Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘ఐఎఫ్‌ఎంఐఎస్‌’తో ఉద్యోగులకు వేతనాలు

‘ఐఎఫ్‌ఎంఐఎస్‌’తో ఉద్యోగులకు వేతనాలు

- Advertisement -

ఓయూ కార్పస్ ఫండ్, ఎఫ్‌డీలపై సర్కార్ దృష్టి..!
భవిష్యత్‌ అవసరాల నిల్వ నిధులు
మళ్లిస్తారంటూ అనుమానాలు
పాత పద్ధతిలోనే వేతనాలు, పెన్షన్ చెల్లించాలి : ఉద్యోగ, విద్యార్థి,
అధ్యాపక సంఘాల డిమాండ్
నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ

​ఓయూ ఉద్యోగుల వేతనాలను తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ ద్వారా ఐఎఫ్‌ఎంఐఎస్ విధానం ద్వారా చెల్లిస్తున్నాయి. దీనిపై పలు అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్‌ఎంఐఎస్‌), ఈ-కుబేర్ విధానం ద్వారా వేతనాల చెల్లింపుల నేపథ్యంలో విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్వావలంబనపై చర్చ మొదలైంది. భవిష్యత్‌ అవసరాల కోసం విశ్వవిద్యాలయాలు సేకరించుకున్న కార్పస్ ఫండ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రభుత్వం కన్నేసిందనే అనుమానాలను ఉద్యోగ, అధ్యాపక, విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. వర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం, జులై నెల వేతనాలను తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ ద్వారా ఐఎఫ్‌ఎంఐఎస్ విధానంలో చెల్లించారు. త్వరలోనే పెన్షన్లనూ ఇదే విధానంలో చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకూ విస్తరించినట్టు సమాచారం.

​ఉద్యోగ, అధ్యాపక, విద్యార్థి సంఘాలు అభ్యంతరం
ఉద్యోగ, అధ్యాపక, విద్యార్థి సంఘాలు ఈ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. వాటి ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన, నిధుల వినియోగంపై పాలకమండళ్లు నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, విద్యార్థుల ఫీజులు, అంతర్గత ఆదాయాల ద్వారా ఏర్పడిన నిధులపై ప్రభుత్వ నియంత్రణ ఉండటం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ప్రధానంగా వేతనాలు, పెన్షన్లకే పరిమితమయ్యేయి. మౌలిక వసతులు, పరిశోధన, కొత్త కోర్సులు, హాస్టళ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు విశ్వవిద్యాలయాలు తమ అంతర్గత వనరులనే వినియోగించుకున్నాయని పలువురు గుర్తు చేస్తున్నారు. కొత్త విధానం వల్ల భవిష్యత్‌లో కార్పస్ ఫండ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఫీజుల ఆదాయంపై ప్రభుత్వ నియంత్రణ పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు.

స్వయం ప్రతిపత్తి లేనట్టే!
ఆడిట్ అధికారులు కూడా విశ్వవిద్యాలయాల పరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై మరింత జోక్యం చేసుకుంటున్నారని, దీనివల్ల ఉపకులపతుల నిర్ణయాధికారంపై ప్రభావం పడుతోందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ప్రతి నిర్ణయానికీ ప్రభుత్వ అనుమతి అవసరమయ్యే పరిస్థితి వస్తే స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సుల ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది. దీనినిఅడ్డుకోకపోతే విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి, ఆర్థిక స్వావలంబన ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఈ నూతన విధానంలో వేతనాలు చెల్లింపుల పై ఓయూ రిజిస్ట్రార్ ను, ఇన్‌చార్జి ఫైనాన్స్ ఆఫీసర్ ను వివరణ కోరగా వారు స్పందించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -