పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరగనుందో, శాంతి ఎప్పుడు నెలకొంటుందో ఎవరికీ తెలియని స్థితి. సంక్షోభపు తొలి రోజుల్లో తాపీగా అసలేమీ జరగనట్లు, జరిగినా మనకేమీ కాదన్నట్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న మన ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల మనకు అవసరమైన ఎరువులు, ఇంథనం, గ్యాస్ దిగుమతుల గురించి సమీక్ష జరపాల్సి వచ్చింది. అఫ్ కోర్స్, పార్లమెంటుకు వచ్చి ఇరాన్‌పై దాడులతో దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇంతవరకు చర్చించాలన్న ఆలోచన రాలేదనుకోండి. ఇక మోడీ జిగినీ దోస్తు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికాకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నా బుద్ధిరావటం లేదు. ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్ మీద ఉత్తి పుణ్యానికి చేసిన దాడులతో స్వయంగా సష్టించిన సంక్షోభం నుంచి బయటపడేందుకు దిక్కుతోచటం లేదు. ఇరాన్‌తో ఒక రోజు యుద్ధం అంటాడు మరోరోజు శాంతి ఒప్పందం అని చెబుతాడు. మరుసటిరోజే ఉల్లంఘించి ఇరాన్‌ను చావు దెబ్బతీస్తా అంటూ దాడు లకు తెగబడతాడు. కొద్ది రోజుల తరువాత ఇరాన్ దిగివచ్చింది గనుక నిలిపివేశా నంటాడు. ప్రారంభం నుంచీ ఇదే తంతు. ఇప్పుడు మరోసారి ఒప్పందం గురించి మాట్లాడుతున్నాడు. ‘క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్’ అని కవి ఆడవారిని ఆడిపోసుకున్నాడు గానీ ట్రంప్‌ను చూస్తే కచ్చితంగా తిరగరాసి ఉండేవాడు. నవంబరు మూడవ తేదీన జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఏదోవిధంగా గట్టేందుకు పశ్చిమా సియాలో ట్రంప్ ఇంకా కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఎక్కడో జరిగిన పేలుడులో ఇద్దరు తమ సైనికులు మరణించారనే సాకుతో ఒప్పందాన్ని పక్కన పెట్టి లెబనాన్‌పై మరోసారి దాడులకు ఇజ్రాయిల్ పూనుకుంది. ఐక్య అరబ్ ఎమిరేట్స్(యుఏయి) గల్ఫ్ దేశాల్లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో నేరుగా జట్టుకట్టింది, విభీష ణుడి పాత్ర పోషిస్తున్నది. దానికి అమెరికా మద్దతు సరేసరి. లెబనాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇరాన్ అనుకూల హిజబుల్లా నాయకత్వాన్ని హతమార్చేందుకు, దానికి పట్టున్న దక్షిణ లెబనాన్ ప్రాంతాలపై ఇజ్రాయిల్ దాడులు చేయటమే కాదు, అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నది.యుఏయి నగరమైన దుబాయ్‌లో ఏడు చోట్ల పేలుళ్లు జరిగా యంటే ఎందుకు అన్నది వేరే చెప్పనవసరం లేదు. ఇరాన్ మద్దతు ఉన్న ఎమెన్‌లోని హౌతీలు ఎర్ర సముద్రం-అరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్ జల సంధిలో ఆంక్షలు విధించి ఉల్లంఘించిన సౌదీ అరే బియా నౌకలపై దాడి చేశారు. దానికి ప్రతిగా ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల సాయుధ శక్తులపై అమెరికాతో కలసి సౌదీ వైమానిక దాడులు చేసింది. వీటన్నింటినీ చూసినపుడు నేరుగా దాడులు చేస్తే జరిగేదేమీ లేకపోగా పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందనే ఎత్తుగడతో అమెరికా తన తొత్తులతో ఆ పని చేయిస్తున్నది.
