Friday, August 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

సమస్యలు పరిష్కరించాలి : సీఐటీయూ 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈఓయు పరిశ్రమలో కార్మికుల ఆందోళనకు మద్దతు


నవతెలంగాణ-జగద్గిరిగుట్ట

​ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ పరిశ్రమలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూత్బుల్లాపూర్‌ ‌నియోజకవర్గం గాంధీనగర్ పారిశ్రామికవాడ వైఎంఎస్ కాలనీలోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈఓయు పరిశ్రమ ఆవరణలో కార్మికులు చేస్తున్న ఆందోళన గురువారం నాటికీ ఎనిమిదో రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి పాలడుగు భాస్కర్‌ హాజరై కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లుగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ ‌చేయకుండా ఫిక్స్డ్ టర్మ్ పేరుతోనే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో అధిక పనిగంటలు చేయించుకుంటూ యాజమాన్యం తీవ్ర శ్రమదోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. 10 ఏండ్లకు పైగా పనిచేసిన కార్మికులను కూడా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకుండా పని భారం పెంచుతోందని, వేతనాలు పెంచకుండా అన్యాయం చేస్తోందని అన్నారు. చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బోనస్‌ను కూడా చెల్లించడం లేదన్నారు.

పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా ఉత్పత్తిలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టర్మ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, అదనపు పనికి డబుల్ వేతనం ఇవ్వాల్సి ఉండగా సింగిల్ వేతనంతో సరిపెడుతున్నారని విమర్శించారు. పని ప్రదేశంలో వేధింపులు, అధిక పనిభారం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. ఎనిమిది రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు అర్హులైన ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా కార్మిక చట్టాల అమలు బలహీనపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ పర్మినెంట్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్, సీఐటీయూ మేడ్చల్ జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా నాయకులు కీలుకాని లక్ష్మణ్, లింగస్వామి, సంతోష్, రాము, ధర్మారావు, లక్ష్మయ్యతో పాటు కార్మికులు సింహాచలం, లక్ష్మణ్, మదన్, మోసిన్, రాజకుమార్, లింగం, రాజు, ఫైజల్, మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -