కార్పొరేట్ లాభాల కోసమే
లేబర్ కోడ్స్
జీవనోపాధిని దెబ్బతీస్తున్న విధానాలపై పోరాటం :
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో మోడీ సర్కార్ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యాక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహిస్తున్న ఆటోజాతా గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా చౌరస్తాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామాలు, పట్టణాల్లో బహిరంగ సభలు, జాతాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ నిర్వహిస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలనలో దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికుల హక్కులు తీవ్ర దాడికి గురవుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్ లాభాల కోసం ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ లేబర్ కోడ్స్ తెచ్చారని తెలిపారు. దేశంలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారన్నారు. గ్రామీణ పేదల జీవనోపాధిని దెబ్బతీస్తున్న విధానాలను దేశ ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు.
ఎనిమిది గంటల పనిదినం, ఓవర్ టైంకి రెట్టింపు వేతనం చెల్లించాలనీ, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ విధానాలను అపాలని, ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక సంఘ హక్కులను హరించే విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. రైతుల పంటలకు ప్రభుత్వ కొనుగోలు గ్యారెంటీ కల్పించాలని, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టడం అంటే వ్యవసాయాన్ని నీరుగార్చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు నేటికీ రుణాలు, ఎరువులు, విత్తనాలు వంటి సమస్యలపై ఆందోళనలో ఉన్నారన్నారు. భారత వ్యవసాయాన్ని దెబ్బతీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీగ్రామ్ జీ పథకాన్ని రద్దు చేయడంతోపాటు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. ఏడాదికి 200 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. ఈ విధానాల అమలుకు అడుకట్ట వేసేందుకు ఈనెల 10న జరిగే జైలు భరో కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, కార్యదర్శి జి.సాయిలు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బాగారెడ్డి, పాండు రంగారెడ్డి, నాయకులు ప్రసన్న రావు, నర్సింలు, నరేష్, బాలరాజు, శ్రీనివాస్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
క్విట్ ఇండియా స్ఫూర్తితో ‘జైల్ భరో’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