అమెరికా అతి తెలివితేటలను గమనించి ఇరాన్ కూడా తన వ్యూహాన్ని మార్చుకున్నది.
ట్రంప్‌ను ఒక మూలకు నెట్టేందుకు పశ్చిమాసియాలో తనకు అనుకూలంగా పనిచేసే సాయుధ శక్తులన్నింటిని రంగంలోకి దించింది. ప్రాంతీయ రంగాలను విస్తరిస్తామని, ఉక్కిరిబిక్కిరి చేసే ఎత్తుగడలను అనుసరిస్తామని పరోక్షంగా ప్రత్యక్షంగా చెబుతూనే ఉంది. అమెరికా మాదిరే తాను కూడా మద్దతుదార్లతో కాగల కార్యాలను నడిపిస్తామని చెబుతోంది. పాకిస్థాన్ ద్వారా భుజాలపై పెట్టుకొని విమానాలు, క్షిపణులను కూల్చివేసే ఆయుధాలను టెహరాన్‌కు చైనా అందించిందనే వార్తలు వచ్చాయి. అవి నిజమో కాదో గానీ తన మిత్రదేశాలకు అమెరికా ఎలా ఆయుధాలు పంపుతున్నదో ఇరాన్ కూడా తన శ్రేయోభిలాషుల నుంచి అలాంటి సాయం పొందితే తప్పేమిటి! ఇరాన్‌పై దాడుల ప్రారంభంలో సంయమనం పాటించిన హౌతీ సాయుధులు తొమ్మిది నెలల విరామం తరువాత గతనెల మూడో వారంలో ఎర్ర సముద్రంలో దాడులకు ఉపక్రించారు. హార్ముజ్ జలసంధిపై అమెరికా కేంద్రీకరణను దెబ్బతీసేందుకే ఇది అన్నది స్పష్టం. కీలకమైన ఎర్ర సముద్రం, ఏడెన్ జలసంధిపై పట్టు కోసం సౌదీని ప్రోత్సహించిన అమెరికా ఎమెన్ మీద దీర్ఘకాలం దాడులు చేయించింది. ఆక్రమంలో ఇరాన్‌కు మద్దతిచ్చే హౌతీలు రాజధాని సనాతో సహా అనేక ప్రాంతాలపై పట్టు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు ఎగుమతి చేస్తున్నది. దాన్ని దెబ్బతీసే ఎత్తుగడ కూడా హౌతీల దాడుల వెనుక ఉందని చెబుతున్నారు.
గతేడాది అమెరికా వైమానిక దాడులను తట్టుకొని నిలిచిన హౌతీల బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెంటగన్ దాడుల్లో దాని ప్రభుత్వ ప్రధాని, తొమ్మిది మంత్రులు మరణించిన తరువాత కూడా అది తట్టుకొని నిలవటంతో అమెరికా రాజీకీ వచ్చి దాడులు నిలిపింది. 2015 తరువాత తొలిసారిగా హౌతీల ప్రతినిధులు తమ ఆధీనంలోని సనా నగరం నుంచి ప్రత్యేక విమానంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరై సురక్షితంగా తిరిగి రావటమే కాదు ఇరాన్ రివల్యూషనరీ గార్డులు, క్షిపణులు, డ్రోన్ల తయారీకి అవసరమైన విడిభాగాలను కూడా వెంట తీసుకువచ్చినట్లు వార్తలొచాయి. ఇరాన్‌తో సంప్రదింపులలో ఉన్నట్లు ట్రంప్ చెప్పాడు. ఓమన్‌తో కలసి హార్ముజ్ జలసంధి మార్గాలను సమన్వయపరుచు కొనేందుకు దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్లు ఇరాన్ చెబుతోంది. అదే జరిగితే, దానికి అమెరికా అడ్డుకాలు పెట్టకపోతే మంచిదే, వాషింగ్టన్ నుంచి అలాంటి పరిణామాన్ని ఆశించవచ్చా!
కొనసాగుతున్న అమెరికా కుట్రలు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



