Tuesday, August 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఓటరు నాడి పట్టని ట్రంప్

ఓటరు నాడి పట్టని ట్రంప్

- Advertisement -

అప్రధాన అంశాలకు ప్రియారిటీ
ప్రజా సమస్యలపై దృష్టి సారించని అధ్యక్షుడు
మధ్యంతరం వేళ పడిపోతున్న రేటింగ్

వాషింగ్టన్ : ప్రజలు తనను చిరకాలం గుర్తుంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తుంటారు. అందుకోసం ఆయన అనేక విన్యాసాలు చేస్తారు. అయితే వేసవి ఉక్కపోత ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇరాన్‌తో నెలకొన్న ప్రతిష్టంభన, ఆర్థికపరమైన అమెరికా ప్రజల ఆందోళనలు, వ్యక్తిగత వ్యామోహాల కారణంగా రిపబ్లికన్ పార్టీలో ఏర్పడిన విభేదాలు వంటి అంశాలు ఆయనకు శిరోభారంగా మారాయి. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఓటర్లు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చే అంశాల విషయంలో ఆయన రేటింగ్ దారుణంగా పడిపో తోంది. చాలా మంది అమెరికా అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. రాజకీ యాలలో పట్టును నిలుపుకోవడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తారు. మద్దతుదారులను మెప్పిం చడానికి వివాదాలను ఎంచుకుంటారు. అంతే కాదు…తన పంథాను హఠాత్తుగా మార్చుకుంటారు.

తుగ్లక్ చేష్టలను తలపిస్తూ…
ట్రంప్ చర్యలు కొన్ని తుగ్లక్‌ను గుర్తుకు తెస్తున్నాయి. అధ్యక్షభవనంలోని ఈస్ట్ వింగ్‌ను కూల్చివేసి ఆ ప్రదేశంలో బాల్‌రూమ్‌ను నిర్మిస్తున్నారు. సౌత్ లాన్‌లో ఓ కొత్త హెలికాప్టర్ ప్యాడ్ రూపుదిద్దుకుంటోంది. పార్కులలో గడ్డిని మార్చేందుకు భారీ ప్రణాళికలు వేశారు. ‘మేము అన్ని పార్కులలో గడ్డిని మార్చేందుకు ప్రణాళికలు వేస్తున్నాం’ అని ఆయన గత వారం చెప్పారు. గడ్డి కూడా మనుషుల వంటిదేనని, దానికీ ప్రాణం ఉంటుందని అన్నారు. అయితే వీటన్నింటినీ ఓటర్లు పట్టించుకుంటారా అన్నది సందేహమే. తన గోల్ఫ్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లలో ఒక దానిలో ట్రంప్ విజయం సాధించారు. ‘దీనినే ప్రతిభ అంటారు’ అని తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన గొప్పగా రాసుకొచ్చారు. అయితే ఈ ఆత్మస్తు తికి, దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలకు ఏ మాత్రం పొంతన లేదు. అమెరికాను గొప్పగా తీర్చి దిద్దడంపై, వాషింగ్టన్‌ను అందంగా మార్చేయడంపై ట్రంప్ దృష్టి సారించారని హౌస్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్మన్ జిమ్ జోర్డాన్ ప్రశంసలు కురిపించారు.

సమస్యలపై అవగాహనే లేదంటున్న అమెరికన్లు
మరోవైపు డెమొక్రాట్లు మాత్రం ట్రంప్ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఇరాన్ యుద్ధం, ఇతర సమస్యలకు బాధ్యుడు ట్రంపేనని ఆరోపించారు. ‘పదవీవిరమణ చేసిన సైనికులలో చాలా మంది తమ కార్లలో పెట్రోలును నింపుకోలేకపోతున్నారు. నిత్యావసరాలను కొనలేకపోతున్నారు. అద్దెలు పెరుగుతున్నాయి. ప్రజల సమస్యలను ట్రంప్ పరిష్కరించడం లేదు’ అని డెమొక్రాట్లు మండిపడుతున్నారు. ట్రంప్ నిర్ణయాలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. గత వారం సీఎన్‌ఎన్/ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్ నిర్వహించిన పోల్ ప్రకారం ట్రంప్ తప్పుడు సమస్యలపై దృష్టి సారించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను ట్రంప్ పట్టించుకోవడం లేదని ఏకంగా 73 శాతం మంది వయోజనులు తేల్చి చెప్పారు. తాము దైనందిన జీవనంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ట్రంప్‌కు అవగాహనే లేదని వారు పెదవి విరిచారు. ట్రంప్ మాత్రం తన హావభావ విన్యాసాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా వచ్చినవి బూటకపు సర్వేలని ఆయన కొట్టిపారేశారు.

ఎదురు దెబ్బలతో సతమతం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ చూడని అత్యంత ఘోరమైన బీభత్సాన్ని ఇరాన్‌లో చూస్తారంటూ కొద్ది రోజుల క్రితమే హూంకరించిన ట్రంప్… చివరికి సైనిక చర్యను నిలిపివేశారు. సోమవారం మధ్యాహ్నం ఇరాన్‌తో చర్చలు మొదలవుతాయని చెప్పినా ఆ సూచనలేవీ కన్పించలేదు. 2021 జనవరి 6న జరిగిన హింసలో దోషులుగా తేలిన తన మద్దతుదారులు, ఇతరులకు పరిహారం చెల్లించడానికి ఏకంగా ఓ నిధినే ఏర్పాటు చేశారు. అయితే ఆ విషయంలో కూడా ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ నిధి విషయంలోనూ, అటార్నీ జనరల్‌గా బ్లాంచ్ నియామకం విషయంలోనూ సెనెట్‌లోని రిపబ్లికన్లతో ట్రంప్ నేరుగా తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -