గల్ఫ్ దేశాల తీవ్ర అసంతృప్తి అమెరికా ప్రజల్లోనూ ఇదే అభిప్రాయం
పశ్చిమాసియాలో చల్లారని ఉద్రిక్తతలు
‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదిక వెల్లడి
అబుదాబీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్‌తో సుదీర్ఘకాలంగా సాగుతున్న సైనిక వైరం పశ్చిమాసియా అంతటా భయాందోళనల ను పెంచుతున్న వేళ, అమెరికా అనుసరిస్తున్న విధానాలపై గల్ఫ్ దేశాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందా? ఇరాన్‌తో ఎలా వ్యవహరించాలన్న దానిపై యూఎస్ వద్ద స్పష్టమైన, స్థిరమైన వ్యూహం కొరవడిందా? అందువల్లే తమ దేశాలు నిరంతరం ఇరాన్ ప్రతికార దాడుల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోందని అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే గల్ఫ్ భాగస్వామ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన నివేదిక ఈ విషయాన్నే బలపరుస్తుండడం గమనార్హం.
అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రతికార దాడులకు తామే మొదటి బలిపశువుగా మారుతున్నామని గల్ఫ్ భాగస్వామ్య దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాల ఆందోళనకు గల కారణాలను ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రాసుకొచ్చింది. డబ్ల్యూఎస్‌జే నివేదిక ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిలో స్థిరత్వం కనిపించడం లేదని తెలుస్తోంది. ఒకసారి తీవ్రమైన సైనిక హెచ్చరికలు జారీ చేయడం, మరుసటి రోజే దాడులను వాయిదా వేసి శాంతి ఒప్పందాలపై ఆశలు వ్యక్తం చేయడం వల్ల అమెరికా దీర్ఘకాలిక వ్యూహం ఏమిటో అర్థం కాక గల్ఫ్ దేశాలు తీవ్ర అయోమయానికి గురవుతున్నాయి.
అమెరికా నెత్తిన శిరోభారం
అమెరికాతో యుద్ధ వాతావరణం ముదిరితే, ఇరాన్ నేరుగా అమెరికాపై కంటే తమ సమీపంలో ఉన్న గల్ఫ్ దేశాలపై, వాటి ముఖ్యమైన చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక వసతులపై ప్రతికార దాడులు చేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వేసే క్షిపణులు, డ్రోన్లను ఎదుర్కొనేందుకు తమ వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థలు సరిపోవని గల్ఫ్ దేశాలు భయపడుతు న్నాయి. అందువల్లే అమెరికా నుంచి అదనపు రక్షణ ఆయుధాలు, రక్షణ హామీని కోరుతున్నాయని డబ్ల్యూఎస్‌జే నివేదిక స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూతపడటం, పశ్చిమాసియా అంతటా యుద్ధ భయాలు నెలకొనడం వల్ల వ్యాపారం, చమురు ఎగుమతులు, ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటాయని గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.గల్ఫ్ దేశాల ఆందోళనపై ఇజ్రాయిల్ మాజీ సైనిక నిఘా అధికారి డాని సిట్రినోవిచ్ వాల్ స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కంటే గల్ఫ్ దేశాల నేతల మాటలకే డోనాల్డ్ ట్రంప్ వద్ద అధిక ప్రాధాన్యత ఉంది. గల్ఫ్ నాయకులు ఇతర విషయాల కంటే ప్రాంతీయ స్థిరత్వానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ఇరాన్ మౌలిక వసతులపై వైమానిక దాడులు జరిగితే, దానికి ప్రతికారంగా ఇరాన్ తమ కీలక ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తుందని వారు తీవ్రంగా భయపడుతున్నారు’’ అని డాని ట్రినోవిచ్ అన్నారు.
సౌదీ అరేబియా వర్సెస్ యూఏఈ
ఇరాన్ సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో గల్ఫ్ మిత్రదేశాల భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయని డబ్ల్యూఎస్‌జే నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ పదే పదే ట్రంప్‌తో మాట్లాడి దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలని కోరుతున్నారు. అమెరికా బలవంతంగా హార్ముజ్ జలసంధిని సైనిక బలంతో తెరవాలని చేసిన ప్లాన్‌ను కూడా సౌదీ తొలుత నిరోధించింది. ప్రత్యక్ష యుద్ధం జరిగితే తమ చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ భీకర ప్రతికార దాడులు చేస్తుందనే ఆందోళన సౌదీకి ఉన్నదని డబ్ల్యూఎస్‌జే నివేదించింది. దీనికి విరుద్ధంగా యూఏఈ మాత్రం ఇరాన్‌పై అత్యంత కఠినమైన సైనిక బలాన్ని ప్రయోగించాలని ట్రంప్‌పై ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ విప్లవాత్మక గార్డ్స్ లొంగిరావాలంటే అమెరికా వైమానిక దాడులతో పాటు హార్ము జ్ జలసంధిని తన సైనిక నిఘాలోకి తీసుకోవాలని, అవసరమైతే గ్రౌండ్ ఆపరేషన్లు కూడా చేపట్టాలని యూఏఈ సూచిస్తోందని డబ్ల్యూఎస్‌జే తెలిపింది.
అమెరికా అంతర్గత రాజకీయాల ఒత్తిడి
ఇరాన్‌తో యుద్ధం విషయంలో దేశం బయటి నుంచే కాక, అమెరికాలో కూడా ట్రంప్‌పై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఉన్నట్టు డబ్ల్యూఎస్‌జే పేర్కొంది. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఓటర్లలో పెరుగుతున్న ఆగ్రహం రిపబ్లికన్ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందనే భయం ఆ పార్టీలో ఉన్నట్టు చెప్పింది. ఇరాన్ సైతం ట్రంప్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడిని గమనిస్తోందని, ఒకవేళ దౌత్య చర్చలు విఫలమైతే అమెరికా దాడులు చేయకముందే ముందస్తు ప్రతికార దాడులకు దిగేందుకు ఐఆర్జీసీ వ్యూహాలు రచిస్తోందని సమాచారం.
ట్రంప్ యుద్ధ వ్యూహంపై అసహనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



