Friday, August 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేటీపీపీకి బొగ్గు కష్టాలు

కేటీపీపీకి బొగ్గు కష్టాలు

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యం..
విద్యుత్ కేంద్రాలకు వెంటాడుతున్న కొరత
అధికారులకు 
ముందు చూపు లేకపోవడమే కారణమా?
బఫర్‌స్టాక్‌లో 
75వేల మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే నిల్వ


నవతెలంగాణ-గణపురం

జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రానికి (కేటీపీపీ) బొగ్గు కష్టాలు మొదలయ్యాయి. రోజుకు 11వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా వర్షాల కారణంగా బొగ్గు రవాణాలో ఆటంకాలు కలగడంతో విద్యుత్ కేంద్రానికి అవసరమైన బొగ్గు అందడం లేదు. దాంతో బఫర్‌స్టాక్‌లో ఉన్న 75వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో విద్యుత్ ఉత్పత్తిపై ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్టులో 600 మెగావాట్ల ప్లాంటు ద్వారా 14.4 మిలియన్లు, 500 మెగావాట్ల ప్లాంట్ ద్వారా 12 మిలియన్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. మొన్నటివరకు వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా కరెంట్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. ఆ విషయంలో అధికారులకు ముందుచూపులేదని తెలుస్తోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి సింగరేణి నుండి వచ్చే బొగ్గు రవాణా తగ్గిపోయింది. ప్రతిరోజూ 15 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగం జరుగుతుండటంతో అంతే మొత్తం బొగ్గు కేటీపీపీకి రవాణా కావాల్సి ఉంది. 10 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు మాత్రమే చేరుతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో బఫర్ స్టాక్‌తో ప్లాంట్లను నడిపిస్తూ వస్తున్నారు. సాధారణంగా విద్యుత్ ప్లాంట్ల వద్ద 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలుంటాయి. నిబంధనల ప్రకారం 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కేటీపీపీలో 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే సింగరేణి నుంచి అనుకున్న స్థాయిలో బొగ్గు విద్యుత్ కేంద్రాలకు చేరడం లేదు. వర్షాలు పడకుంటే వ్యవసాయానికి ఇబ్బంది ఉంటుంది. వర్షాలు కంటిన్యూ అయితే సింగరేణికి రెండు నెలలు పాటు సమస్యలు తప్పవు. ఈ క్రమంలో కేటీపీపీకి రవాణా చేసే బొగ్గు కాంట్రాక్టర్లను బొగ్గు ఉత్పత్తిని స్పీడ్ అప్ చేయాలని సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాక, విద్యుత్ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వలతోపాటు ప్రతిరోజూ విద్యుత్ ఉత్పత్తి అవసరానికి ఎంత బొగ్గు పడుతుందనే దానిపై క్షుణ్ణంగా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. జెన్కో కోల్ ప్లాంట్ అధికారులతో సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ బొగ్గు నిల్వల విషయంలో రాజీ పడొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నట్టు సమాచారం. బొగ్గు రవాణా కాంట్రాక్టర్లు బొగ్గును తరలించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -