రేపు జరగనున్న సర్వసభ్య సమావేశంలో చర్చ సాగేనా.?
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి 45 రోజులకోసారి సర్పంచ్లు, మండలస్థాయి అధికారుల భాగస్వామ్యంతో మండల పరిషత్ సమావేశాలు నిర్వహిస్తూ పల్లె పాలనలో పారదర్శకతను తీసుకరావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరేనా అనే సందేహాలు వెలువడుతున్నాయి. పంచాయ తీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులతో రేపు బుధవారం మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అన్ని గ్రామాల సర్పంచ్లు, మండలస్థాయిలో ఉన్న అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించి సమావేశానికి వందశాతం హాజరై పలు సమస్యలపై చర్చ సాగితే అభివృద్ధి, పాలనలో పారదర్శకత మెరుగుపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను లేవనెత్తగా అధికారులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సర్పంచులు గ్రామాల్లోని సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించడం ద్వారా అధికారుల్లో జవాబదారీతనం వస్తుందని భావించిన ప్రభుత్వం ఇక నుంచి 45 రోజులకోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
చర్చించే అంశాలివే..
మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచులు, మండలస్థాయి అధికారులు పాల్గొంటారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తారు. సర్పంచులు ప్రస్తావించే సమస్యలకు సంబంధితశాఖల అధికారులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది.



