– సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని కొత్తూరు రోడ్డును హైవే రహదారితో అనుసంధానం చేయాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించి కొత్తూరు వైపుగా విస్తరించాలని సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిరోజూ ప్రజలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు సంచరించే ఈ రోడ్డుకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తూరు రోడ్డు పరిసర గ్రామాల ప్రజలకు అత్యంత కీలకమైనదని తెలిపారు. నేరుగా హైవేతో అనుసంధానం చేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు, స్థానికులకు అడ్డుగా నిర్మించిన గోడ వల్ల రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి ఆ గోడను తొలగించి, రోడ్డును హైవేతో కలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవ్వడమే కాక సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే, ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొలికపోగు సర్వేశ్వరరావు, జాజిరి జ్యోతి, రావుల రాజబాబు, బండి వేలాద్రి తదితరులు పాల్గొన్నారు.



