అనిల్ అంబానీ, రిలయన్స్ క్యాపిటల్‌పై సీబీఐ కేసు
2013-14లో జారీ చేసిన ఎన్‌సీడీల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడి
నిధుల మళ్లింపు,మోసపూరిత లావాదేవీలు
బాండ్ల రిడెంప్షన్‌లో డిఫాల్ట్ జరిగిందని ఆరోపణ
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సొమ్ముకు రూ.1,816.22 కోట్ల నష్టం కలిగించారనే ఆరోపణలపై రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సీఎల్), ఆ సంస్థ మాజీ చైర్మెన్ అనిల్ అంబానీతో పాటు మరికొందరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, అవినీతి నిరోధక చట్టం కింద నేరాలకు సంబంధించిన అభియోగాలను ఈ కేసులో చేర్చింది. అయితే తాను ఎలాంటి తప్పూ చేయలేదని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం… కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపీఎఫ్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జులై 31న ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. రిలయన్స్ క్యాపిటల్ చర్యల వల్ల ఈపీఎఫ్ఓకు రూ.1,007.55 కోట్ల అసలు నష్టం, దానిపై రూ.808.67 కోట్ల వడ్డీ భారం ఏర్పడి మొత్తం రూ.1,816.22 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2013-14లో రిలయన్స్ క్యాపిటల్ సెక్యూర్డ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు (ఎన్సీడీలు) జారీ చేసింది. ఆ డిబెంచర్లలో ఈపీఎఫ్ఓ తరఫున నాలుగు పోర్ట్‌ఫోలియో మేనేజర్లు, వాటిలో రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కూడా ఒకటి మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టాయి. ఈ డిబెంచర్లు 2023-24లో మెచ్యూరిటీకి రావాల్సి ఉంది. అయితే సంస్థలోని బాధ్యులు మోసపూరిత లావాదేవీలు, నిధుల మళ్లింపునకు పాల్పడటంతో డిబెంచర్లను గడువు పూర్తయ్యాక తిరిగి చెల్లించడంలో రిలయన్స్ క్యాపిటల్ విఫలమైందని సీబీఐ ఆరోపించింది.
ఫలితంగా ఈపీఎఫ్ఓకు భారీ ఆర్థిక నష్టం సంభవించిందని పేర్కొంది. ఈ ఫిర్యాదుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన సమాచారమే ఆధారమైంది. బీడీఓ ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన ట్రాన్సాక్షన్ ఆడిట్లో రిలయన్స్ క్యాపిటల్‌లో 2019 డిసెంబర్ 7 నుంచి 2021 డిసెంబర్ 6 వరకు జరిగిన అనేక అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు లభించాయని ఈడీ వెల్లడించింది. అంతేగాక.. అంతకుముందు కాలంలో కూడా సంస్థ నిధులను అక్రమంగా మళ్లించిందని గుర్తించినట్టు ఫిర్యాదులో పేర్కొంది.అక్రమ రుణాల మంజూరు, నిధుల మళ్లింపు, తనఖా భద్రత విలువను దెబ్బతీసే చర్యలు వంటి అంశాలపై ఈడీ ప్రాథమికంగా గుర్తించిన వివరాలు సంస్థ ఆర్థిక పరిస్థితి క్షీణించడానికి కారణమై ఉండొచ్చని సీబీఐ భావిస్తోంది. అదే కారణంగా డిబెంచర్ హోల్డర్లకు చెల్లింపులు చేయలేకపోయిందని, దాని ప్రభావం ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై పడిందని తన ఎఫ్ఐఆర్లో ఆరోపించింది.కాగా అనిల్ అంబానీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. రిలయన్స్ క్యాపిటల్ బోర్డుకు తాను 2005 నుంచి 2021 నవంబర్ వరకు మాత్రమే నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మెన్‌గా ఉన్నాననీ, అనంతరం భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బోర్డును రద్దు చేసి అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిందని తెలిపారు. తాను ఎలాంటి అక్రమానికీ పాల్పడలేదని, చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని హక్కులను వినియోగించుకుంటానని అనిల్ అంబానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు రుజువైతే, ఈపీఎఫ్ఓ నిధుల నష్టానికి దారితీసిన పరిణామాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు.



