంతృప్తిగా పనిచేయాలంటే సమస్యలన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ముఖ్యమంత్రి చెప్పినట్టు విద్యారంగ సమస్యలపై ఐక్యంగా కొట్లాడాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చావ రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదం ఏర్పడిందన్నారు. హేతుబద్ధీకరణ జీఓ 25 విద్యారంగానికి మరణ శాసనం లాంటిదని, దాన్ని హేతుబద్ధంగా సవరించాలని డిమాండ్ చేశారు. సర్వీసు నిబంధనల సంక్షోభం పరిష్కారానికి చొరవ చూపాలని, డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని, వాటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలన్నారు. ఆగస్టు 15లోగా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు గడువు ముగిసి మూడేండ్లు గడుస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. ఆరు వాయిదాల కరువుభత్యం విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల విడుదలలో పారదర్శకత పాటించాలని కోరారు. ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని అన్ని హాస్పిటల్స్‌లో సమర్థవంతంగా అమలు చేయటానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టాలని కోరారు.
ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు
ఊతమిచ్చేలా సీఎం వ్యాఖ్యలు : ఎ.వెంకట్
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్పొరేట్ పాఠశాల ప్రారంభోత్సవాలకు హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపై రూ.1,80,000 ఖర్చు చేస్తున్నామని, మరోమారు ప్రతి సంవత్సరం రూ.80,000 ఖర్చు చేస్తున్నామని వివిధ వేదికల్లో వివిధ రకాలుగా తెలపడం శోచనీయమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7 శాతం లోపు బడ్జెట్ కేటాయించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడే విధానం.. ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలలకు ఊతమిచ్చే విధంగా ఉందని విమర్శించారు. నూతన విద్యావిధానం 2020ని అమలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటికే 93వేల పాఠశాలలు మూతపడ్డాయన్నారు. భవిష్యత్తులో నూతన విద్యా విధానం తెలంగాణలో అమలు చేస్తే మరిన్ని పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని తెలిపారు. జీఓ 317 బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని, తాత్కాలిక ఉపశమనంగా ఇచ్చిన జీఓ 190 అమలు చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని, గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్నీ గురుకులాల మాదిరిగా మహాత్మా జ్యోతిబాఫూలే గురుకులాల టైం టేబుల్‌ను సవరించాలని డిమాండ్ చేశారు. ఎన్సీటీఈ అనుమతితో సబ్జెక్ట్‌ల వారిగా ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించాలన్నారు. సర్వీస్‌లో ఉన్న టీచర్లకు సర్వీస్ వెయిటేజ్‌తో టెట్‌కు మార్కులను కలపాలని సూచించారు. 2009 విద్యా హక్కు చట్టం అమలుకు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించి పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సంబంధించి హైకోర్టులో వేసిన లీవ్ పిటిషన్‌ను వెంటనే వెనక్కి తీసుకుని పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై రాష్ట్రంలో ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఏకం చేసి దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్య, ఉపాధ్యాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చావ దుర్గ భవాని, ఎం.రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వి.శాంతికుమారి, డి.సత్యానంద్, ఎస్.మల్లారెడ్డి, బి.రాజు, కె.రంజిత్‌కుమార్, ఎస్.రవి ప్రసాద్‌గౌడ్, కె.రవి కుమార్, జి.శ్రీధర్, ఎ.సింహాచలం, వై.జ్ఞాన మంజరి, ఎం.వెంకటప్ప, పి.వెంకటేశ్వర్లు, జె.యాకయ్య, సీనియర్ నాయకులు పి.మాణిక్ రెడ్డి, ఎన్.కిష్టయ్య, ఎస్.వై.కొండల్రావు, మస్తాన్‌రావు, కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆకుల బాబు, సాయిలు, 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యలన్నీ.. విద్యార్థుల సమస్యలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



