నవతెలంగాణ – పరకాల
చేనేత కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పరకాల పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేనేత సహకార సంఘం అధ్యక్షులు దాసరి బిక్షపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే భక్త మార్కండేయ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక నైపుణ్యానికి ప్రతీక అని అన్నారు. తెలంగాణలో చేనేత రంగానికి విశిష్టమైన చరిత్ర ఉందని, ముఖ్యంగా వరంగల్ ప్రాంతం దేశవ్యాప్తంగా చేనేత కళకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, వారి జీవనోపాధి మెరుగుపడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న డిజైన్ల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.ముడి సరుకు అందుబాటు, రుణ సౌకర్యాలు, బీమా, సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా చేనేత కార్మికులకు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.



