రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్
సీనియర్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో ‘80 ఏండ్ల
స్వాతంత్రం- పౌరుల హక్కులు’పై సెమినార్
నవతెలంగాణ-హయత్‌నగర్
ప్రజాస్వామ్య పరిరక్షణ పౌరుల బాధ్యత అని రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. ‘80 ఏండ్ల స్వాతంత్రం- పౌరుల హక్కులు’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లోని సహారా ఎస్టేట్‌లో సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు ఎన్. ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రాజ్యాంగం అనేదాన్ని ప్రజల రక్షణకు ఏర్పాటు చేసుకున్నామని, కానీ పాలకవర్గాలు దాన్ని బలహీనపరిచే పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను ఒక్కటొక్కటిగా హరించే ప్రయత్నం జరుగుతున్నదని అన్నారు. దీన్ని ఎత్తిచూపాల్సిన పత్రికలు, మీడియా 90శాతం కార్పొరేట్ల చేతుల్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సిన ఎన్నికల వ్యవస్థ కూడా అధికారానికి బందీ అయ్యిందన్నారు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ఏడీఆర్ అసోసియేషన్ అనే సంస్థ ఒక నివేదికలో ఎత్తి చూపిందని తెలిపారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో వచ్చిన ఓట్ల సంఖ్య అధికంగా ఉన్నాయని హైకోర్టులో కేసు వేయగా, మూడేండ్ల తర్వాత కోర్టు దీన్ని జరిగిందేదో జరిగిందన్న పద్ధతిలో కొట్టివేశారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే చట్టం అమలు కావటం లేదన్న విషయం అర్థమవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే భవిష్యత్తులో రాజ్యాంగం ఇలాగే ఉంటుందా? ఉండదా? చెప్పలేమని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ జెండా కూడా మారవచ్చని అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యయుతంగా సమా వేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఇక ముందు ఉండకపోవచ్చని తెలిపారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చ లేవనెత్తకుండా కేవలం వందే మాతరం, జనగణమన పేరుతో పార్లమెంటులో ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపిం చారు. నెమ్మదినెమ్మదిగా ‘జనగణమన’కు మంగళం పాడేందుకు అధికారంలో ఉన్నవారు ప్రయత్ని స్తున్నారని చెప్పారు. సర్ పేరుతో ఎన్నికల వ్యవస్థని బలహీనపరిచే అవకాశం ఉందని, ఈ పేరుతో కొద్దిమంది పేర్లు తొలగించే నెపంతో ఎక్కువమంది పేర్లను ఎన్నికల లిస్టులో లేకుండా చేస్తున్నారని అన్నారు. ఓటర్ లిస్టులో అనర్హులు ఉన్నారన్న పేరుతో, తమకు నచ్చని ఇతరులను కూడా తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజల విన్నపాలను, ఎన్నికల వ్యవస్థ పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పడుతుందని చెప్పారు. ఇది రాబోయే కాలంలో మన దేశానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని, కాబట్టి ప్రజలు తమ పౌరసత్వాన్ని కాపాడుకోవాలంటే, పౌరులుగా, సంస్థలుగా స్పందించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ కుట్రల్ని ఆపగలగాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహారా ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నోముల సుదర్శన్ రెడ్డి, ఫ్యాక్ నాయకులు రవీంద్ర శర్మ, డీఎఎస్వీ ప్రసాద్, కె.ఉమామహేశ్వరరావు, కామేష్ బాబు, ఎస్కే జానీ, ఎన్.అంజయ్య, కీసరి నర్సిరెడ్డి, ఏబూసి నరసింహ, పృద్వీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ పౌరుల బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


