– రైతులను పట్టించుకోని ప్రజా ప్రభుత్వం అంటూ విమర్శ
– పెద్దవాగు ప్రాజెక్టును పునరుద్ధరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక
– మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్ మాజీ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆత్మీయంగా పలకరించి, పలువురిని పరామర్శించారు. అనంతరం గుమ్మడివల్లి లోనీ పెద్దవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో గిరిజనులు, దళితులు, చిన్న, సన్నకారు రైతుల సాగునీటి అవసరాల కోసం పెద్దవాగు ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. అయితే ప్రాజెక్టు గండిపడి దెబ్బతిన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు, స్థానిక శాసనసభ్యులు ఉన్నప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. సుమారు రూ.3.5 కోట్ల వ్యయంతో కేవలం తూతూమంత్రంగా చిన్న కట్ట నిర్మించారని, దాని వల్ల రైతులకు ఒక్క సెంటు భూమికీ సాగునీరు అందని పరిస్థితి నెలకొందని విమర్శించారు. అశ్వారావుపేటతో పాటు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల రైతులు కూడా ఈ ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి పెద్దవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని, లేనిపక్షంలో రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కాసాని నాగ శేషపద్మ, కాసాని చంద్రమోహన్, డాక్టర్ భూక్యా ప్రసాద్ రావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు అంకిత మల్లికార్జునరావు, ఆసుపాక మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, జుజ్జురపు శ్రీరామమూర్తి, తగరం జగన్నాధం, చిన్నబ్బాయి, మాజీ సర్పంచ్ బైటి రాజేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.



