Friday, March 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'సీతారామ' పూర్తయ్యేనా..?

‘సీతారామ’ పూర్తయ్యేనా..?

- Advertisement -

గత బడ్జెట్‌ కంటే భారీగా తగ్గిన నిధులు
పూర్తవ్వాలంటే రూ.9000 కోట్లు అవసరం
బడ్జెట్‌లో కేటాయించింది రూ.336.78 కోట్లు
2026 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న సీఎం

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించే లక్ష్యంతో భద్రాద్రి జిల్లా అశ్వాపురం వద్ద చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు ఏండ్లుగా సాగుతూ…నే ఉన్నాయి. ప్రధానంగా సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌, పాలేరు లింక్‌ కెనాల్‌తోపాటు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిర్మించాల్సిన డిస్ట్రిబ్యూటరీలకు భూసేకరణ, టెండర్ల ప్రక్రియలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. 2026 ఆగస్టు 15నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గతేడాది పంద్రాగస్టున పంప్‌ హౌస్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఈ ప్రాజెక్టు పూర్తికి తొలుత నిర్ణయించిన గడువు 2020, మార్చి… నిర్దేశిత గడువు దాటి ఆరేండ్లయినా ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా పూర్తవుతుందని రైతాంగం ఆశించినా కనీస నిధులు కూడా కేటాయించకపోవటంతో ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో మరో పదేండ్ల్లయినా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని రైతుసంఘాలు విమర్శిస్తున్నాయి.

పూర్తికాని టన్నెల్‌ పనులు
సీతారామ ప్రాజెక్టులో ప్రధాన కాలువ పొడవు 114 కి.మీ. కాగా.. ఇప్పటికి 110 కి.మీ. పనులు పూర్తయ్యాయి. 8వ ప్యాకేజీ పరిధిలోకి వచ్చే భద్రాద్రి జిల్లా జూలూరుపాడు టన్నెల్‌ నిర్మాణం నేటికీ మొదలు కాలేదు. ఇది పూర్తయితేనే ఖమ్మంలోని పాలేరు లింక్‌ కెనాల్‌కు గోదావరి నీళ్లు చేరతాయి. సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పరిధిలోకి వచ్చే 9-12 ప్యాకేజీల్లో నాలుగో పంపుహౌస్‌తోపాటు టన్నెల్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దమ్మపేట వద్ద నిర్మించే ఈ పంపుహౌస్‌ (యాతాలకుంట) పనులు 65శాతం పూర్తయ్యాయి.

డిస్ట్రిబ్యూటరీలు లేక.. నీరు వచ్చే మార్గం లేక..
భద్రాద్రి జిల్లా పరిధిలో మూడు పంప్‌ హౌస్‌లతో పాటు ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తయింది. డిస్ట్రిబ్యూటరీలు లేకపోవడంతో నీరందించలేని పరిస్థితి. వీటి నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నిర్మించాల్సిన 8 డిస్ట్రిబ్యూటరీలు, ఒక ఎస్కేప్‌ కమ్‌ క్రాస్‌ రెగ్యులేటరీ కోసం రెండేండ్ల క్రితం టెండర్‌ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు ఈ రెండు జిల్లాల్లో ఒక్కో డిస్ట్రిబ్యూటరీకి మాత్రమే టెండర్‌ ప్రక్రియ పూర్తిచేశారు. మిగిలిన వాటికి కాంట్రాక్టర్లను ఖరారు చేయాల్సి ఉంది.

అడుగడుగునా జాప్యం
భద్రాద్రి జిల్లాలో 104 కి.మీ మేర ప్రధాన కాలువల తవ్వకం పనులు పూర్తయ్యాయి. పాలేరు లింక్‌ కెనాల్‌ పరిధిలో 13-16 ప్యాకేజీలున్నాయి. 13వ ప్యాకేజీ పనులకు మూడు నెలల క్రితం టెండర్‌ ప్రక్రియ పూర్తయినా పనుల ప్రారంభానికి అటవీ అనుమతులు ప్రతిబంధకంగా మారాయి. 14వ ప్యాకేజీకి భూసేకరణ నిధులు నేటికీ కేటాయించలేదు. 16వ ప్యాకేజీలోని కీలకమైన 8 కి.మీ. టన్నెల్‌ పనులకు నిధులు లేక నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని నెలలుగా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పాలేరు లింక్‌ కెనాల్‌, సత్తుపల్లి ట్రంక్‌ కెనాల్‌ పనులు సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే పాలేరు లింక్‌ కెనాల్‌ను రూ.1,600 కోట్లతో చేపట్టారు.

ఏన్కూరులోని 104.4వ కి.మీ వద్ద నుంచి పనులు ప్రారంభించారు. ఏన్కూరు నుంచి పాలేరు వరకు 76.925 కి.మీ మేర కాలువ తవ్వకం పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు 2,606 ఎకరాల భూమి అవసరం. గత ప్రభుత్వం 758 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. పాలేరు లింక్‌ కెనాల్‌ 13, 14, 15, 16 ప్యాకేజీల పనులకు అప్పట్లోనే తవ్వకాలు జరిగాయి. దీనిలో భాగమైన 13వ ప్యాకేజీలో జూలూరుపాడు వద్ద టన్నెల్‌ తవ్వకం పనులు ప్రారంభమే కాలేదు. డోర్నకల్‌ మండలంలో 10 కి.మీ కాలువ తవ్వకం పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 29 కి.మీ మేర కాలువ తవ్వాల్సి ఉండగా.. పనులు ముందుకు సాగడం లేదు.

బడ్జెట్‌.. బడ్జెట్‌కూ తగ్గుతున్న నిధులు
సీతారామ ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌ బడ్జెట్‌కూ నిధుల్లో కోతపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తవటానికి ఇంకా రూ.9,000 కోట్ల వరకూ అవసరం కాగా గత బడ్జెట్‌ కన్నా ఈ బడ్జెట్‌లో నిధులు సగానికి తగ్గించారు. 2025 బడ్జెట్‌లో రూ.699.35 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో దాన్ని రూ.336 కోట్లకు కుదించారు. ఇలా ఏటేటా నిధులు తగ్గించుకుంటూపోతే మరో పదేండ్లయినా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమేనని రైతులు అంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ గోదావరి – కృష్ణా నదులను అనుసంధానించే కీలకమైన ప్రాజెక్టుకు నిధులు తగ్గించడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకే బడ్జెట్‌ నిధులు సరిపోతాయి
సీతారామ ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.19 వేల కోట్లకు పైగా కాగా గత ప్రభుత్వం సుమారు రూ.10 వేల కోట్లను ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,036.13 కోట్లను మాత్రమే దీనికోసం కేటాయించింది. గత బడ్జెట్‌ కన్నా ఈ బడ్జెట్‌లో సగానికి పైగా నిధులను కోత పెట్టారు. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నిధులు అవసరం ఉన్నప్పుడల్లా విడుదల చేస్తామని చెబుతున్నారు. బడ్జెట్‌లో కేటాయించకుండా ఎలా విడుదల చేస్తారనేది ప్రశ్న. 2024లో వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 2026 నాటికల్లా పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికావటానికి సుమారు రూ.9000 కోట్లు అవసరం. ఇలా రూ.336 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తూపోతే ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కనీసం మరో పదేండ్లయినా పడుతుంది. ప్రభుత్వం సమీక్షించి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన మొత్తం నిధులను కేటాయించాలి.
-బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -