Friday, March 27, 2026
E-PAPER
Homeజాతీయంఏపీలో ఘోర ప్రమాదం

ఏపీలో ఘోర ప్రమాదం

- Advertisement -

మార్కాపురం జిల్లాలో టిప్పర్‌- ట్రావెల్స్‌ బస్సు ఢీ
బస్సులో చెలరేగిన మంటలు
14 మంది సజీవదహనం
15 మంది ప్రయాణికులకు గాయాలు..
మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలింపు
బస్సు హరేకృష్ణ ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తింపు
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం : ఏపీ సీఎం ఆదేశం

మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయివేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మూలమలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో క్షణాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 14మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మార్కాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు హరేకృష్ణ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుగా గుర్తించారు.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. మృతులు కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మార్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల నుంచి ఏపీలోని మార్కాపురం జిల్లా పామూరుకు వస్తున్న హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు బస్సు రాయవరం సమీపంలోని పలకల క్వారీ వద్ద మలుపు తిరుగుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు, టిప్పర్‌ ఇంజన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన 10మంది ప్రయాణికులు వెంటనే బస్సు దిగిపోయారు. మరికొందరు దిగే ప్రయత్నం చేస్తుండగానే దట్టమైన పొగ అలుముకోవడంతో బస్సులోనే 14 మంది సజీవదహనమయ్యారు. 15 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జాయింట్‌ కలెక్టర్‌ కల్పన కుమారి పరామర్శించారు.రిమ్స్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

బస్సు కండీషన్‌ సరిగాలేకనే..
బస్సు కండీషన్‌ సరిగా లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ఇదే విషయాన్ని బస్సు డ్రైవర్‌తో మాట్లాడినట్టు చెబుతున్నారు. ప్రమాదానికి ముందు బస్సును యర్రగొండపాలెం వద్ద గంటసేపు నిలిపి మరమ్మతులు చేపట్టారని అన్నారు. ఇదిలా ఉండగా ప్రమాద సమయంలో బస్సు స్టీరింగ్‌ స్ట్రక్‌ అయ్యినట్టు బస్సు డ్రైవర్‌ చెబుతున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మృతులకు రూ.5 లక్షల పరిహారం
మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ఏపీ క్యాబినెట్‌ భేటీలో చర్చ జరిగింది. మృతులకు ఏపీ మంత్రులు సంతాపం తెలిపి, బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే విధంగా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని మంత్రులు, అధికారులకు సూచించారు.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం
ఏపీలోని మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందడం.. కొందరికి తీవ్ర గాయాలవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

బస్సు నిర్మల్‌ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతి చెందిన, గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఏపీ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని తెలిపారు. సీఎం ఆదేశాలతో ఏపీ సీఎస్‌తో సీఎస్‌ రామకృష్ణారావు మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -