Thursday, August 6, 2026
E-PAPER
Homeజాతీయంక్రీడలూ కాషాయీకరణే!

క్రీడలూ కాషాయీకరణే!

- Advertisement -

భారత హాకీ శతాబ్దకాల గుర్తింపైన బ్లూ జెర్సీకి వీడ్కోలు దాని స్థానంలో కాషాయ రంగు జెర్సీ
హాకీ ఇండియా కార్యవర్గ ఆమోదం లేకుండానే నిర్ణయం?
బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ మరో రాజకీయ ఎజెండా
కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శల వెల్లువ
తీవ్రంగా తప్పుబడుతున్న ప్రతిపక్షాలు, మాజీ క్రీడాకారులు

భారత హాకీ జట్టు సంప్రదాయ బ్లూ జెర్సీని ప్రపంచకప్‌నకు ముందు కాషాయ రంగు (ఆరెంజ్‌ కలర్‌)తో భర్తీ చేయాలని హాకీ ఇండియా తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఇది జెర్సీ మార్పు కాదనీ, దేశంలోని క్రీడా సంస్థలు, జాతీయ, సాంస్కృతిక గుర్తింపు, చిహ్నాలను హిందూత్వ రాజకీయాలకు అనుగుణంగా మార్చే బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ దీర్ఘకాల వ్యూహంలో భాగమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత హాకీకి దాదాపు శతాబ్దకాలంగా ఉన్న బ్లూ జెర్సీ గుర్తింపును చెరిపేసి ‘సంఘ్‌ పరివార్‌’ను ప్రతిబింబించేలా కాషాయరంగుతో భర్తీ చేసే ప్రయత్నంగా దీనిని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని హాకీ మాజీ క్రీడాకారులు, రాజకీయ విశ్లేషకులు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు.

న్యూఢిల్లీ : జెర్సీ రంగు మార్పు నిర్ణయం తనకు తెలియకుండా, కార్యవర్గ సమావేశంలో చర్చించకుండా అమలు చేశారని హాకీ ఇండియా అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్‌ దిలీప్‌ తిర్కీ స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. జాతీయ జట్టు గుర్తింపును మార్చేంత కీలక అంశంపై ఎన్నికైన కార్యవర్గానికి సమాచారం ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్‌ సింగ్‌ మాత్రం ఈ నిర్ణయం అధికారులందరికీ తెలుసని చెప్పినా, దాన్ని ఎవరెవరు ఆమోదించారో వెల్లడించకపోవడం గమనార్హం.

​ప్రజాస్వామ్య వ్యవస్థల తర్వాత క్రీడా సంస్థలే?
2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం, కాగ్‌, విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు, విద్యా వ్యవస్థలు వంటి అనేక స్వతంత్ర సంస్థలు ప్రభుత్వ ప్రభావంలో పనిచేస్తున్నాయనే ఆరోపణలు పదేపదే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో హాకీ ఇండియా కూడా చేరిందనే విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు క్రమంగా రాజకీయ అధికారానికి అనుబంధ సంస్థల్లా మారుతున్నాయనే ఆక్షేపణలు ఎదురవుతున్నాయి. హిందూత్వ భావజాల వ్యాప్తికి పరాకాష్టగా ఇటీవలే ‘వందే మాత రం’నకు సంబంధించిన చట్టపరమైన మార్పులను కేంద్రం చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా భారత హాకీ జాతీయ జట్టు జెర్సీ రంగు మార్పు కూడా ఆ చర్యల్లో భాగమేననే మాటలు వినిపిస్తున్నాయి.

​భిన్నత్వాన్ని బలహీనపర్చే చర్యలు
భారత్‌ బలం భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడంలోనే ఉందనే భావనను మోడీ ప్రభుత్వం బలహీనపర్చడానికి యత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశమంతటా ఒకే సాంస్కృతిక, రాజకీయ గుర్తింపును నెలకొల్పే ప్రయత్నం జరుగుతోంది. భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రాంతీయ ప్రత్యేకతలతో కూడిన భారతీయతను పక్కనబెట్టి.. ఒకే రంగు, ఒకే గుర్తింపు, ఒకే సిద్ధాంతాన్ని దేశానికి ప్రతీకగా నిలబెట్టాలనే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

​క్రీడా సంఘాలపై రాజకీయ ఆధిపత్యం
ఒకప్పుడు రాజకీయ నాయకులు క్రీడా సంఘాలకు నేతృత్వం వహించడాన్ని తీవ్రంగా విమర్శించిన బీజేపీ.. ప్రస్తుతం దేశంలోని ప్రధాన క్రీడా సంఘాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా కలుగజేసుకుంటోంది. క్రికెట్‌ నుంచి రెజ్లింగ్‌, హాకీ వరకు… ఇలా అనేక క్రీడా సంఘాల నిర్వహణలో కాషాయ పార్టీకి సన్నిహితులే కీలక స్థానాల్లో ఉన్నారు. ప్రభుత్వ అనుకూల భావన కోసం క్రీడా సంస్థలు రాజకీయ ఆదేశాలను అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. 
క్రికెట్‌లో విఫలం.. ఇప్పుడు హాకీలో వేలు బీజేపీ ప్రభుత్వం క్రికెట్‌లోనూ కాషాయ రంగు జెర్సీని తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. క్రికెట్‌ ప్రపంచకప్‌ 2023లో భారత జట్టుకు కూడా కాషాయ జెర్సీ ప్రతిపాదన వచ్చినట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆటగాళ్ల అభ్యంతరాలతో ఆ ఆలోచన అమలు కాలేదు. అయితే క్రికెట్‌లో విఫలమైన ప్రయత్నాన్ని ఇప్పుడు హాకీలో అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు యోచిస్తోంది.

