Tuesday, August 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅది సూసైడ్‌ నోట్‌ కాదు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చార్జీషీట్‌

అది సూసైడ్‌ నోట్‌ కాదు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చార్జీషీట్‌

- Advertisement -

భవనాలే కాదు రాజకీయంగా సమాధి కట్టడమూ తెలుసు
89 కేసులున్న సీఎం రేవంత్‌‌రెడ్డి క్రిమినల్‌‌ వేస్ట్‌
నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడొద్దు
2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలి
ప్రభుత్వ ఒత్తిడి వల్లే పెద్ది సుదర్శన్‌‌రెడ్డి మరణం
అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు జరపాలి
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాక ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన గడ్డం వేణు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. ఆయన విడుదల చేసింది సూసైడ్‌‌ నోట్‌ ‌కాదనీ, రాష్ట్ర ప్రభుత్వంపై చార్జీషీట్‌ ‌వంటిదని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 89 కేసులున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన “క్రిమినల్ వేస్ట్”అని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు, నిరుద్యోగులను మోసం చేసినందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్‌ ‌హామీ ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 16,978 ఉద్యోగాలనే మాత్రమే భర్తీ చేసిందన్నారు. అందులోనూ బీఆర్‌ఎస్‌ ఇచ్చిన నోటిఫికేషన్లను తీసేస్తే 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని వివరించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో సమాధానం చెప్పాలని రాహుల్‌‌గాంధీని, రేవంత్‌‌రెడ్డిని డిమాండ్‌ ‌చేశారు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన విజయం అంటే 150 మంది గురుకుల విద్యార్థుల మరణాలా? లేక ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు “ఎండ్రిన్ తాగి చావండి” అనే పరిస్థితి కల్పించడమా?అని ప్రశ్నించారు. 21 ఏండ్లకే చట్టసభల్లో ప్రవేశానికి అవకాశం కల్పించాలంటూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను యువకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేతిలో లేని అంశాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. 21 ఏండ్ల అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసినా అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు.

జాబులు లేని క్యాలెండర్‌
ఎన్నికల సమయంలో నిరుద్యోగులను కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకోవడం కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా అలవాటేనని కేటీఆర్ విమర్శించారు. యూత్ డిక్లరేషన్‌ సహా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా యువతను మోసం చేసిందని చెప్పారు. ఉద్యోగాల పేరుతో అసెంబ్లీలో పెట్టింది జాబ్ క్యాలెండర్ కాదనీ,”జాబులు లేని క్యాలెండర్” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరాశ చెందొద్దు
యువత ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందొద్దనీ, ఒత్తిడికి గురికావొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎవరూ ఆత్మహత్యలు లేదా బలవన్మరణాలకు పాల్పడొద్దని కోరారు. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు వారి భవిష్యత్తుకు అండగా నిలిచే విధానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ విద్యార్థులు, చదువుకున్న యువతను “క్రిమినల్ వేస్ట్” అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించడంపై రాహుల్‌‌గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

ఎన్నికల అఫిడవిట్‌ ‌నింపే తెలివి ఉందా?
విద్యార్థులను, యువతను అవమానించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ అన్నారు. ఆయన జీవితంలో ఎప్పుడైనా పోటీ పరీక్ష రాశారా? కనీసం ఉద్యోగానికి దరఖాస్తు ఫారం నింపారా? అని ప్రశ్నించారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌ను సైతం స్వయంగా నింపే తెలివి రేవంత్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. లక్షలాది మంది విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్” అనడం అత్యంత అవమానకరమని అన్నారు. రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, రూ.200 కోట్ల జూబ్లీహిల్స్‌‌లోని బోధి ప్యాలెస్ వంటి నిర్మాణాలన్నీ ఇంజినీర్ల ప్రతిభ ఫలితమేనని గుర్తు చేశారు. అలాంటి ఇంజినీర్లనే అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారికి భవనాలు నిర్మించడం మాత్రమే కాదనీ, అవమానించిన నాయకులకు, ఆ పార్టీలకు రాజకీయంగా సమాధి కట్టడం కూడా తెలుసని అన్నారు.

అసెంబ్లీలో ఉద్యోగాల గురించి అడుగుతాం
అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. యువతకు ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరపాలని కోరారు. ప్రభుత్వం ఇందుకు సిద్ధం కాకపోతే యువతకు చేసిన ద్రోహాన్ని అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున గట్టిగా నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఐటీ రంగం క్షీణించడానికి కూడా ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. తెలంగాణ ఐటీ ప్రగతి తిరోగమనంలోకి వెళ్లిందన్నారు.

అవి కాళేశ్వరంలో భాగం కాదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నిండిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వస్తోందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. గాయత్రి పంప్ హౌస్, మేడారం పంపింగ్ వ్యవస్థను ఎవరు నిర్మించారో, అవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా అని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రివర్స్ పంపింగ్, మానేరు నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పీకి నీటిని తరలించే కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు.

భూముల కోసమే మెట్రో స్వాధీనం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేటీఆర్ ఆరోపించారు. ప్రయివేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు. మెట్రో భూములను కొల్లగొట్టేందుకే ఈ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో మెట్రో విస్తరణకు అభ్యంతరం చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందో, మెట్రోను స్వాధీనం చేసుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఏంటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని అన్నారు. ఆయన అకాల మరణం అత్యంత దురదృష్టకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జి జగదీశ్‌‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌‌కుమార్‌, నాయకులు జీవన్‌‌రెడ్డి, రాకేశ్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -