నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వివేకానంద, శ్రీసాయి, కార్మేల్, వేద వాహిని, విద్య వాహిని, అగస్త్య డిగి, లిటిల్ ఫ్లవర్, ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యాల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానిక ప్రజానీకం ఆరోపిస్తోంది. వేల చొప్పన ఫీజులు కట్టాలని విద్యార్థుల తలిదండ్రులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని వారు వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, పెన్నులు, పెన్సిల్స్,టై, బెల్టు, జామెట్రి బాక్సులు, ఐడీ కార్డులతో స్కూల్ కు సంబంధించి ప్రతి వస్తువు తమ దగ్గరే కొనాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో విసిగి వేసారిపోయిన విద్యార్థుల తలిదండ్రులు సోమవారం మండల పరిధిలోని కత్తల్వాడీ గ్రామ సర్పంచ్ గోపాలరావు, గ్రామ యువకులతో కలిసి గ్రామంలోకి ప్రయివేటు స్కూల్ బస్సులు రాకుండా సంయుక్తంగా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రయివేటు స్కూల్స్ యాజమాన్యం విద్యను వ్యాపారంగా మార్చుకుని ఫీజుల పేరుతో పేద విద్యార్థుల తలిదండ్రుల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు కట్టాలని నిత్యం ఫోన్లతో పాటు స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ లు పెడుతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతూ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ చెప్పిన వివరాల ప్రకారం.. మొత్తం మండలంలో ఉన్న 10 ప్రయివేటు బడులలో 17 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వెల్లడించారు. ఇందులో వివేకానంద స్కూల్ లోనే 700 మందికి పైగా చదువుతున్నారని పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే ప్రయివేటు బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య మండల వ్యాప్తంగా 17 వేలపైనే ఉన్నారని, ఇందులో ఖచ్చితంగా 15 వేల మంది పేద విద్యార్థులే ఉన్నారనీ, వారి తలిదండ్రులను ప్రయివేటు యాజమాన్యం ఎంతలా పీడిస్తుందో ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రయివేటు బడుల్లో ఫిజుల నియంత్రణ చర్యలను చేపట్టి, నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