​హాకీ ఇండియా వివరణపై సందేహాలు
హాకీ ఇండియా మాత్రం రెండు కారణాలు చెప్తోంది. ఆస్ట్రోటర్ఫ్‌పై నీలి రంగు స్పష్టంగా కనిపించదని సాంకేతిక నిపుణులు సూచించారనీ, కాషాయం భారత జాతీయ జెండాలోని ఒక రంగు కావడంతో దానిని ఎంపిక చేశామని తెలిపింది. అయితే ఈ వివరణను మాజీ ఆటగాళ్లు నమ్మడం లేదు. జాతీయ జెండాలో మధ్యలోని అశోకచక్రం కూడా నీలి రంగులోనే ఉంటుందనీ, కాబట్టి ఈ వాదనలో తార్కికత లేదని అంటున్నారు.

​నిరాశ కలిగించింది : విరెన్‌ రస్క్వినా
భారత మాజీ కెప్టెన్‌ విరెన్‌ రస్క్వినా ఈ నిర్ణయాన్ని ‘ఇబ్బందికరమైనది’గా అభివర్ణించారు. ”హాకీ ఇండియా ఎన్నో మంచి పనులు చేసింది. కానీ ఇది మాత్రం నిరాశ కలిగించింది. భారత హాకీ జట్టు గుర్తింపు ఎప్పుడూ బ్లూ జెర్సీయే. ఎన్నో ఏండ్లుగా ఆ బ్లూ జెర్సీని గర్వంగా ధరించాను. అభిమానులు కూడా భారత జట్టును నీలిరంగులోనే చూడాలనుకుంటారు. మరి కాషాయానికి కారణమేంటి?” అని ప్రశ్నించారు.

​హాస్యాస్పదం : ఒలింపిక్‌ స్వర్ణ విజేత భాస్కరన్‌
1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు స్వర్ణం అందించిన మాజీ కెప్టెన్‌ వి. భాస్కరన్‌ ఈ నిర్ణయాన్ని ‘హాస్యాస్పదం’గా అభివర్ణించారు. ”నీలి రంగు అంటే భారత హాకీ గుర్తింపు. ఇతర క్రీడల జట్లు బ్లూను స్వీకరించే ముందే భారత హాకీ జట్టు దశాబ్దాలుగా అదే రంగు ధరించింది. ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ ఇలా మార్చడం అసలు అర్థం కావడం లేదు” అని అన్నారు.
​ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది? : మాజీ కెప్టెన్‌ అజిత్‌ పాల్‌ సింగ్‌ ”బ్లూ కలర్‌ మా కాలానికి ముందే భారత జట్టు గుర్తింపు. 2021, 2024 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు కూడా అదే జెర్సీలో గెలిచాం. మరి ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని అజిత్‌ పాల్‌ సింగ్‌ ప్రశ్నించారు.

​ఇది ఐపీఎల్‌ కాదు : ధనరాజ్‌ పిల్లే
నాలుగు ఒలింపిక్స్‌, నాలుగు ప్రపంచకప్‌లు, నాలుగు ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో భారత తరఫున ఆడిన మాజీ కెప్టెన్‌ ధనరాజ్‌ పిల్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ”ఇది ఐపీఎల్‌, హాకీ ఇండియా లీగ్‌ కాదు. జట్లు రంగులు మార్చుకునే ఫ్రాంచైజీ టోర్నమెంట్‌ కూడా కాదు. జాతీయ జట్టు గుర్తింపును ఇలా మార్చకూడదు” అని ఆయన వ్యాఖ్యానించారు.

​ఆటగాళ్లపై దృష్టి పెట్టాలి : పర్గత్‌ సింగ్‌
మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం పంజాబ్‌ ఎమ్మెల్యే పర్గత్‌ సింగ్‌ ఈ నిర్ణయాన్ని సంకుచిత ఆలోచనకు నిదర్శనంగా అభివర్ణించారు. ”జెర్సీ రంగులు మార్చడం కంటే ఆటగాళ్లకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, హాకీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం ముఖ్యం” అని అన్నారు.

​ అభిప్రాయాలు తీసుకోవాలి : మాజీ కెప్టెన్‌ శ్రీజేశ్‌
మాజీ కెప్టెన్‌, ఒలింపిక్‌ దిగ్గజ గోల్‌కీపర్‌ పి.ఆర్‌. శ్రీజేశ్‌ మాట్లాడుతూ.. ”2014లో కూడా వేర్వేరు రంగుల జెర్సీలు వాడాం. అప్పట్లో ఎలాంటి సమస్య రాలేదు. ఏ రంగు వాడాలనేది సమాఖ్య నిర్ణయం. అయితే ఆటగాళ్ల అభిప్రాయాన్ని కూడా తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి” అని చెప్పారు.

బ్లూ జెర్సీ కేవలం రంగు కాదు
భారత హాకీ చరిత్రలో 1928 ఒలింపిక్స్‌ నుంచి ధ్యాన్‌ చంద్‌, బల్బీర్‌ సింగ్‌, అజిత్‌ పాల్‌ సింగ్‌, ధనరాజ్‌ పిల్లే, శ్రీజేశ్‌ వరకు ఎన్నో తరాలు బ్లూ జెర్సీతోనే ప్రపంచ వేదికపై దేశానికి గౌరవం తెచ్చాయి. ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ అనే పదం భారత క్రీడా జట్లకు అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపుగా మారింది. అలాంటి చారిత్రక గుర్తింపును రాజకీయాల కోసం మార్చడం క్రీడా సంప్రదాయాలపై దాడిగా మాజీ క్రీడాకారులు అభివర్ణిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -