– మళ్లీరాజకీయ వేదిక
– వర్షాలు లేక రైతులకు నీటి ప్రయోజనం శూన్యం
– గేట్లు దించిన అధికారులు
– ఘనత కోసం మాజీ ఎమ్మెల్యేల అనుచరుల వాట్సాప్ వార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని బచ్చువారిగూడెం పరిధిలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నాటి చిన్నతరహా పెద్దవాగు ప్రాజెక్టు మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు గేట్లు దించడంతో, దీనికి కారణం తమ నాయకుడేనంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు వర్గాల సోషల్ మీడియా బాధ్యులు వాట్సాప్‌లో పోస్టులు చేస్తూ ప్రచారానికి తెరలేపారు.
అయితే, ఈ ప్రాజెక్టు పరిస్థితి మాత్రం ఇప్పటికీ దయనీయంగానే ఉంది. 2023లో కురిసిన భారీ వర్షాలకు సామర్థ్యానికి మించి వరద రావడంతో అప్పటికే శిథిలావస్థకు చేరిన గేట్లు, కరకట్ట దెబ్బతిని ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతింది. అనంతరం అధికారులు తాత్కాలికంగా రింగ్‌బండ్ నిర్మించినప్పటికీ, ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పునరుద్ధరణ జరగకపోవడంతో పరివాహక ప్రాంత రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేకుండా పోయింది.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రాజెక్టును సందర్శించి, వెంటనే పునరుద్ధరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో నిర్వహణ చర్యల్లో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు దించారు.
అధికారుల వివరాల ప్రకారం, గత మంగళవారం కురిసిన వర్షాలకు కేవలం 0.8 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే నమోదైంది. శుక్రవారం నాటికి ప్రాజెక్టులో 825 క్యూసెక్కుల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. అయితే ఈ నీటి పరిమాణం సాగునీటి విడుదలకు సరిపోదని, రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పునరుద్ధరణ, తగినంత వర్షాలు లేకుండా కేవలం గేట్లు దించడం వల్ల రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం లేదని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఈ పరిణామాన్ని రాజకీయంగా తమ ఖాతాలో వేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యేల అనుచరులు సోషల్ మీడియాలో పోటీ ప్రచారం కొనసాగించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.



