Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతమిళనాడులో ముగిసిన ఎస్‌ఎన్‌ఎమ్‌ఈవీ కార్యక్రమం

తమిళనాడులో ముగిసిన ఎస్‌ఎన్‌ఎమ్‌ఈవీ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తమిళనాడులోని అరియలూరు, కడలూరు జిల్లాల్లో ఉప-జాతీయ మలేరియా నిర్మూలన ధ్రువీకరణ కార్యక్రమం(ఎస్‌ఎన్‌ఎమ్‌ఈవీ) విజయవంతంగా పూర్తయింది. మలేరియా నిర్మూలన దిశగా సాధించిన పురోగతిపై బృందం అంచనా వేసింది. ఎన్‌‌సీవీబీడీసీ అదనపు డైరెక్టర్‌, ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ ‌కె.పద్మజ నేతృత్వంలోని ఈ బృందంలో కన్సల్టెంట్‌ ‌డాక్టర్‌ ‌స్నేహ(ఛత్తీస్‌‌గఢ్‌), ప్రాంతీయ కన్సల్టెంట్‌ అధికారి డాక్టర్‌ ‌శశి(కేరళ), ఎన్‌‌సీవీబీడీసీ అదనపు డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌సౌకత్‌ ‌కమల్‌(‌న్యూఢిల్లీ) ఉన్నారు.
తొలిరోజు కార్యక్రమంలో డీన్ డాక్టర్ కుమారన్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆకాష్, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ రామ్ గణేష్, మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ అరవింద్, డాక్టర్ మధియా అరస్ అలగన్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కృష్ణమూర్తి, కీటక శాస్త్రవేత్త శ్రీమతి కేథరీన్, పాథాలజిస్టులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రేమ్ కుమారి, సంబంధిత వైద్య కళాశాలల నుంచి మైక్రోబయాలజీ నిపుణులు, మలేరియా కార్యక్రమ సిబ్బంది, ఆరోగ్య ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కేసుల గుర్తింపు, చికిత్స, వర్గీకరణ, ప్రయోగశాల నిర్ధారణ సామర్థ్యం, నాణ్యతా హామీ యంత్రాంగాలు, చికిత్సా పద్ధతులు, వాహక దోమలపై నియంత్రణ చర్యలు, తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అరియలూరు ఆస్పత్రిలో పాథాలజీ, మైక్రోబయాలజీ ప్రయోగశాలలు, ఔట్‌పేషెంట్ విభాగం, ఫీవర్ వార్డులను బృంద సభ్యులు తనిఖీ చేశారు. స్థానికంగా సంక్రమించిన మలేరియా కేసులను తక్షణమే గుర్తించడానికి, దర్యాప్తు చేయడానికి, వర్గీకరించడానికి, స్పందించడానికి ఆరోగ్య వ్యవస్థ యొక్క సంసిద్ధతపై ఆరా తీశారు.
రోగుల నివాసాలలో క్షేత్రస్థాయి ధ్రువీకరణ చేశారు. ఫీల్డ్‌ ‌ద్వారా వచ్చిన అభిప్రాయాలు, వాస్తవ పరిస్థితులపై ఒక నివేదికను ఆ బృందం కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నది. దీని ఆధారంగా తెలంగాణలో ఫైలేరియాసిస్‌ ‌నిర్మూలన-14లో భాగంగా హైదరాబాద్‌ ‌జోన్‌‌లోని రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలు, వరంగల్‌ ‌జోన్‌‌లో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించనున్నారు.
మలేరియా నిర్మూలన-4( హైదరాబాద్ జోన్ లోని వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్. వరంగల్‌ ‌జోన్‌‌లోని జగిత్యాల)లో భాగంగా అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యాధి నిర్మూలన లక్ష్యాలకు అనుగుణంగా నిఘాను బలోపేతం చేయడానికి, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి, ప్రజారోగ్య చర్యలను కొనసాగించడానికి ఇది దోహదపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -